
- రికార్డ్ లెవెల్‌లో కంపెనీల సేల్స్
- జూన్ నుంచి తగ్గనున్న ప్రభుత్వ సబ్సిడీ..ఎగబడిన కస్టమర్లు
బిజినెస్ డెస్క్, వెలుగు: దేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ల సేల్స్ ఊపందుకుంటున్నాయి. కిందటి నెలలో ఏకంగా లక్ష ఎలక్ట్రిక్ టూవీలర్లు అమ్ముడవ్వడం విశేషం. ప్రభుత్వం ఈవీలపై ఇస్తున్న సబ్సిడీ రాయితీని తగ్గించేస్తామని ప్రకటించడంతో ఒక్కసారిగా కొనుగోళ్లు పెరిగాయి. ఈవీలను కొనే ప్లాన్‌లో ఉన్న కస్టమర్లు షోరూమ్‌ల బాట పడుతున్నారు. ప్రభుత్వ పోర్టల్ వాహన్ ప్రకారం, దేశంలో రిటైల్ ఎలక్ట్రిక్ టూవీలర్ల సేల్స్ ఈ ఏడాది మే నెలలో 1,04,845 యూనిట్లకు పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డయిన 66,727 యూనిట్లతో పోలిస్తే ఇది 57 శాతం గ్రోత్‌కు సమానం. అదే కిందటేడాది మే నెలలో సేల్ అయిన 42,415 యూనిట్లతో పోలిస్తే 147 శాతం ఎక్కువ. ప్రభుత్వం ఎలక్ట్రిక్ బండ్లపై ఇస్తున్న సబ్సిడీని తగ్గించేస్తామని మే 21 న ప్రకటించిందని, దీంతో బండ్ల రేట్లు పెంచుతామని కంపెనీలు సంకేతాలు ఇచ్చాయని ఎనలిస్టులు చెబుతున్నారు. దీంతో మే నెలలోని చివరి పది రోజుల్లో బండ్లను కొనడానికి బయ్యర్లు ఎగబడ్డారని వెల్లడించారు. జూన్ నుంచి ఫేమ్ 2 సబ్సిడీని ప్రభుత్వం తగ్గిస్తోంది. ఈ నెల నుంచి ఎలక్ట్రిక్ టూవీలర్ల రేట్లు 15–20 శాతం మేర పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఎక్కువ సబ్సిడీ ఉన్నప్పుడే కస్టమర్లు బండ్లను బుక్ చేసుకోవడం పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎలక్ట్రిక్ టూవీలర్ల రిటైల్ సేల్స్ అంతకు ముందు నెలతో పోలిస్తే 23 శాతం తగ్గిన విషయం తెలిసిందే. సబ్సిడీ డిస్‌బర్స్‌మెంట్ ఆలస్యం కావడం, సప్లయ్‌లో సమస్యలు నెలకొనడంతో వెహికల్ అమ్మకాలు ఏప్రిల్‌లో తగ్గిపోయాయి. కాగా, రిజిస్ట్రేషన్ జరిగిన బండ్ల డేటానే వాహన్ పోర్టల్‌లో ఉంటుంది. బుకింగ్స్ గురించి ఇందులో ఉండదు. అలానే తక్కువ స్పీడ్ ఉన్న ఎలక్ట్రిక్ బండ్ల సేల్స్ డేటా, ఇంకా లక్షద్వీప్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి డేటా ఈ పోర్టల్‌లో లేదు. దీంతో మే నెల సేల్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయని అంచనా.
పెరుగుతున్న రేట్లు
ఫేమ్ 2 కింద ఇస్తున్న రాయితీలను ప్రభుత్వం మార్చింది. గతంలో కిలోవాట్‌కు రూ.15 వేల సబ్సిడీ ఇవ్వగా, ప్రస్తుతం దీన్ని రూ.10 వేలకు తగ్గించింది. అంతేకాకుండా గరిష్టంగా ఇస్తున్న ఇన్సెంటివ్‌ను 40 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. ఇప్పటికే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ బండ్ల రేట్లను పెంచడం ప్రారంభించాయి. ఓలా ఎలక్ట్రిక్ తమ అన్ని స్కూటర్ల ధరలను రూ.15 వేల చొప్పున పెంచింది. మ్యాటర్ రూ.30 వేల మేర, ఎథర్ ఎనర్జీ రూ.25,000 నుంచి రూ.30 వేల మేర పెంచాయి. మిగిలిన కంపెనీలు కూడా త్వరలో రేట్లను పెంచుతాయని అంచనా. సేల్ అవుతున్న మొత్తం బండ్లలో ఈవీల వాటా ప్రస్తుతం 4.9 శాతంగానే ఉందని, ఈ నెంబర్ 20 శాతం వరకు వెళ్లేంత వరకు ప్రభుత్వం సబ్సిడీని తగ్గించకుండా ఉండాల్సిందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ టూవీలర్లు, ఇంటర్నల్ కంబశ్చన్ ఇంజిన్ (ఐసీఈ) (పెట్రోల్ బండ్లు) ధరల మధ్య గ్యాప్ ఇంకా పెరుగుతుందని ఇక్రా అంచనావేస్తోంది. ఫేమ్ 2 తెచ్చిన తర్వాత ప్రీమియం ఎలక్ట్రిక్ టూవీలర్ల రేట్లు మూడేళ్ల దిగువకు వచ్చాయని, తాజాగా సవరించడంతో ఐదేళ్ల గరిష్టానికి చేరుకున్నాయని వివరించింది. ఎలక్ట్రిక్ టూవీలర్ల రేట్లు షార్ట్ టెర్మ్‌లో పెరిగినా, లాంగ్ టెర్మ్‌లో ఈవీ అడాప్షన్‌పై దీని ప్రభావం తక్కువగా ఉంటుందని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఈవీల వాడకం తగ్గకుండా చూస్తూనే చైనా సక్సెస్‌ఫుల్‌గా సబ్సిడీలను తొలగించిందని వెల్లడించారు.
టాప్‌లో ఓలా..
ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్, ఏథర్ ఎనర్జీ వంటి కంపెనీలు తమ సేల్స్‌లో ఆల్‌టైమ్ రికార్డ్‌లను నమోదు చేస్తున్నాయి. వాహన్ పోర్టల్ ప్రకారం, మే నెలలో 28,469 యూనిట్లను ఓలా ఎలక్ట్రిక్ అమ్మింది. మార్కెట్‌లో లీడర్‌గా కొనసాగుతోంది. అంతకు ముందు నెలలో అమ్మిన 21,991 యూనిట్లతో పోలిస్తే 30 శాతం గ్రోత్ నమోదు చేసింది. కంపెనీ మాత్రం తాము 35 వేల యూనిట్లను సేల్ చేశామని, ఎలక్ట్రిక్ టూవీలర్ల మార్కెట్‌లో 30 శాతం మార్కెట్ షేర్ ఉందని ప్రకటించింది. టీవీఎస్ మోటార్ కిందటి నెలలో 20 వేల ఎలక్ట్రిక్ టూవీలర్లు అమ్మి, సెకెండ్ ప్లేస్‌లో నిలిచింది. కంపెనీ తెచ్చిన ఐక్యూబ్ మోడల్‌కు ఫుల్ గిరాకీ కనిపిస్తోంది. ఏథర్ ఎనర్జీ మే నెలలో 15,266 యూనిట్లను అమ్మింది. అంతకు ముందు నెలతో పోలిస్తే 100 శాతం గ్రోత్ నమోదు చేసింది. బజాజ్ ఆటో కూడా తమ ఎలక్ట్రిక్ టూవీలర్ల సేల్స్‌ను పెంచుకుంటోంది.
కంపెనీ కిందటి నెలలో 9,931 బండ్లను అమ్మగలిగింది.