ఫుల్ డిమాండ్ : హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న పంట పొలాలు​

ఫుల్ డిమాండ్ : హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న పంట పొలాలు​

గ్రామాల్లో జోరుగా కొనుగోళ్లు, అమ్మకాలు
జిల్లాలు దాటొచ్చి కొంటున్న వ్యాపారులు, ఉద్యోగులు
రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఎకరా రూ.10 లక్షలపైనే
అగ్రికల్చర్ ల్యాండ్స్​పై ఇన్వెస్ట్ చేస్తున్న మిడిల్ క్లాస్ జనం
నాలుగు నెలల్లో2 లక్షల రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్, వెలుగుగ్రామాల్లో వ్యవసాయ భూములు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఎవరైనా భూమి అమ్మకానికి పెడితే చాలు.. ఏజెంట్ల ద్వారా తెలుసుకుని పట్టణాలు, నగరాల నుంచి జనం వాలిపోతున్నారు. భూమి చూశాక బేరం కుదిరితే అడ్వాన్స్​లు ఇచ్చేస్తున్నారు. పక్క రైతుకు కూడా తెలియకుండానే అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. గతంలో ఏ ఊరి వ్యవసాయ భూములను ఆ ఊరి రైతులే కొనుగోలు చేస్తే.. ఇప్పుడు జిల్లాలు, మండలాలు దాటొచ్చి కొంటున్నారు. మంచి రేటు వస్తే ఒకటి, రెండేళ్లకే రీ సేల్ చేస్తున్నారు. గత నాలుగు నెలల్లోనే అగ్రికల్చర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్లు 2 లక్షలు దాటాయంటే.. ఫామ్ ల్యాండ్ బిజినెస్ ఏ స్థాయిలో జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు.

ఎలాంటి నీటి వసతి లేకున్నా..

రాష్ట్రంలో వ్యవసాయ భూములకు భారీగా డిమాండ్ పెరిగింది. ఎలాంటి నీటి వసతి లేకున్నా.. ఎకరానికి కనీసం రూ.10 లక్షలపైనే పలుకుతోంది. నీటి వసతి ఉంటే రూ.15 లక్షలపై మాటే. ఇది కూడా మారుమూల గ్రామాల్లోనే. నేషనల్, స్టేట్ హైవేలకు ఐదు, పది కిలోమీటర్ల దూరంలో డొంక (మట్టి) దారుల కనెక్టివిటీ ఉంటే రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ధర పలుకుతోంది. హైవేలు, నగరాలు, పట్టణాలకు దగ్గర్లో ఉన్న వ్యవసాయ భూములు ఎకరాకు రూ.70 లక్షల నుంచి రూ.కోటిపైగానే రేటు చెప్తున్నారు.

భారీగా పెరిగిన రేట్ల వల్ల గ్రామాల్లోని రైతులు భూములను కొనే పరిస్థితి లేకుండా పోయింది. పట్టణాలు, నగరాల్లో వ్యాపారాలు, భారీ జీతాలతో ఉద్యోగాలు చేసేవాళ్లే కొనుగోలుదారుల్లో ఎక్కువగా ఉంటున్నారు. కొందరు నగరాల్లో స్థిరపడినా.. సొంతూళ్లలో భూములు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరైతే 50 నుంచి 100 కిలోమీటర్ల దూరమైనా వెళ్లి భూములు కొంటున్నారు. నీటి వసతి లేకుంటే బోర్లు వేయించి, ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఫామ్ హౌస్ ట్రెండ్

హైదరాబాద్, ఇతర నగరాల్లో ఇరుకైన ఇళ్లు, ఫ్లాట్లలో ఉండే మిడిల్ క్లాస్ జనం ఫామ్ హౌస్​లపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సిటీలో 100 గజాలకు పెట్టే డబ్బులకే.. సిటీకి 60–7‌0 కిలోమీటర్లలోపు ఉన్న గ్రామాల్లో ఒకటి, రెండెకరాలు వస్తుండటంతో అటువైపు మొగ్గుచూపుతున్నారు. కొనుగోలు చేసిన ఫామ్ లాండ్స్​లో ఒకటి, రెండు రూములు కట్టుకుంటున్నారు. సెలవుల్లో ఫ్యామిలీతో అక్కడే రిలాక్సవుతున్నారు. స్థానిక రైతులకు కౌలుకిస్తున్నారు.

సండే సందడే

వ్యవసాయ భూముల కొనుగోళ్లపై ఆసక్తి ఉన్న వ్యాపారులు, ఉద్యోగులు సండే వస్తే చాలు రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ద్వారా తెలిసిన గ్రామాలకు కార్లలో వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ రూట్​లో యాద్రాద్రి దాటి ఆలేరు, జనగామ వరకు వెళ్లొస్తుండగా విజయవాడ రూట్​లో నార్కట్ పల్లి వరకు.. బెంగళూరు రూట్‌లో జడ్చర్ల వరకు, నిజామాబాద్ రూట్​లో మాసాయిపేట, చేగుంట వరకు వెళ్తున్నారు.

కారుకు దారి ఉంటే చాలంటున్రు

మిడిల్ క్లాస్ ప్రజలు ప్లాట్ల మీద కంటే ఇప్పు డు ఎక్కువగా అగ్రికల్చర్ ల్యాండ్స్ మీదే ఇన్వెస్ట్ చేస్తున్నారు. గతంలో యాదాద్రి, భువనగిరి వరకు చుట్టు పక్కల గ్రామాల్లో భూములు కొనేవాళ్లు. ఇప్పుడు ఆలేరు, జన గామ ఏరియాలో అయినా ఫర్వాలేదంటు న్నారు. కారు వెళ్లే దారి ఉంటే చాలు.. మెయిన్ రోడ్డు నుంచి ఎంత లోపలున్నా భూములు కొనేందుకు రెడీ అంటున్నారు. ‑ కుంభం ఆంజనేయులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్

నాలా కన్వర్షన్లు పెరుగుతున్నయ్

అగ్రికల్చర్ ల్యాండ్స్​ను రెసిడెన్షియల్ ప్లాట్లుగా చేయాలన్నా, ఇతర వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించాలన్నా ప్రభుత్వానికి నాలా పన్ను చెల్లించాలి. ఇలా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్​గా మార్చుకునేందుకు ధరణి పోర్టల్ లో వేలాదిగా దరఖాస్తులు వస్తున్నాయి. నాలా కన్వర్షన్ కోసం గత మూడు నెలల్లో 7,655 దరఖాస్తులు రాగా, 7,106 అప్లికేషన్లకు అధికారులు అప్రూవల్ ఇచ్చారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల శివారు గ్రామాలు, ప్రధాన రహదారుల వెంట ఉండే భూముల యజమానుల నుంచే నాలా కన్వర్షన్ అప్లికేషన్లు ఎక్కువగా వస్తున్నాయి.

4 నెలల్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్లు ఇలా..

నెల          రిజిస్ట్రేషన్ల సంఖ్య  నాలా  కన్వర్షన్లు

నవంబర్​        36,709                    –

డిసెంబర్​        37,725            1,190

జనవరి          51,205            2,757

ఫిబ్రవరి          70,471            3,161