రూ.17 వేల 545 కోట్ల నుంచి జీరోకు

రూ.17 వేల 545 కోట్ల నుంచి జీరోకు
  •      ఏడాదిలో పతనమైన బైజూ రవీంద్రన్ నెట్​వర్త్
  •     ఫోర్బ్స్ బిలియనీర్స్ ఇండెక్స్ 2024 వెల్లడి

న్యూఢిల్లీ: ప్రముఖ ఎడ్​టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థపకుడు, సంస్థ సీఈవో రవీంద్రన్ సంపద ఒక్క ఏడాదిలోనే దాదాపుగా హరించుకుపోయింది. గతేడాది రూ.17,545 కోట్లు ఉన్న ఆయన నెట్​వర్త్ ప్రస్తుతం సున్నాకు పడిపోయిందని ఇటీవల రిలీజ్ అయిన ఫోర్బ్స్ బిలియనీర్ ఇండెక్స్​2024 వెల్లడించింది. అత్యంత వేగంగా ప్రపంచ స్థాయికి ఎదిగిన బైజూస్ స్టార్టప్ పలు సంక్షోభాలు ఎదురవడంతో అంతే వేగంగా పతనమైందని విశ్లేషణలు వస్తున్నాయి.

 2011లో స్థాపించిన బైజూస్ కరోనా టైమ్​లో 22 బిలియన్ డాలర్ల గరిష్ట విలువకు చేరుకొని ఇండియాలోనే మోస్ట్ వ్యాలబుల్ స్టార్టప్‌గా అవతరించింది. ప్రైమరీ స్కూల్ నుంచి ఎంబీఏ వరకు సరికొత్త లెర్నింగ్ ప్రక్రియలతో ఈ యాప్‌తో ఎడ్యూకేషన్ సెక్టర్​లో భారీ మార్పులు తీసుకొచ్చింది. కరోనా టైమ్​లో అమెరికా, యూరప్ తదితర దేశాలకు విస్తరించింది. భారీ సంఖ్యలో సెంటర్లు, వేలాది ట్యూషన్ సెంటర్లు ఓపెన్ చేసింది. ఈ క్రమంలో విదేశీ నిధులకు సంబంధించి రూల్స్ ఉల్లంఘించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో మనీలాండరింగ్ కేసు నమోదైంది. 

బైజూస్ ఆఫీసుల్లో ఈడీ రైడ్స్ జరిగాయి. మరోవైపు బిజినెస్ పడిపోయింది. అప్పుల భారం ఎక్కువైంది. నిధుల సమీకరణ గగనమై నిర్వహణే కష్టమైంది. ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించలేదు. పీఎఫ్ బకాయిలు కూడా చెల్లించలేదు. పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తీసేసింది. ఈ ఆర్థిక ఒత్తిడులు, పెరుగుతున్న వివాదాలు కంపెనీ తీవ్రంగా దెబ్బతీశాయి. 

2021–22 ఆర్థిక సంవత్సరానికి బైజూ తన రిజల్ట్​ను చాలా లేటుగా పోస్ట్ చేయడంతో కంపెనీ కష్టాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రిజల్ట్​లో 1 బిలియన్‌కు మించి నికర నష్టాన్ని వెల్లడించింది. అప్పటి నుంచి బైజూస్ వ్యాల్యు పడిపోవడం మొదలైంది. కంపెనీ సంపద క్షీణించడంతో రవీంద్రన్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. షేర్‌హోల్డర్‌లు గత నెలలో జరిగిన సమావేశంలో రవీంద్రన్‌ని సీఈవోగా తొలగించాలని ఓటు వేశారు.