మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోటా సీటుకు మస్తు రేటు

మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోటా సీటుకు మస్తు రేటు
  • మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోటా సీటు మస్తు రేటు
  • ఎంసెట్ రిజల్ట్ రాక ముందే ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల అమ్మకాలు షురూ
  • స్టూడెంట్ల నుంచి లక్షల్లో డొనేషన్లు, ఫీజులు వసూల్
  • కొన్ని కాలేజీల్లో సీట్లన్నీ ఫుల్
     

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు అప్పుడే సీట్ల బేరం మొదలుపెట్టాయి. ఎంసెట్ రిజల్ట్ రాకముందే మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోటా సీట్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ యేడాది ఎంసెట్ ఇంజనీరింగ్ స్ర్టీమ్​కు ఎక్కువ మంది హాజరు కావడంతో మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు కూడా ఎక్కువ మొత్తంలో డొనేషన్లు, ఫీజులను డిమాండ్ చేస్తున్నట్టు పేరెంట్స్ చెప్తున్నారు. దీనిపై జేఎన్టీయూ, విద్యాశాఖ ఆఫీసర్లు చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో 181 ఇంజనీరింగ్ కాలేజీలుండగా, వీటిలో లక్షకు పైగా సీట్లున్నాయి. ఇందులో 167 ప్రైవేటు కాలేజీల్లో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా ద్వారా సర్కారు భర్తీ చేస్తుంది. మిగిలిన 30 శాతం సీట్లను మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోటా కింద కాలేజీలు రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం భర్తీ చేసుకోవాలి. మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోటా భర్తీకి ప్రత్యేకంగా విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి గైడ్​లైన్స్​ఇస్తాయి. కానీ సర్కారు గైడ్​లైన్స్​ను ఏ ఒక్క కాలేజీ అమలు చేయడం లేదు. ఈ నెల 25న ఎంసెట్ రిజల్ట్ విడుదల చేస్తామని, 30 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ స్టార్టవుతుందని అధికారులు ప్రకటించారు. అంతకుముందే కాలేజీలు సీట్ల అమ్మకాలు సాగిస్తున్నాయి.

సీట్లకు ఫుల్ డిమాండ్
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 30 వేల దాకా మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోటా సీట్లున్నాయి. వీటిని భర్తీ చేసే ముందు మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు ఏఏ కోర్సుల్లో ఎన్ని సీట్లున్నాయనే విషయాన్ని తెలియజేస్తూ పేపర్లలో ప్రకటనలు ఇవ్వాలి. వచ్చిన దరఖాస్తుల్లో మెరిట్ ప్రకారం స్టూడెంట్లకు సీట్లు కేటాయించాలి. ఫీజు కూడా సర్కారు నిర్ణయించిన ప్రకారమే వసూలు చేయాలి. కానీ ఇవేవీ అమలు కావడం లేదు. మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోటా నోటిఫికేషన్ రాక ముందే, సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. కొన్ని కాలేజీల్లో సీట్లు నిండిపోయాయని సిబ్బంది చెప్తున్నారు. ఈ ఏడాది ఎంసెట్​ఇంజినీరింగ్ స్ర్టీమ్ లో 1,64,964 మంది అప్లై చేస్తే, 1,47,986 మంది హాజరయ్యారు. సీట్లు తక్కువగా ఉండటంతో కొన్ని కాలేజీలు పేరెంట్స్​కు ఫోన్లు చేస్తున్నాయి. ముందుగా సీట్లు బుక్ చేసుకోవాలని, లేకపోతే దొరకవని చెబుతున్నాయి. దీంతో పేరెంట్స్​కూడా సీట్ల కోసం మంచి కాలేజీల చుట్టూ తిరుగుతున్నారు.

డొనేషన్ కట్టాల్సిందే
రాష్ట్రంలో ఇంజనీరింగ్​లో సీఎస్ఈ, ఈసీఈ, ఏఐ, సైబర్ సెక్యూరిటీ తదితర కోర్సులకు డిమాండ్ ఉంది. టాప్ కాలేజీలు ఒక్కో సీటుకు రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా డొనేషన్, ఫీజు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల దాకా వసూలు చేస్తున్నాయి. కొన్ని కాలేజీలు నాలుగేండ్ల ఫీజును ఒకేసారి ఇవ్వాలని రూల్ పెడ్తున్నాయి. డిమాండ్ ఉన్న కోర్సులను బట్టి ఫీజులు డిసైడ్ చేస్తున్నాయి. మంచి కాలేజీలో సీట్ల కోసం పేరెంట్స్ పోటీ పడుతుండటం మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లకు కలిసివస్తోంది. పేరున్న కాలేజీల్లో సీటు వస్తే చాలు.. ఫీజు, డొనేషన్ ఎంతైనా చెల్లిస్తామని కొందరు చెప్తున్నారు. కానీ మధ్యతరగతి పేరెంట్స్ కు ఇబ్బందులు తప్పడం లేదు. మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోటా సీట్ల అమ్మకాల విషయం ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూ అధికారులకు తెలిసినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ ఏడాదైనా మేనేజ్​మెంట్ కోటాను రూల్స్‌‌‌‌ ప్రకారం భర్తీ చేసేలా సర్కార్ చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.