నేటి నుంచే ‘కంటి వెలుగు’ సెకండ్ ఫేజ్

నేటి నుంచే ‘కంటి వెలుగు’ సెకండ్ ఫేజ్
  •  ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు
  • తొలిరోజు ఖమ్మం సభ ఎఫెక్ట్ పడే చాన్స్

వెలుగు నెట్ వర్క్: ఉమ్మడి జిల్లాలో ‘కంటి వెలుగు’ సెకండ్ ఫేజ్ నేడు ప్రారంభం కానుంది. ఈమేరకు ఆఫీసర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. గత నెల రోజులుగా ఆఫీసర్లు ఏర్పాట్లలోనే నిమగ్నం అయ్యారు. మొదటి విడతలో దాదాపు నాలుగున్నర లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేయగా.. ఈసారి 10 లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. గ్రామ పంచాయతీల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి, కంటి పరీక్షలు చేయనున్నారు.

తొలిరోజు కష్టమే..

కంటి వెలుగును విజయవంతం చేసేందుకు ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సర్కారు పదే పదే చెబుతూ వచ్చింది. అయితే కంటి వెలుగు ప్రారంభమయ్యే రోజే ఖమ్మంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉండడంతో.. ప్రజాప్రతినిధులంతా అక్కడికే తరలివెళ్లే చాన్స్ ఉంది. కేసీఆర్ సభకు ప్రజాప్రతినిధులంతా హాజరుకావాల్సిందేనని ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. జన సమీకరణ కోసం సర్పంచులకు టార్గెట్ కూడా విధించారు. ఈ నేపథ్యంలో తొలిరోజు కంటి వెలుగుకు స్పందన తక్కువగా వచ్చే చాన్స్ ఉంది.

నిర్లక్ష్యం వహించొద్దు..

ములుగు: ‘కంటి వెలుగు’ కార్యక్రమంలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండొద్దని ములుగు డీఎంహెచ్ వో అల్లెం అప్పయ్య ఆదేశించారు. మంగళవారం ములుగు, దేవనగర్ జీపీల్లో కంటి వెలుగు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య పరీక్షల కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్పంచులు, పంచాయతీ సిబ్బందితో టెంట్లు, తాగునీరు, విద్యుత్​ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. డాక్టర్లు, డాటా ఎంట్రీ సిబ్బంది, వైద్య సహాయకులు సమయపాలనపాటించాలని కోరారు. కార్యక్రమంలో ములుగు సర్పంచ్ బండారి నిర్మల, ఈవో మహేందర్ ఉన్నారు.

దృష్టి లోపాన్ని తరిమికొడదాం..

నల్లబెల్లి: ప్రజల్లో దృష్టి లోపాన్ని తరిమికొట్టేందుకే సీఎం కేసీఆర్ కంటి వెలుగును ప్రవేశపెట్టారని జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న చెప్పారు. మంగళవారం వరంగల్​జిల్లా నల్లబెల్లి మండలకేంద్రంలో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. అంతకుముందు కంటి వెలుగు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కంటి సమస్యలు ఉన్నవారికి ఉచిత పరీక్షలతో పాటు శస్త్ర చికిత్సలు కూడా చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉడుగుల సునీత ప్రవీణ్ గౌడ్, మెడికల్ ఆఫీసర్స్, స్థానిక సర్పంచ్ రాజారామ్, ఎంపీటీసీ జయరావ్ పాల్గొన్నారు.