పొద్దున్నే టీ తాగుతున్నారా.? టీ అని వేటిని అంటారో తెలుసా?

పొద్దున్నే టీ తాగుతున్నారా.?  టీ అని వేటిని అంటారో తెలుసా?
  •     మిగతా వాటిని టీగా మార్కెటింగ్ చేసుకోరాదు
  •     చాయ్ పదాన్ని నిర్వచిస్తూ ఎఫ్ఎస్ఎస్ఏఐ క్లారిటీ

న్యూఢిల్లీ: చాయ్  పదాన్ని నిర్వచిస్తూ భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికారసంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) క్లారిటీ ఇచ్చింది. తేయాకు మొక్కలతో చేసిన ఉత్పత్తులను మాత్రమే టీ పొడి అని పిలవాలని, అలాంటి వాటినే చట్టప్రకారం అమ్మాలని సూచించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న భద్రతా ప్రమాణాల ప్రకారం కంగ్రా టీ, గ్రీన్ టీ, ఇన్ స్టంట్ టీ వంటివి టీ కిందకు వస్తాయని, టీ నిర్వచనానికి గల అన్ని ప్రమాణాలు, అర్హతలను అవి తీరుస్తున్నాయని వివరించింది. 

అయితే.. తేయాకు మొక్కల నుంచి తయారు చేయని హెర్బల్, ప్లాంట్  బేస్ట్  ఉత్పత్తులను కూడా టీ పొడిగా పిలుస్తున్నారని, టీ పొడిగా పిలువబడే అర్హత ఆ ప్రాడక్టులకు లేదని తెలిపింది. వాటిని టీ పొడి అని పిలవడం చట్టవ్యతిరేకమని, అంతేకాకుండా వాటికి తప్పుడు ప్రచారం చేసినట్లవుతుందని వెల్లడించింది. 

రూయిబోస్ టీ, హెర్బల్ టీ, ఫ్లవర్ టీ వంటివి తేయాకు మొక్కల నుంచి తయారు కాకపోయినా వాటిని కొన్ని  వ్యాపార సంస్థలు టీ పొడిగా పిలుస్తూ మార్కెటింగ్ చేసుకుంటున్న నేపథ్యంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది. తేయాకు మొక్కల నుంచి తయారైన ఉత్పత్తులను టీ పొడి అని పిలవాలని, హెర్బల్ టీ, ఫ్లవర్ టీ వంటి వాటిని అలా పిలవకూడదని, అలా ప్రచారం చేసుకోవడం వంటివి చేయరాదని ఫుడ్  కంపెనీలకు స్పష్టం చేసింది. ఆహారం లేదా పానీయం ఎలా తయారైందో లేబుల్  ముందు స్పష్టంగా రాయాలని పేర్కొంది.