దళపతి కజిన్‌గా ఇండస్ట్రీలోకి.. హీరో, విలన్ రోల్స్తో సొంత మార్క్.. ఫోకస్ కోల్పోని విక్రాంత్ సక్సెస్ స్టోరీ

దళపతి కజిన్‌గా ఇండస్ట్రీలోకి.. హీరో, విలన్ రోల్స్తో సొంత మార్క్.. ఫోకస్ కోల్పోని విక్రాంత్ సక్సెస్ స్టోరీ

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల బంధువు అడుగుపెడితే అవకాశాలు త్వరగా వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించడం మాత్రం అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రేక్షకులు చూసేది యాక్టర్​ పర్ఫామెన్స్​ మాత్రమే. ఒక నటుడి నుంచి వాళ్లు కోరుకునేది ఆ నటనే. తమిళ సినీ ఇండస్ట్రీలో అలాంటి కష్టమైన ప్రయాణం చేసిన నటుల్లో విక్రాంత్ సంతోష్ ఒకరు (Vikranth Santhosh).

స్టార్ హీరో విజయ్ బంధువు అనే గుర్తింపుతో ఇండస్ట్రీలోకి వచ్చిన అతను, తర్వాత తనకంటూ ప్రత్యేక ఇమేజ్ కోసం చాలా పోరాడాడు. హీరోగా మొదలై.. సపోర్టింగ్ రోల్స్, విలన్ పాత్రలు, ప్రయోగాత్మక సినిమాలు ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ నటుడిగా నిలదొక్కుకున్నాడు. స్టార్​డమ్ కోసం పాకులాడకుండా తన స్టైల్​లో సినిమాలు చేస్తూ.. ఆడియెన్స్​ని మెప్పిస్తూ తనకంటూ సొంత ఇమేజ్ సంపాదించుకున్నాడు. సెలబ్రెటీ క్రికెట్ లీగ్స్​లో బ్యాట్​ పట్టుకుని రఫ్ ఆడించే విక్రాంత్ లేటెస్ట్​గా ‘ఎల్​బీడబ్ల్యూ’ అనే క్రికెట్ బ్యాక్​డ్రాప్​ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అందులో క్రికెట్ కోచ్​గా కనిపించి మరింత ఇంట్రెస్ట్ పెంచేశాడు. 

చెన్నైలో పుట్టాడు విక్రాంత్ సంతోష్. సినీ కుటుంబ వాతావరణంలో పెరిగిన విక్రాంత్‌‌కు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, సాధారణ లైఫ్​ స్టైల్ అలవాటయ్యాయని దగ్గరివాళ్లు చెప్తుంటారు. స్టార్ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా, చాలా సింపుల్‌‌గా ఉండటం వెనుక అతని తల్లిదండ్రుల పెంపకమే ప్రధాన కారణమని సినీ వర్గాలు చెప్తుంటాయి. అదే విక్రాంత్ వ్యక్తిత్వంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ కుటుంబానికి దగ్గరి బంధువు. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ అతని కజిన్. చిన్నప్పటి నుంచే షూటింగ్‌‌లు, సినిమా చర్చలు, నటుల రాకపోకలు చూస్తూ పెరిగాడు.

అయితే ఇంట్లో సినిమా బ్యాక్‌‌గ్రౌండ్ ఉన్నా, నటుడిగా నిలబడటం కష్టమనే విషయం అతనికి చాలా త్వరగా అర్థమైంది. అందుకే చదువుతోపాటు నటనపై కూడా ఫోకస్ పెట్టాడు. విజువల్ కమ్యూనికేషన్ చదివిన తర్వాత పూర్తిగా సినిమాల వైపు వచ్చాడు. విక్రాంత్ తల్లి చిన్నప్పటి నుంచే ఎంతో సపోర్ట్ ఇచ్చిందని, షూటింగ్స్ ఒత్తిడి వల్ల ఇబ్బందిపడేటప్పుడు ధైర్యం చెప్పేదని పలు సందర్భాల్లో చెప్పాడు. అలాగే తండ్రి కూడా సినిమాల్లో నిలబడాలంటే ఓపిక చాలా అవసరమని ఎప్పుడూ చెప్పేవారట. ఒకసారి కుటుంబం గురించి మాట్లాడినప్పుడు విక్రాంత్ ఇలా అన్నాడు ‘‘నా జీవితంలో నాకు ఎక్కువ బలం ఇచ్చింది ఫ్యామిలీనే. నేను ఎన్ని ఫెయిల్యూర్స్ చూసినా వాళ్లు మాత్రం ఎప్పుడూ నాపై నమ్మకం కోల్పోలేదు.” మరో సందర్భంలో “ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ వస్తుంటాయి. కానీ ఇంటికి వెళ్లినప్పుడు మనల్ని అదే ప్రేమతో చూసే వాళ్లు ఉండటం చాలా పెద్ద విషయం” అని అతను చెప్పిన మాటలు చాలామందిని ఆకట్టుకున్నాయి. 

హీరోగా ఎంట్రీ.. 

విక్రాంత్ మొదట బాలనటుడిగా కెమెరా ముందుకొచ్చాడు. తర్వాత హీరోగా అవకాశం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. 2005లో వచ్చిన కార్క కసదరా సినిమా అతనికి హీరోగా తొలి అవకాశం ఇచ్చింది. ఆ సినిమా ద్వారా మంచి లుక్స్ ఉన్న కొత్త హీరోగా గుర్తింపు వచ్చింది. కానీ సినిమా పెద్ద హిట్ కాలేదు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది నిరాశపడిపోతారు. కానీ విక్రాంత్ మాత్రం ఆగలేదు. వరుసగా సినిమాలు చేస్తూ తనను తాను నిరూపించుకోవాలని ప్రయత్నించాడు. ‘ముదల్ కనవే’, ‘నెంజతై కిల్లాథే’ లాంటి సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.  

విజయ్‌‌తో పోలికలు..

విక్రాంత్ కెరీర్ ప్రారంభంలో విజయ్‌‌తో పోల్చేవాళ్లు. ముఖంలో, స్టైల్లో, బాడీ లాంగ్వేజ్‌‌లో కొంత పోలిక ఉండటంతో చాలామంది “చిన్న విజయ్” అని పిలిచేవారు. మొదట ఇది ప్లస్‌‌గా కనిపించినా, తర్వాత అదే అతనికి భారంగా మారింది. ప్రేక్షకులు అతనిని ప్రత్యేక నటుడిగా కాకుండా విజయ్‌‌తో పోల్చి చూసేవాళ్లు. దాంతో విక్రాంత్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. హీరో ఇమేజ్ కోసం పరుగులు పెట్టకుండా.. నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని భావించాడు. అదే అతని కెరీర్‌‌లో అసలు టర్నింగ్ పాయింట్ అయింది.

‘గోరిపాళయం’తో మారిన కెరీర్

2010లో వచ్చిన గోరిపాళయం సినిమా విక్రాంత్ జీవితాన్ని మార్చేసింది. ఈ సినిమాలో అతను పూర్తి భిన్నమైన పాత్ర చేశాడు. ఎమోషన్, రఫ్ నెస్ కలిసిన ఆ క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇదే సమయంలో విక్రాంత్ గురించి ఇండస్ట్రీలో ఒక మాట వినిపించింది.. “ఇతను కేవలం హీరో మెటీరియల్ మాత్రమే కాదు.. మంచి నటుడు కూడా” అని. ఆ సినిమా తన కెరీర్​లోనే మంచి హిట్​ అందుకోవడంతో తనలో ఆత్మ విశ్వాసం పెరిగింది. 

చిన్న సినిమాలు.. పెద్ద కష్టాలు

విక్రాంత్ కెరీర్‌‌లో చాలా సినిమాలు చిన్న బడ్జెట్‌‌వే. పెద్ద బ్యానర్లు, భారీ ప్రమోషన్లు, స్టార్ మార్కెట్ అతనికి ఎక్కువగా దక్కలేదు. అయినా ప్రతి సినిమాలో కొత్తగా కనిపించేందుకు ప్రయత్నించాడు. కొన్నిసార్లు గ్రామీణ యువకుడిగా, మరికొన్నిసార్లు నెగెటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా నటించాడు. ఇండస్ట్రీలో నిలబడటానికి కేవలం టాలెంట్ సరిపోదు. అదృష్టం కూడా ఉండాలి. విక్రాంత్ దగ్గర టాలెంట్ ఉన్నా, పెద్ద కమర్షియల్ బ్రేక్ మాత్రం చాలా ఆలస్యంగా వచ్చింది.

విశాల్ హీరోగా వచ్చిన ‘పాండియా నాడు’లో విక్రాంత్ చిన్న పాత్ర చేశాడు. అది కీలక పాత్ర కావడంతో స్క్రీన్ టైమ్ తక్కువే అయినా, ఆ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. ప్రత్యేకంగా ఎమోషనల్ సీన్స్‌‌లో అతని నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. చాలామంది విమర్శకులు కూడా “విక్రాంత్‌‌కి సరైన కథ దొరికితే అద్భుతాలు చేయగలడు” అని రాశారు. ఈ సినిమా తర్వాత దర్శకులు కూడా అతన్ని కొత్త కోణంలో చూడటం ప్రారంభించారు.

ప్రయోగాత్మక సినిమాలు

విక్రాంత్ ఎప్పుడూ ఒకే తరహా పాత్రల్లో ఉండిపోలేదు. కొత్త కథలు, భిన్నమైన పాత్రలు చేయడానికి ప్రయత్నించాడు. ‘బక్రీద్’ సినిమాలో ఒంటెతో కలిసి ప్రయాణించే వ్యక్తిగా నటించాడు. తమిళ సినిమాల్లో ఇలాంటి కథ చాలా అరుదుగా వస్తుంది. ఆ సినిమా ద్వారా అతని డిఫరెంట్ చాయిస్ మరోసారి బయటపడింది. అలాగే ‘నాన్ మిరుగమై మారా’ సినిమాలో పూర్తిగా డార్క్ క్యారెక్టర్ చేసి ప్రేక్షకులను షాక్‌‌కు గురి చేశాడు. ఆ పాత్రలో అతని విలనిజం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. 

‘లాల్ సలామ్’తో మళ్లీ ఫోకస్‌‌లోకి..

2024లో విడుదలైన ‘లాల్ సలామ్’ సినిమా విక్రాంత్ కెరీర్‌‌లో మరో ముఖ్యమైన ప్రాజెక్ట్ అయింది. రజినీకాంత్ ప్రత్యేక పాత్రలో కనిపించడం వల్ల సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. ఈ సినిమాలో విక్రాంత్ చేసిన పాత్ర కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌‌లో అతని నటన ఆకట్టుకుంది. అదే సమయంలో అతను “నాకు వచ్చిన ప్రతి పాత్రను నిజాయితీగా చేయాలని మాత్రమే ప్రయత్నిస్తాను” అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

సింపుల్ లైఫ్​

2009లో విక్రాంత్ మానస హేమచంద్రన్‌‌ను వివాహం చేసుకున్నాడు. కుటుంబ జీవితాన్ని ఎక్కువగా ప్రైవేట్‌‌గా ఉంచుతాడు. సోషల్ మీడియాలో కూడా అవసరమైనప్పుడు మాత్రమే కనిపిస్తాడు. వివాదాలకు దూరంగా ఉంటాడు. చాలాకాలంగా ఇండస్ట్రీలో ఉన్నా, కాంట్రవర్సీలతో వార్తల్లోకి రావడం చాలా అరుదు. స్టార్ హీరో బంధువు అనే ట్యాగ్ నుంచి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే వరకు సాగిన విక్రాంత్ జర్నీ చాలామందికి ఇన్​స్పిరేషన్ అవుతుంది.

ఒక ఇంటర్వ్యూలో తన కొత్త ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ విక్రాంత్ ఇలా చెప్పాడు. “ఇప్పుడైతే నేను చేసే ప్రతి సినిమా నాకు నటుడిగా కొత్త అనుభవం ఇవ్వాలి అనుకుంటున్నాను. కేవలం హీరోగా కనిపించడం కోసం కాదు.. ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటికి వెళ్లిన తర్వాత కూడా గుర్తుంచుకునే పాత్రలు చేయాలని ఉంది. నా కెరీర్‌‌లో చాలా ఎత్తుపల్లాలు చూశాను. అందుకే ఇప్పుడు కథ వినగానే మొదట నేను ఆ పాత్రతో కనెక్ట్ అవుతున్నానా లేదా అనేదే చూస్తాను. పాత్ర నిజంగా బలంగా ఉంటే ఎంత చిన్న రోల్ అయినా చేయడానికి రెడీ. ప్రేక్షకులు ‘ఈ పాత్ర విక్రాంత్ తప్ప ఇంకెవ్వరూ చేయలేరు’ అని అనుకునే స్థాయికి వెళ్లాలని ఉంది” అని తన మనసు విప్పాడు.

ఎల్‌‌బీడబ్ల్యూ  గురించి..

ప్రస్తుతం విక్రాంత్ చేస్తున్న ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్‌‌లో ఎల్‌‌బీడబ్ల్యూ ఒకటి. ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ “ఎల్‌‌బీడబ్ల్యూ కథ మొదట వినగానే చాలా నేచురల్‌‌గా అనిపించింది. మన చుట్టూ జరిగే విషయాల్లానే ఉంటుంది. అదే నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో నేను చేసే పాత్రలో చాలా ఎమోషన్ ఉంటుంది. ప్రేక్షకులు ఆ క్యారెక్టర్‌‌తో కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్‌‌తో పాటు బలమైన హ్యూమన్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ప్రేక్షకులు కొన్ని చోట్ల నవ్వుతారు, ఆలోచిస్తారు కూడా. అలాంటి కథల్లో నటించడం నాకు చాలా ఇష్టం. షూటింగ్ టైంలో సెట్‌‌లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉండేది. ప్రతి సీన్ చాలా రియలిస్టిక్​గా రావాలని టీమ్ మొత్తం కష్టపడింది. ఇప్పుడు నేను చేసే ప్రతి సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎల్‌‌బీడబ్ల్యూ కూడా అలాంటి ప్రయత్నమే” అని చెప్పాడు. 

విలన్ పాత్రలతో మరో మెట్టు

చాలామంది హీరోలు నెగెటివ్ పాత్రలు చేయడానికి భయపడతారు. కానీ విక్రాంత్ మాత్రం ఆ రిస్క్ తీసుకున్నాడు. ‘గెతు’ సినిమాలో సైలెంట్ విలన్‌‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తక్కువ డైలాగ్స్ ఉన్నా.. చూపుతోనే భయపెట్టేలా నటించాడు. అదే అతనిలో ఉన్న నటుడిని మరోసారి బయటపెట్టింది. తర్వాత ‘కావన్’ సినిమాలో విజయ్ సేతుపతితో కలిసి నటించి మరో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.