
హైదరాబాద్, వెలుగు: తుక్కుగూడలో కాంగ్రెస్ జన జాతర సభతో ఆ పార్టీ నేతల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. చేవెళ్ల లోక్ సభ సెగ్మెంట్ నుంచి పార్టీ కార్యకర్తలు లక్షలాదిగా తరలివెళ్లారు. కార్యక్రమ నిర్వహణను చేవెళ్ల ఎంపీ జి. రంజిత్‌రెడ్డి అంతా తానై వ్యవహరించారు. న్యాయ పత్రం పేరిట జాతీయస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేయడంతో క్యాడర్లో మంచి జోష్ వచ్చిందనే చర్చ జరుగుతుంది. ఇదే సభ నుంచి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేయడం, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. ఇప్పుడదే సెంటిమెంట్ తో మరోసారి న్యాయపత్రం పేరిట కాంగ్రె స్ జాతీయ స్థాయి మేనిఫెస్టోను ఇక్కడే విడుదల చేయటం, సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలు కార్యకర్తల్లో ఫుల్ జోష్ ని నింపాయి. అదే ఉత్సాహంతో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రచారంలో మరింత స్పీడ్ ని పెంచారు.