పండగ సీజన్​లో ఫుల్​ గిరాకీ గ్యారెంటీ

పండగ సీజన్​లో ఫుల్​ గిరాకీ గ్యారెంటీ
  • రిటెయిలర్లు, కన్జూమర్​ కంపెనీల ఆశలు

బిజినెస్​ డెస్క్, వెలుగు​: బట్టలు, జ్యుయెలరీతోపాటు ట్రావెల్​ కంపెనీలు ఈ పండగల సీజన్​తో తమ అమ్మకాలు పెరుగుతాయని ఆశలు పెంచుకుంటున్నాయి. మొత్తం  ఏడాది సేల్స్​లో ఒక్క డిసెంబర్​ క్వార్టర్లోనే 30 నుంచి 40 శాతం జరుగుతాయి. బట్టలు, ఎలక్ట్రానిక్స్​, గిఫ్టులు, ఇంట్లో ఫర్నిషింగ్స్​వంటివన్నీ పండగల సీజన్​లోనే కొనడం ప్రజలకు అలవాటు. కిందటేడాది పండగల జోష్​ లేకపోవడంతో ఈ కంపెనీలకు అమ్మకాలూ లేవు. ఈసారి మాత్రం కన్జూమర్లు కొనుగోళ్లకు ఎగబడతారని అంచనా వేస్తున్నట్లు ఇప్సాస్​ ఇండియా సీఈఓ అమిత్​ అదార్కర్​ చెప్పారు. గత అయిదు నెలలుగా ప్రైమరీ కన్జూమర్​ సెంటిమెంట్​ ఇండెక్స్​ (పీసీఎస్​ఐ) నిలకడగా పెరుగుతోంది. కిందటేడాదితో పోలిస్తే ఇది 9 పాయింట్లు పెరిగింది. చాలాకాలంగా ఇంటి వద్దే ఉండిపోవడంతో ఎక్కువ మంది ఈ పండగల సీజన్​లో తప్పనిసరిగా బట్టలు కొనాలనుకుంటున్నారని లిబాస్​ మేనేజింగ్​ డైరెక్టర్​ సిద్ధాంత్ కేష్వాని పేర్కొన్నారు. కరోనా టైములో క్యాజువల్​ క్లాత్స్​తోనే ప్రజలు కాలం గడిపేశారన్నారు. ఏడాదిన్నర కాలంలో ఎప్పుడూ లేని ఫెస్టివల్​ మూడ్​ ప్రజలలో ఇప్పుడు కనిపిస్తోందని చెప్పారు. కొత్త రకాలతో వార్డ్​రోబ్స్​ను నింపుకోవాలని కన్జూమర్లు కోరుకుంటున్నట్లు లెవీస్​ చెబుతోంది. చాలా ఏళ్ల తర్వాత ఈ దీపావళి మాకు మంచి సేల్స్​ తేనుందని లెవీస్​ మేనేజింగ్​ డైరెక్టర్​ సంజీవ్​ మొహంతి వెల్లడించారు.
కరోనా ముందుకు లెవెల్‌కు సేల్స్‌.. 
దేశంలోని రిటెయిలర్లు కూడా ఇదే మాట చెబుతున్నారు. సెప్టెంబర్​ నెలలో అమ్మకాలు కరోనా ముందు నాటి సేల్స్​లో 96 శాతానికి చేరినట్లు పేర్కొంటున్నారు. ఈ డేటాను రిటెయిలర్స్​ అసోసియేషన్ విడుదల చేసింది. రిటెయిల్​ సెక్టార్​కు ఈ పండగల సీజన్​ టర్న్​ అరౌండ్​ అవుతుందని ఆర్​ఏఐ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ కుమార్​ రాజగోపాలన్​ అన్నారు. వ్యాక్సినేషన్​ జోరందుకోవడంతో ఈసారి రిటెయిలర్లు ఎక్కువగా టెన్షన్​ పడటం లేదని డెలాయిట్​ టచ్​ పార్ట్​నర్​ పోరస్​ డాక్టర్​ చెప్పారు. అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లు ఫెస్టివల్​ సేల్స్​ మొదటి 4 రోజుల్లో 2.7 బిలియన్​ డాలర్ల సేల్స్ సాధించినట్లు డేటా చెబుతోంది.

12 రోజుల్లో రూ. 29 వేల కోట్లు
క్రెడిట్​, డెబిట్​ కార్డులతో కొనుగోళ్లు
అక్టోబర్​ నెల మొదటి 12 రోజులలో ​ కార్డు కొనుగోళ్లు ఆన్​లైన్​లో రూ. 29 వేల కోట్లకు చేరాయి. ఈ డేటాను ఆర్​బీఐ తొలిసారిగా విడుదల చేసింది. ఈ–కామర్స్​ వెబ్​సైట్స్​లో కొనుగోళ్లపైనే ఈ మొత్తాన్ని వెచ్చించినట్లు వెల్లడించింది. ఇప్పటిదాకా ఈ–కామర్స్​, పాయింట్​ ఆఫ్​ సేల్స్​ (పీఓఎస్​)ల డేటాను కలిపే ఆర్​బీఐ  ప్రకటించేది. అక్టోబర్​ మొదటి 12 రోజులలో ప్రజలు క్రెడిట్​ కార్డుల ద్వారా రూ. 19,817 కోట్లు, డెబిట్​ కార్డుల ద్వారా రూ. 9,304 కోట్లు ఖర్చు చేసినట్లు ఆర్​బీఐ వివరించింది. పీఓఎస్​ల ద్వారా క్రెడిట్​ కార్డుల కొనుగోళ్లు రూ. 10,840 కోట్ల దాకా ఉన్నాయని, ఇదే టైములో డెబిట్​ కార్డుల ద్వారా రూ. 15,781 కోట్లను కన్జూమర్లు వెచ్చించారని ఈ డేటా తెలిపింది. సెప్టెంబర్​ నెల మొత్తానికి చూస్తే ఈ–కామర్స్​ సైట్లలో క్రెడిట్​ కార్డుల ద్వారా కొనుగోళ్లు రూ.62,936 కోట్లుండగా, డెబిట్​ కార్డుల ద్వారా  కొనుగోళ్లు రూ. 51,701 కోట్లుగా ఉన్నాయి.