కరోనా కాక్‌టెయిల్ ఇంజక్షన్​కు మస్తు డిమాండ్

కరోనా కాక్‌టెయిల్ ఇంజక్షన్​కు మస్తు డిమాండ్
  • కార్పొరేట్ హాస్పిటళ్ల బాట పడుతున్న బాధితులు  
  • మంచి రిజల్ట్ ఉంటోందంటున్న డాక్టర్లు 
  • ప్రస్తుతానికి ప్రైవేట్‌లోనే అందుబాటులో 
  • ఈ మెడిసిన్‌పై గాంధీ ఆస్పత్రిలో స్టడీ 

హైదరాబాద్, వెలుగు: కరోనా కాక్‌‌టెయిల్ మెడిసిన్ కు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. కరోనా సోకిందని కన్ఫామ్ అయిన వెంటనే, చాలామంది ఈ మెడిసిన్ కోసం కార్పొరేట్ దవాఖాన్ల బాట పడుతున్నారు. డాక్టర్లను అడిగి మరీ కాక్‌‌టెయిల్ ఇంజక్షన్ వేయించుకుంటున్నారు. ఇది కోమార్బిడిటీస్ పేషెంట్ల విషయంలో మంచి రిజల్ట్ చూపుతోందని డాక్టర్లు చెబుతున్నారు. వైరస్ సింప్టమ్స్ మొదలైన నాలుగైదు రోజుల్లోపు ఈ మెడిసిన్ తీసుకున్నోళ్లు త్వరగా కోలుకుంటున్నారని క్రిటికల్ కేర్ ఎక్స్‌‌పర్ట్, అపోలో హాస్పిటల్‌‌ డాక్టర్ శ్రీధర్‌‌ చెప్పారు. అయితే ఈ ఇంజక్షన్ ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ డ్రగ్ ఖరీదు రూ.60 వేలు ఉండడంతో ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. ఓ కార్పొరేట్ సంస్థ సీఎస్‌‌ఆర్ కింద కొన్ని ఇంజక్షన్లను ప్రభుత్వానికి అందించగా.. వాటిని నిమ్స్‌‌, టిమ్స్‌‌లో వినియోగిస్తున్నారు. కాగా, కాక్‌‌టెయిల్‌‌ మెడిసిన్ పై గాంధీ హాస్పిటల్‌‌లో స్టడీ చేస్తున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌‌ డాక్టర్ రాజారావు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు. స్టడీ ఇటీవలే మొదలైందని, ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. 

అసలేంటీ డ్రగ్? 
మన శరీరంలోకి ఎంటరైన వైరస్/బ్యాక్టీరియా వంటి వాటితో పోరాడేందుకు మన రోగనిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేసే ప్రొటీన్లనే యాంటీబాడీలు అంటారు. ఒక్కో రకమైన వైరస్‌‌ తో పోరాడేందుకు, ఒక్కో రకమైన యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. స్విట్జర్లాండ్‌‌కు చెందిన రోచ్ కంపెనీ కరోనాపై పోరాడే రెండు రకాల యాంటీబాడీలను కృత్రిమంగా సృష్టించి, వాటితో మెడిసిన్‌‌ తయారు చేసింది. దీన్నే మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్‌‌టెయిల్‌‌గా పిలుస్తున్నారు. ఈ మెడిసిన్.. కరోనా స్పైక్ ప్రొటీన్‌‌పై దాడి చేసి, శరీర కణాల్లోకి చొరబడకుండా వైరస్‌‌ను అడ్డుకుంటుంది. దీంతో వైరస్ వృద్ధి ఆగిపోయి, సీరియస్‌‌ కండీషన్‌‌లోకి వెళ్లే పరిస్థితి రాదు. ఈ మెడిసిన్ ను ఎర్లీ స్టేజ్‌‌లో తీసుకోవాలని, వైరస్ వృద్ధి చెందిన తర్వాత తీసుకుంటే ప్రయోజనం ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. మన దేశంలో ఈ మెడిసిన్ వినియోగానికి ఈ ఏడాది మేలో కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ డ్రగ్‌‌ను సిప్ల కంపెనీ మార్కెటింగ్ చేస్తోంది. రెమ్డెసివిర్ ఇచ్చినట్టుగానే ఐవీ ద్వారా ఈ మెడిసిన్ ఇస్తున్నారు. ఈ డ్రగ్‌‌ అందరికీ అవసరం లేదని కోమార్బిడిటీస్ పేషెంట్లకు రిస్క్ ఎక్కువగా ఉండడం వల్ల, వాళ్లకు మాత్రం ఇస్తే సరిపోతుందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. 

అమ్మానాన్నకు వేయించా 
వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నాక కూడా మా అమ్మకు, నాన్నకు వైరస్ సోకింది. మా ఫ్రెండ్ వాళ్ల అత్తమ్మకు కాక్‌టెయిల్ ఇంజక్షన్ ఇప్పించాక, రెండ్రోజుల్లోనే ఆమె కోలుకుంది. దీంతో మా అమ్మానాన్నకు కూడా వేయించాలని నిర్ణయించుకున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్‌లో లేకపోవడంతో, ఇటీవల ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి వేయించాం. అదే రోజు సాయంత్రం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఇద్దరూ ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. 
- గోపాల్‌రావు, ఖమ్మం