Cannes 2024: కేన్స్‌లో సత్తా చాటిన ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌..వివిధ భాషల 17 చిత్రాలతో పోటీ పడి తొలి స్థానం

Cannes 2024: కేన్స్‌లో సత్తా చాటిన ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌..వివిధ భాషల 17 చిత్రాలతో పోటీ పడి తొలి స్థానం

ప్రస్తుతం ఫ్రాన్స్‌లో 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (Cannes Film Festival) జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చూసే కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ చిత్రోత్సవాలు మే 25న ముగియనున్నాయి. ఈ వేడుకల్లో మృణాల్‌‌‌‌‌‌‌‌తో పాటు ఐశ్వర్యరాయ్, అనుష్క శర్మ, అదితిరావు హైదరి, మానుషి చిల్లర్‌‌‌‌‌‌‌‌, సారా అలీఖాన్‌‌‌‌‌‌‌‌,ఈషా గుప్తా వంటి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

అయితే, ఈ ప్రతిష్ఠాత్మక కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారత్‌ కు చెందిన షార్ట్ ఫిలిమ్స్, మూవీస్ తమ సత్తాను చాటుతున్నాయి. లేటెస్ట్గా ‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్ వన్‌ టు నో’ షార్ట్‌ ఫిలిం బెస్ట్ క్యాటగిరిలో అవార్డు సొంతం చేసుకుంది. 2024 ఉత్తమ షార్ట్‌ ఫిలిం విభాగంలో బహుమతిని సొంతం చేసుకోవడంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

ఎస్ చిదానంద నాయక్ తెరకెక్కించిన ఈ షార్ట్ ఫిల్మ్ వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీ పడి నెంబర్ వన్ గా నిలిచింది. ఈ పోటీలకు ప్రపంచవ్యాప్తంగా 555 ఫిల్మ్ స్కూల్స్ నుండి 2,263 మంది దరఖాస్తుదారులు వచ్చాయి. 16 నిమిషాల పాటు నిడివి ఉన్న ఈ ఈ షార్ట్‌ ఫిల్మ్ కన్నడ జానపద కథ ఆధారంగా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

వృద్ధురాలి కోడిని ఎవరో దొంగలించడం..దానిని కనుగొనడం కోసం ఆమె పడే తపనను ఇందులో చూపారు. ఇప్పుడీ షార్ట్‌ ఫిల్మ్ హాలీవుడ్‌తో పోటీ పడి మొదటి బహుమతి గెలుచుకోవడంపై చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది.ఇక మేరఠ్‌లో జన్మించిన భారతీయ చిత్రనిర్మాత మహేశ్వరి రూపొందించిన యానిమేటెడ్‌ మూవీ ‘బన్నీ హుడ్‌’ ఈ పోటీలో తృతీయ బహుమతి గెలుచుకోవడం విశేషం.