డిజిటల్​ ఫైనాన్సింగ్​ కంపెనీలపై మస్తు కంప్లయింట్లు

డిజిటల్​ ఫైనాన్సింగ్​ కంపెనీలపై మస్తు కంప్లయింట్లు
  • డిజిటల్​ ఫైనాన్సింగ్​ కంపెనీలపై మస్తు కంప్లయింట్లు
  • ఆర్​బీఐ డిప్యూటీ గవర్నర్​ రాజేశ్వర్​ రావు
  • ఇలాగే కొనసాగితే ...ఫిన్​టెక్​ కంపెనీలపై నమ్మకం పోతుంది

వెలుగు బిజినెస్​ డెస్క్​: డిజిటల్ విధానంలో​ అప్పులు ఇస్తున్న కంపెనీలపై కంప్లయింట్లు వెల్లువెత్తుతున్నట్లు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) డిప్యూటీ గవర్నర్​ ఎం రాజేశ్వర్​ రావు వెల్లడించారు. ఇటీవలి కాలంలో వేగంగా ఎదుగుతున్న ఈ ఇండస్ట్రీపై ఆయన కామెంట్​ గొడ్డలిపెట్టులాంటిదే. ప్రజలకు డిజిటల్​ ఫైనాన్షియల్​ కంపెనీలు మేలు చేస్తున్నాయనే విషయంలో ఎలాంటి డౌటూ లేదని, కానీ ఆ కంపెనీల నిర్వహణా పద్ధతులు, ప్రమాణాలు ఇబ్బందులు తెస్తున్నాయని రావు పేర్కొన్నారు. దీంతో ఫిన్​టెక్​ ఇండస్ట్రీపైనే నమ్మకం సడలే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. సీఐఐ–ఎన్​బీఎఫ్​సీ సమ్మిట్​లో శుక్రవారం ఆయన ప్రసంగించారు. 5 ట్రిలియన్​ డాలర్ల ఎకానమీగా మారే జర్నీలో డిజిటల్​ ఫైనాన్స్​ పాత్ర అనే అంశంపై ఈ సమ్మిట్​ను నిర్వహించారు. 
అప్పుల రికవరీలో దురుసుతనం....
ఇచ్చిన అప్పుల వసూళ్లలో డిజిటల్​ ఫైనాన్స్​ కంపెనీలు కఠినమైన పద్ధతులు పాటిస్తున్నాయని, డేటా ప్రైవసీ పట్టించుకోవడం లేదని, మోసపూరిత ట్రాన్సాక్షన్లు, సైబర్​ క్రైమ్​, ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు పెరుగుతున్నట్లు కూడా రాజేశ్వర్​ రావు చెప్పారు. అప్పుల రికవరీలో దురుసుగా ప్రవర్తిస్తున్నాయనే ఆరోపణలతోపాటు, డిజిటల్​ ఫ్రాడ్స్​పైనా ఇటీవల కంప్లయింట్లు పెరుగుతున్నాయి. గత కొన్నేళ్లలో దేశంలో ఫిన్​టెక్​ కంపెనీల సంఖ్య భారీగా పెరిగింది. అదేవిధంగా ఆ కంపెనీలు ఇచ్చే అప్పులు కూడా ఎక్కువయ్యాయి. ఇంక్​ 42 ప్లస్​ రిపోర్టు ప్రకారం దేశంలో 1,263 డిజిటల్​ లెండింగ్​ స్టార్టప్​ కంపెనీలు ఉన్నాయి. ఇందులో 147 కంపెనీలలో వెంచర్​ క్యాపిటల్​ కంపెనీలు పెట్టుబడులు కూడా పెట్టాయి. 2014 నుంచి 2019–20 మధ్యలో  వెంచర్​ క్యాపిటల్​ కంపెనీల పెట్టుబడులు 2.4 బిలియన్​ డాలర్లు. ఇక ఇండియా ఫిన్​టెక్​ రిపోర్టు 2020 ప్రకారం చూస్తే దేశంలో 365 ఫిన్​టెక్​ కంపెనీలు కన్జూమర్​ లెండింగ్​, ఎస్​ఎంఈ ఫైనాన్స్​, పీ2పీ లెండింగ్​ బిజినెస్​లలో ఉన్నాయి. గోమెడిసి ఈ రిపోర్టును తెచ్చింది. 
రూల్స్​ పాటించాల్సిందే.....
డిజిటల్​గా అప్పలు తీసుకున్న కస్టమర్ల కంప్లయింట్లను దృష్టిలో పెట్టుకుని  జూన్​ 2020లో ఆర్​బీఐ ఒక సర్క్యులర్​ జారీ చేసింది. నాన్​–బ్యాంకింగ్​ ఫైనాన్స్​ కంపెనీలన్నీ మెరుగైన ప్రమాణాలను పాటించడంతోపాటు, గైడ్​లైన్స్​ను ఫాలో అవ్వాలని ఈ సర్క్యులర్​లో ఆర్​బీఐ పేర్కొంది. దేశంలోని ఎన్​బీఎఫ్​సీలు ఇనొవేటివ్​ ఫిన్​టెక్​ ప్రొడక్టులను తేవడాన్ని మెచ్చుకుంటూనే, మరోవైపు ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని రాజేశ్వర్​ రావు హెచ్చరించారు. రూల్స్​కు భంగం కలిగించేలా ఎలాంటి చర్యలూ ఉండకూడదన్నారు. కస్టమర్ల కోసం తెచ్చే ఏ ఇనొవేషన్ని అయినా మెచ్చుకోవాల్సిందేనని చెబుతూ, కాకపోతే ఫైనాన్షియల్​ ఎకో సిస్టమ్​పై అవి సానుకూల ప్రభావం చూపించేలా ఉండాలని సూచించారు. ఎన్​బీఎఫ్​సీ సెక్టార్​ రెగ్యులేషన్స్​ను మరింత పటిష్టం చేయడం పైనా ఆర్​బీఐ పనిచేస్తోందని రావు 
వెల్లడించారు.

ఎన్​బీఎఫ్​సీలకూ అంబుడ్జ్​మన్
బ్యాంకింగ్​లోలాగే  ఎన్​బీఎఫ్​సీలకూ అంబుడ్జ్​మన్ నియామకాన్ని ఇటీవలే అమలులోకి తెచ్చామని ఆర్​బీఐ డిప్యూటీ గవర్నర్​ రాజేశ్వర్​ రావు చెప్పారు. తమ కంపెనీలో ఉండే సమస్యలను ఎన్​బీఎఫ్​సీలు  తామే పరిష్కరించుకోవడానికి ఈ అంబుడ్జ్​మన్​ పద్ధతి సాయపడుతుందని ఆయన అన్నారు. ​వారిని ఇంటర్నల్​ అంబుడ్జ్​మన్​గా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. కస్టమర్ల సమస్యలను స్వతంత్రంగా పరిశీలించి, పరిష్కారాలను కనుక్కోవడమే ఈ ఇంటర్నల్​ అంబుడ్జ్​మన్​ బాధ్యతని చెప్పారు. అందరు కస్టమర్లు ఒకే రకమైన సర్వీస్​ పొందాలని, అలా పొందలేదని భావించే కస్టమర్లు కంప్లయింట్​ చేయొచ్చని అన్నారు. దేశంలో మారుతున్న వ్యాపార పరిస్థితులకు అనుగుణంగా ఎన్​బీఎఫ్​సీ రెగ్యులేషన్స్​నూ ఆర్​బీఐ మారుస్తోందని చెప్పారు. దేశంలో మొత్తం 9,651 ఎన్​బీఎఫ్​సీలు ఉన్నాయి. హౌసింగ్​ ఫైనాన్స్​ కంపెనీలు సహా ఎన్​బీఎఫ్​సీల చేతిలో మొత్తం 54 లక్షల కోట్ల ఎసెట్స్​ ఉన్నాయి. బ్యాంకింగ్​ సెక్టార్​ ఎసెట్స్​లో ఇది 25 శాతం (అంటే నాలుగోవంతు)కి సమానం. గత అయిదేళ్లలో ఎన్​బీఎఫ్​సీ సెక్టార్​ ఏటా17.91 శాతం చొప్పున ఎదిగింది.