
న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు నిధులు వరదలా పారుతున్నాయి. వెంచర్ ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌లో వీటికి 10 బిలియన్ డాలర్ల ఫండింగ్ (దాదాపు రూ.76 వేల కోట్లు) రాగా, 329 డీల్స్ జరిగాయి. కిందటేడాది ఇదే క్వార్టర్‌లో 5.7 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్లు రాగా, 225 డీల్స్ కుదిరాయి. 2020 క్యూ1లో స్టార్టప్‌లు 214 బిలియన్ డాలర్లు అందుకోగా, 214 డీల్స్ జరిగాయి. తాజా క్వార్టర్‌లో లేట్ స్టేజ్ డీల్స్ ద్వారా 5.8 బిలియన్ డాలర్లను సమీకరించాయి. జనవరి–మార్చిలో వచ్చిన మొత్తం డీల్స్‌లో ఈ లేట్ స్టేజ్ డీల్స్ వాటా 45 శాతం. స్విగ్గీ అత్యధికంగా ఈ ఏడాది జనవరిలో 700 మిలియన్ డాలర్లు సేకరించింది. సుమేరూ వెంచర్స్, ఇన్వెస్కో, ప్రోసస్ వెంచర్స్, ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, అల్ఫా వేవ్ గ్లోబల్, ఐఐఎఫ్ఎల్వీసీ, కోటక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ఈ డబ్బును అందించాయి. మరో స్టార్టప్ పాలిగాన్కు ఫిబ్రవరిలో రిపబ్లిక్ క్యాపిటల్, గెలాక్సీ ఇంటరాక్టివ్, సాఫ్ట్‌బ్యాంక్, టైగర్ గ్లోబల్, సెకోవియా క్యాపిటల్ ఇండియా నుంచి 450 మిలియన్ డాలర్లు స్టార్టప్‌లకు అందాయి. సుమేరూ వెంచర్స్, విట్రువియన్ పార్ట్‌నర్స్‌తోపాటు మరికొన్ని సంస్థల నుంచి ఈ ఏడాది మార్చిలో బైజూస్‌కు 400 మిలియన్ డాలర్ల ఫండింగ్ వచ్చింది. యూనిఫోర్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ కూడా 400 మిలియన్ డాలర్లను అందుకుంది. మార్చ్ క్యాపిటల్, ఎన్‌ఏఈ వంటి సంస్థలు ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశాయి. స్టార్టప్ కంపెనీ ఫ్రాక్టల్ టీపీజీ క్యాపిటల్ నుంచి 360 మిలియన్ డాలర్లు అందుకుంది.