శిలాఫలకాలకు ఫుల్​ డిమాండ్​.. రోజుకు 25 నుంచి 30 ఆర్డర్స్​..

శిలాఫలకాలకు ఫుల్​ డిమాండ్​.. రోజుకు 25 నుంచి 30 ఆర్డర్స్​..
  • ఎన్నికల వేళ జోరుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.

కామారెడ్డి, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల జాతర సాగుతోంది. అధికార పార్టీ నేతలు రోజూ ఒక్కో నియోజక వర్గంలో  పదుల సంఖ్యలో శిలాఫలకాలు వేస్తున్నారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్​వచ్చే అవకాశముంది. ఆలోగా వీలైనన్ని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. దీంతో శిలాఫలకాలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. గతంలో శిలాఫలకాల తయారీకి హైదరాబాద్ కేరాఫ్​అడ్రస్​గా ఉండేది. కానీ అన్ని జిల్లాల నుంచి ఆర్డర్లు వస్తుండటంతో నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం తదితర జిల్లాల్లోనూ వాటి తయారీ యూనిట్లు ఏర్పడ్డాయి. ఎన్నికల వేళ ఆర్డర్లు పెరగడంతో ఇక్కడ కార్మికులు రేయింబవళ్లు పని చేస్తున్నారు. సైజును, మోడల్​ను బట్టి రూ.5 వేల నుంచి రూ.50 వేల దాకా వసూలు చేస్తున్నారు. గతంతో పోలిస్తే రేట్లు రెట్టింపయ్యాయి. గ్రానైట్​ కొరత ఏర్పడటం, రేట్లు పెరగడంతో తాము కూడా పెంచక తప్పడం లేదని కార్మికులు చెప్తున్నారు. 

ఎన్నికల వేళ మస్త్​ డిమాండ్​

త్వరలో ఎన్నికల షెడ్యూల్​రాబోతున్నందున రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్​ మంత్రులు, ఎమ్మెల్యేలు.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హడావుడి చేస్తున్నారు. రోడ్లు,  బ్రిడ్జిలు, లిఫ్ట్​ స్కీములు, స్కూల్​ బిల్డింగ్స్, పం చాయతీ ఆఫీసులు, టెంపుల్స్, కమ్యూనిటీ హాళ్లు, సెంట్రల్​ లైటింగ్స్, డివైడర్లు .. ఇలా ఏ పనికైనా  అట్టహాసంగా శిలాఫలకాలు వేయిస్తున్నారు. వారం, పదిరోజులుగా కేటీఆర్, హరీశ్​రావు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ రోజూ పదుల సంఖ్యలో ఫౌండేషన్​ స్టోన్స్​ ఆవిష్కరిస్తున్నారు. మరీ ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో  కేసీఆర్​ పోటీ చేయనున్న  కామారెడ్డి నియోజకవర్గంలో శిలాఫలకాలకు ఎక్కడ లేని డిమాండ్​ ఏర్పడింది.  సీఎం స్పెషల్​ డెవలప్​మెంట్​ ఫండ్స్​ నుంచి జిల్లాకు భారీగా నిధులు కేటాయిస్తుండటంతో  వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. కుల సంఘాలు,  టెంపుల్స్​, చర్చిలు, మసీదుల కోసమే ఏకంగా రూ. 35 కోట్లు ఫండ్స్​ శాంక్షన్​ చేశారు. ఈ నిధులతో మాచారెడ్డి, భిక్కనూరు,  దోమకొండ మండలాల పరిధిలో ఎమ్మెల్యే గోవర్ధన్ ప్రతిరోజూ దాదాపు  40 శిలాఫలకాలు ఆవిష్కరిస్తున్నారు.  మరో 2 రోజుల్లో  కామారెడ్డి మున్సిపాలిటీ, మండలంలో వందల్లో శిలాఫలకాలు వేసేందుకు ప్లాన్​ చేశారు.  దీంతో శిలాఫలకాల కోసం అటు బీఆర్ఎస్​లీడర్లు, ఇటు ఆఫీసర్లు ఉరుకులు పరుగులు పెడ్తున్నారు.

రోజుకు 25 నుంచి 30 ఆర్డర్స్​..

కరీంనగర్ కలెక్టరేట్ రోడ్డులో ఉన్న రవళి ఆర్ట్స్ కు గత వారం రోజులుగా రోజుకు 25 నుంచి 30 వరకు శిలాఫలకాల ఆర్డర్స్ వస్తున్నాయని షాపు నిర్వాహకుడు కృష్ణ తెలిపారు.  మాములు రోజుల్లో ఒకటి, రెండు ఆర్డర్లు కూడా  వచ్చేవి కాదని,  ప్రస్తుతం ఈ నెల 4, 5వ తేదీల్లో‌‌ శంకుస్థాపనలకు  సంబంధించిన ఆర్డర్స్  ఉన్నట్లు చెప్పారు. సైజ్ ను బట్టి ఒక్కో శిలాఫలకానికి రూ.20 వేల నుంచి 40 వేల వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలిపారు.  

గిరాకీ తట్టుకోలేకపోతున్నం..

మాకు నిర్మల్ లోని కళానగర్ లో సంధ్య ఆర్ట్స్ పేరిట శిలాఫలకాల తయారీ యూనిట్​ఉంది. 20 రోజులుగా ప్రభుత్వ శాఖల నుంచి, కులసంఘాల నుంచి  పెద్దసంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని  ప్రాంతాల నుంచి ఆర్డర్లు వస్తుండటంతో  గిరాకీ తట్టుకోలేకపోతున్నాం. మరి కొన్ని రోజులు ఈ పరిస్థితి ఉంటుంది. 
‑ గాజర్ల నారాయణ, నిర్మల్​