
- ఐదు కిలోమీటర్ల ట్రాఫిక్‌జామ్
- అవస్థలు పడ్డ పర్యాటకులు
- ట్రాఫిక్ కంట్రోల్‌లో పోలీసులు విఫలం
పదేళ్ల తర్వాత కళకళలాడుతున్న నాగార్జున సాగర్ కు.. టూరిస్టులు పోటెత్తుతున్నారు. గురువారం సెలవు రోజు కావడంతో దాదాపు లక్ష మందికిపైగా జనం తరలి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. డ్యాం పరిసరాలు, పైలాన్ కాలనీ నుంచి బుద్ధవనం వరకు రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిపోయాయి. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన టూరిస్టులు అవస్థలు పడ్డారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత వచ్చిన వేలాది మంది సాగర్ క్రస్ట్‌గేట్ల వద్దకు చేరుకోలేక నిరాశగా వెనుదిరిగారు.
హాలియా, వెలుగు: నాగార్జున సాగర్‌కు పర్యాటకులు పోటెత్తారు. అంచనాలు తారుమారు చేస్తూ గురువారం భారీగా రావడంతో పోలీసులు, పర్యాటకులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. లక్ష మందికిపైగా టూరిస్టులు రావడం, తిరుగు ప్రయాణంలో అందరూ ఒకేసారి బయలుదేరడంతో సుమారు ఐదు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. సాయంత్రం నాలుగు గంటల తరువాత వచ్చిన 3 వేల నుంచి 4 వేల మంది సాగర్ క్రస్ట్‌గేట్ల వద్దకు చేరుకోలేక నిరాశగా వెనుదిరిగారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చూస్తున్నామని పోలీసులు ప్రకటనలు విడుదల చేస్తున్నా వెహికల్స్‌ను కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. మిర్యాలగూడ డీఎస్పీ పర్యవేక్షణలో ఎనిమిది మంది ఎస్ఐలు, 48 మంది సిబ్బందితో ట్రాఫిక్ ఆంక్షలతో సమస్యను నివారించాలని ప్రయత్నించినప్పటికీ ట్రాఫిక్ క్రమబద్ధీకరిచ లేకపోయారు. దీంతో డ్యాం పరిసరాలు, పైలాన్ కాలనీ నుంచి బుద్ధవనం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలతో కిక్కిరిపోయి ట్రాఫిక్ స్తంభించింది. ఐదు గంటల పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి టూరిస్టులు అవస్థ పడ్డారు. సాగర్ అందాలు చూసేందుకు నల్గొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ కుటుంబంతో నాగార్జునసాగర్వచ్చారు. అయితే పవర్ హౌజ్ చూసి లిఫ్ట్‌లో పైకి వస్తుండగా మొదటి అంతస్తులోనే ఆగిపోయింది. దీంతో వారు కొంత ఆందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి మెట్ల ద్వారా పైకి చేరుకున్నారు.