
- క్రెడిట్ కార్డులకు ఆర్బీఐ కొత్త రూల్స్
- నెట్‌వర్క్ ఎంపిక నిర్ణయం కస్టమర్‌దే!
న్యూఢిల్లీ: ఇక నుంచి క్రెడిట్ కార్డుల యూజర్లు తమకు నచ్చిన నెట్‌వర్క్‌కు మారొచ్చు. ప్రస్తుతం వీసా, మాస్టర్‌కార్డ్ వంటి నెట్‌వర్క్‌ల ద్వారా బ్యాంకులు/ఇతర ఫైనాన్షియల్ఇన్స్టిట్యూట్లు కార్డులు ఇస్తున్నాయి. ఒక్కసారి కార్డు తీసుకున్నాక నెట్‌వర్క్‌ను మార్చుకోవడం సాధ్యం కాదు. ఈ ఇబ్బంది తొలగిపోయింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఈ విషయమై బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఇతర కార్డ్ నెట్‌వర్క్‌ల సేవలను పొందకుండా వాటి పోటీ కార్డ్ నెట్‌వర్క్‌లతో ఎటువంటి ఒప్పందాన్నీ కుదుర్చుకోవద్దని కార్డ్ జారీదారులకు ఆదేశాలు ఇచ్చింది. కార్డ్ జారీ చేసే సంస్థ కస్టమర్లకు కార్డు ఇష్యూ సమయంలో మల్టిపుల్ కార్డ్ నెట్‌వర్క్‌ల నుంచి ఒకదానిని ఎంచుకోవడానికి ఒక చాయిస్‌ను ఇవ్వాలి. ఇప్పటికే ఉన్న కార్డ్ హోల్డర్‌ల కోసం రెన్యువల్ సమయంలో నెట్‌వర్క్ మార్పిడి ఆప్షన్‌ను అందించాలి. ఆథరైజ్డ్కార్డ్ నెట్‌వర్క్‌లలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్ప్., డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, మాస్టర్ కార్డ్ ఆసియా/పసిఫిక్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపే, వీసా వరల్డ్‌వైడ్ ఉన్నాయి. అధీకృత కార్డ్ నెట్‌వర్క్‌లు క్రెడిట్ కార్డ్‌ల జారీ కోసం బ్యాంకులు/బ్యాంకేతర సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటాయి.
కస్టమర్‌కు ఇచ్చిన కార్డ్ కోసం నెట్‌వర్క్‌ను కార్డ్ ఇష్యూయర్లే నిర్ణయిస్తారు. వాళ్లకు ఏ నెట్‌వర్క్‌తో ఒప్పందం ఉంటే అదే కార్డును ఇస్తారు. కార్డ్ నెట్‌వర్క్‌లు, కార్డ్ జారీ చేసే వారి మధ్య ఉన్న కొన్ని ఒప్పందాలు కస్టమర్ల అవసరాలకు అనుకూలంగా లేవని ఆర్బీఐ పేర్కొంది. ఇక నుంచి కార్డ్ జారీ చేసే బ్యాంక్ లేదా నాన్-బ్యాంకు ఏదైనా నిర్దిష్ట నెట్‌వర్క్ కార్డునే తీసుకోవాలని కస్టమర్‌ను బలవంతం చేయకూడదు.
ఈసారి 7.6 శాతం వృద్ధి...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం వృద్ధిని సాధించవచ్చని, కేంద్ర ప్రభుత్వ రెండో ముందస్తు అంచనాను అధిగమించేందుకు సిద్ధంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం అన్నారు. "2024 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి 7.6శాతం కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నాను. అది 8శాతానికి దగ్గరగా కూడా ఉండవచ్చు" అని ఒక ఇంటర్వ్యూలో దాస్ చెప్పారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 7 శాతం వృద్ధి రేటును సాధించగలదని అన్నారు. 2023–2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.4 శాతం వృద్ధిని సాధించింది.