ఏటీసీ షార్ట్ టర్మ్ కోర్సులకు ఫుల్ రెస్పాన్స్.. రెండు బ్యాచుల్లో 6 వేల మందికి ట్రైనింగ్ కంప్లీట్

ఏటీసీ షార్ట్ టర్మ్ కోర్సులకు ఫుల్ రెస్పాన్స్.. రెండు బ్యాచుల్లో 6 వేల మందికి ట్రైనింగ్ కంప్లీట్

హైదరాబాద్, వెలుగు: కార్మిక శాఖ ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ)లో ప్రభుత్వం స్టార్ట్ చేసిన జాబ్ ఓరియెంటెడ్ షార్ట్ టర్మ్ కోర్సులకు అనూహ్య స్పందన వస్తోంది. రాష్ర్ట ప్రభుత్వం 99 రోజుల ప్లాన్‎లో భాగంగా గత నెల 9న విజయ్ నగర్ కాలనీ ఏటీసీలో ఈ కోర్సులను కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్టార్ట్  చేశారు. 

రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న ఏటీసీలు, ఐటీఐల్లో వివిధ కోర్సుల్లో  ట్రైనింగ్ తీసుకుంటున్న 25 వేల మందికి జూన్ 2 వరకు 6 కోర్సుల్లో షార్ట్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నారు. ఒక్కో కోర్సుకు  20 మంది చొప్పున మొత్తం 7 బ్యాచ్‎లుగా అధికారులను డివైడ్ చేశారు. ఇప్పటికే 2 బ్యాచ్‎ల్లో 6 వేల మందికి ట్రైనింగ్ పూర్తయింది. త్వరలో వీరికి ప్రభుత్వం సర్టిఫికెట్లు అందజేయనున్నారు. మిగతా 5 బ్యాచ్ ల్లో 19వేల మందికి ట్రైనింగ్ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

ఈ కోర్సుల్లో శిక్షణ

ప్రస్తుత పోటీ ప్రపంచంలో మారుతున్న టెక్నాలజీ, కంపెనీల అవసరాలకు అనుగుణంగా జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను ఏటీసీ అధికారులు ఖరారు చేశారు. మొత్తం 6 కోర్సులు ఉండగా ఇందులో సీఎన్సీ మిషన్ ఆపరేషన్ పోగ్రామింగ్,  సీఎన్సీ మిల్లింగ్ మిషన్ ఆపరేషన్ పోగ్రామింగ్, అవేర్ నెస్ కోర్స్ ఆఫ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమిషన్,  జూనియర్ రోబోటో ఆఫీసర్ పోగ్రామర్ ఏఆర్ సీ వెల్డింగ్, ఈవీపై బేసిక్ కోర్స్, 2డీ, 3డీ జూనియర్ ప్రొడక్ట్ డిజైనర్ కోర్సులు ఉన్నాయి. కోర్సుల ట్రైనింగ్ అనంతరం  కంపెనీలతో కార్మిక శాఖ అధికారులు చర్చలు జరిపి కనీసం 6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని టార్గెట్ పెట్టుకున్నారు. 

ట్రైనింగ్ వేగంగా సాగుతోంది : రేణుక ,ఐటీఐ ప్రిన్సిపాల్, బహదూర్ పుర

99 రోజుల ప్లాన్ లో భాగంగా ఏటీసీలు, ఐటీఐల్లో స్టార్ట్ చేసిన జాబ్ ఓరియెంటెడ్ షార్ట్ టర్మ్ కోర్సుల ట్రైనింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే మా దగ్గర ఒక బ్యాచ్ ట్రైనింగ్ 90 మందికి పూర్తయింది.  మరో బ్యాచ్ 90 మందికి ట్రైనింగ్ సాగుతోంది. ఫస్ట్ బ్యాచ్ కు త్వరలో సర్టిఫికెట్లు ఇవ్వనున్నారు. వీరికి జాబ్స్ వచ్చేలా కంపెనీలతో చర్చలు జరుపుతాం. ఈ ట్రైనింగ్ పై అవేర్ నెస్ కల్పించడానికి ఇంటర్, పాలిటెక్నిక్ కాలేజీలకు వెళ్లి అక్కడ స్టూడెంట్స్ చేరేలా అవగాహన కల్పిస్తున్నాం. మొత్తం 7 బ్యాచ్ ల్లో ట్రైనింగ్ జూన్ 2 వరకు పూర్తి చేస్తాం.

మిషన్ లెర్నింగ్ లో ట్రైనింగ్ పూర్తయింది: అమరేందర్, సత్యసాయి, మల్లేపల్లి ఏటీసీ

కార్మిక శాఖ షార్ట్ టర్మ్ కోర్సుల్లో మొదటి బ్యాచ్ లో మా ట్రైనింగ్ పూర్తయింది. లేత్ మిషన్ ఆపరేషన్ పోగ్రామింగ్ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకున్నాం. ఈ మిషన్ తో డీఆర్డీఎల్, బుల్లెట్స్, కిక్ రాడ్స్, బ్రేక్స్ ఈ మిషన్ తయారు చేస్తాం. ఈ మిషన్ ఆపరేటింగ్ పై అవగాహన వచ్చింది.  వీఎంసీ మిషన్ లెర్నింగ్ లో ట్రైనింగ్ పూర్తి చేశాం. త్వరలో కంపెనీల నుంచి ఆఫర్స్ వచ్చేలా అధికారులు కృషి చేస్తున్నారు.