పట్టా భూముల లెక్కనే .. అసైన్డ్​ భూములకు పరిహారం : సీఎం రేవంత్ రెడ్డి

పట్టా భూముల లెక్కనే .. అసైన్డ్​ భూములకు పరిహారం : సీఎం రేవంత్ రెడ్డి
  • కొడంగల్​ భూముల విలువ కోకాపేట మాదిరిగా పెరగాలి
  • పరిశ్రమల స్థాపన కోసం భూములు ఇవ్వాలి: సీఎం రేవంత్​రెడ్డి​
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన ముఖ్యమంత్రి

కొడంగల్, వెలుగు : కొడంగల్​ నియోజకవర్గాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని, పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు లభించడంతోపాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు ఇవ్వాలని కోరారు. పట్టా భూముల లెక్కనే అసైన్​మెంట్​ భూములకు కూడా పరిహారం ఇప్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు. 

మహబూబ్​నగర్​ స్థానిక సంస్థల బై పోల్స్​ సందర్భంగా ఆయన ఎక్స్​ అఫీషియో హోదాలో కొడంగల్​ పోలింగ్​ సెంటర్​లో గురువారం మధ్యాహ్నం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం స్థానిక తన నివాసంలో మహబూబ్​నగర్​ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్​ రెడ్డితో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొడంగల్​ భూములకు కోకాపేట భూములంత విలువ రావాలని, ఇది కొడంగల్​ ప్రాంతం అభివృద్ధి చెందితేనే సాధ్యమని చెప్పారు. కష్ట కాలంలో ఇక్కడి ప్రజలు తనకు అండగా ఉన్నారని, వెనుకబడ్డ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. 

‘‘కొడంగల్​కు పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు వస్తే చదువుకున్నోళ్లకు ఉద్యోగాలు వస్తయ్​.. అంతేకాదు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడి భూముల విలువలు పెరుగుతాయి. ఇయ్యాళ కోకాపేటలో రూ. వంద కోట్లకు ఎకరం.. కొడంగల్​లో  రూ.10 లక్షలకే ఎకరం ఎందుకు ఉంది? కోకాపేటలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వచ్చినయ్​. అందుకే అక్కడ భూములకు రేట్లు పెరిగినయ్​. కొడంగల్​ భూములకు కూడా ఆ విలువ రావాలి. ఎవరో ఒకరు భూములిస్తేనే పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చు. పట్టా భూముల లెక్కనే అసైన్​మెంట్​ భూములకు కూడా అంతే పరిహారం ఇవ్వాలని అధికారులకు సూచించాను” అని సీఎం పేర్కొన్నారు. 

మెడికల్​, ఇంజినీరింగ్​, వెటర్నరీ, మహిళా డిగ్రీ కాలేజీలు, కొడంగల్ నారాయణపేట స్కీమ్​ను  కొడంగల్​ ప్రాంతానికి మంజూరు చేశామని తెలిపారు. త్వరలోనే కస్తూర్​పల్లిలో సిమెంట్​ కంపెనీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా ఉండేటట్టు కొడంగల్​ను తీర్చిదిద్దాలనేదే తన ప్రయత్నమని సీఎం చెప్పారు. తాను ఎంత పెద్ద నాయకుడినైన కొడంగల్​ కుటుంబ సభ్యుడినేనని, ఎప్పుడైనా, ఎక్కడున్నా ఒక కన్ను కొడంగల్​పై ఉంటుందన్నారు. 

50 వేల మెజారిటీ అందించాలి

లోక్​సభ ఎన్నికల్లో కొడంగల్​ నియోజకవర్గం నుంచి 50 వేల మెజారిటీ అందించి మహబూబ్​నగర్​ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్​ రెడ్డిని గెలిపించాలని రేవంత్ ​రెడ్డి కోరారు. నియోజకవర్గ, మండల, బూత్​ స్థాయిలో ఫైవ్​ మెన్​ కమిటీలను నియమించుకోవాలన్నారు. మళ్లీ ఏప్రిల్​ 8న కొడంగల్​ వచ్చి మండలాల వారీగా సమావేశమవుతానని చెప్పారు. వచ్చే నెల 6న తుక్కుగూడ రాజీవ్​ ప్రాంగణంలో జరిగే రాహుల్​ గాంధీ సభకు నియోజకవర్గం నుంచి భారీగా పార్టీ కార్యకర్తలు, లీడర్లు తరలి రావాలని ఆయన కోరారు. 

గత పాలకులు పాలమూరుపై పగబట్టారు: వంశీచంద్​రెడ్డి

పదేండ్లుగా గత పాలకులు పాలమూరుపై పగబట్టి నిర్లక్ష్యానికి గురిచేశారని సీడబ్ల్యూసీ మెంబర్, ఎంపీ అభ్యర్థి వంశీచంద్​రెడ్డి అన్నారు. రేవంత్​ రెడ్డి సీఎం కావడం గర్వకారణమని చెప్పారు. రేవంత్​ తనను కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినా.. వాస్తవానికి రేవంత్‌ని చూసి ఓటు వేయాలన్నారు.