ప్రపంచవ్యాప్తంగా జోరుగా వ్యాక్సిన్ ట్రయల్స్

ప్రపంచవ్యాప్తంగా జోరుగా వ్యాక్సిన్ ట్రయల్స్

జనాలకు కొండంత భరోసా
ఇప్పటికే కొన్ని కంపెనీల వ్యాక్సిన్లు సక్సెస్
ఫేజ్3లో మంచి రిజల్ట్స్ ఇచ్చిన చైనా సైనోవాక్ వ్యాక్సిన్
ఎమర్జెన్సీ వాడకం కోసం సర్కార్ కు అప్లై చేసిన కంపెనీ
వైరస్ ను చంపేసిన ఆక్స్ ఫర్డ్ చేడాక్స్ వ్యాక్సిన్
డిసెంబర్ నాటికి 40 కోట్ల డోసులిస్తామన్న సీరమ్ ఇనిస్టిట్యూట్
ఫేజ్1,2 కలిపిచేస్తున్న భారత్ బయోటెక్, జైడస్,క్యాడిలా
పంద్రాగస్టు నాటికి తెస్తామన్న ఐసీఎంఆర్
మరోనాలుగు వ్యాక్సిన్లు ఫేజ్ 1, 2దశల్లో
ఫేజ్1లో పది..ప్రీ క్లినికల్ దశలో 140

బయట అడుగుపెట్టాలంటే భయం. కూరగాయలు తెచ్చుకుందామంటే భయం. షాపుకెళ్లి సరుకులు కొందామంటే భయం. అడుగు బయటపెట్టకున్నా ఏ రూపంలో ఆ కరోనా మహమ్మారి గడపలోపలికి వస్తుందోనన్న భయం. కానీ, ఆ భయాల మధ్యనే ఓ చిన్న భరోసా. ఆ భరోసా పేరే వ్యాక్సిన్. పంద్రాగస్టు నాటికి వ్యాక్సిన్ తెస్తామన్నది ఐసీఎంఆర్. ఈ ఏడాది చివరి నాటికి ఇస్తామన్నది ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ. కొన్ని కంపెనీల వ్యాక్సిన్లు ఇప్పటికే మంచి ఫలితాలనిస్తున్నాయి.

వెలుగు, సెంట్రల్ డెస్క్: కరోనా పీచమణిచేందుకు ప్రపంచమంతటా వ్యాక్సిన్ప్ ప్రయోగాలు జోరుగా సాగుతున్నాయి. అందులో కొన్ని చివరి దశకు చేరుకుంటే.. మరికొన్ని సెకండ్ స్టేజ్ కు వచ్చాయి. అన్ని స్టేజుల్లోనూ ఆ వ్యాక్సిన్ క్యాండిడేట్లు కరోనా కొమ్ములను విరిచేశాయి. మహమ్మారి
నుంచి పూర్తి భద్రతను ఇచ్చాయి. వాటిలో మూడు వ్యాక్సిన్లు ముందు వరుసలో ఉన్నాయి. మిగతా వ్యాక్సిన్ల ప్రయోగాలూ శరవేగంగా సాగుతున్నాయి. ఎవరెన్ని ప్రయోగాలు చేసినా.. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కోరల్లో నుంచి బయటపడేయాలన్నదే ఉద్దేశం.

సైనోవాక్ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్
వ్యాక్సిన్ పోటీలో ముందుంది చైనాకు చెందిన సైనోవాక్ కంపెనీ. ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా కరోనా వైరస్తోనే ఆ కరోనాను చంపాలన్నది ఈ వ్యాక్సిన్ మూల సిద్ధాంతం. కరోనా వైరస్ ను ఇనాక్టివేటెడ్ (చచ్చిపోయిన వైరస్ కణాలు) రూపంలో తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఇది. ఇప్పటికే మూడో ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ ను అది పూర్తి చేసుకుంది. అందులో మంచి ఫలితాలు వచ్చాయి. దానిని మార్కెట్లోకి విడుదల చేయడం కోసం చైనా సర్కార్కు రెగ్యులేటరీ ఫైలింగ్ను చేసింది కంపెనీ. బుటాంటన్ ఇనిస్టిట్యూట్ తో కలిసి సైనోవాక్ ఈ వ్యాక్సిన్ను తయారు చేసింది. మూడో ఫేజ్లో భాగంగా 14 రోజుల తేడాతో రెండు డోసులను ఇంజెక్షన్ రూపంలో ఇచ్చి పరీక్షించింది కంపెనీ. 8,870 మంది వాలంటీర్లపై ర్యాండమైజ్డ్ట్ గా ట్రయల్ చేసింది. వాళ్లందరినీ సంవత్సరం పాటు అబ్జర్వేషన్లో ఉంచుతారు. రెగ్యులేటరీ ఫైలింగ్ చేసినా.. ఫేజ్3 ట్రయల్స్ ఫలితాలను వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఎమర్జెన్సీ వాడకం కోసం ప్రభుత్వానికి కంపెనీ దరఖాస్తు చేసుకుంది.

ఆక్స్ ఫర్డ్ చేడాక్స్.. ఈ ఏడాది చివరి నాటికే
నిజానికి సైనో వాక్ వ్యాక్సిన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నా.. ముందు నుంచీ అందరి దృష్టి ఉన్నది ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పైనే. ఈ ఏడాది అక్టోబర్ నాటికి వ్యాక్సిన్ను తెస్తామని 4 నెలల క్రితమే ప్రకటించింది ఆక్స్ ఫర్డ్. దీంతో ఇది హాట్ టాపిక్ అయింది. అంత తొందరగా వ్యాక్సిన్ ఎట్ల వస్తదని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ వేగంగా మూడో ఫేజ్ క్లినికల్ ట్రయల్స్లోకి ఎంటరైంది ఆక్స్ ఫర్డ్ తయారు చేస్తున్న చేడాక్స్ 1ఎన్ కోవ్19 వ్యాక్సిన్ . తొలి రెండు దశల్లో మంచి ఇమ్యూన్ రెస్పాన్స్ ఇచ్చింది. మూడో దశలోనూ మంచి ఫలితాలనిస్తున్నది. చింపాంజీల్లో మామూలు జలుబుకు కారణమయ్యే అడినోవైరస్ చేడాక్స్1కు (ఇనాక్టివేటెడ్) కరోనా వైరస్లోని కొమ్ముల్లో ఉండే
ప్రొటీన్ను కలిపి చేడాక్స్1ఎన్ కోవ్19 వ్యాక్సిన్ను తయారు చేశారు. బ్రిటన్ కు చెందిన ఆస్ట్రాజెనికా ఆ వ్యాక్సిన్ను కమర్ఫియల్ గా మార్కెట్లోకి తీసుకురానుంది. ఇండియా నుంచి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ తయారీకి పార్టనర్ గా ఉంది. ఇప్పటికే బ్రిటన్, బ్రెజిల్, సౌతాఫ్రికాల్లో ట్రయల్స్ సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది.

మోడర్నా ఎంఆర్ఎన్ఏ.. 2 డోసులు.. రెండేండ్లు
అమెరికాకు చెందిన మోడర్నా కంపెనీ కూడా వ్యాక్సిన్ ను సిద్ధం చేస్తున్నది. వైరస్ ఆర్ఎన్ఏని బేస్ చేసుకుని వ్యాక్సిన్ను తయారు చేస్తున్నది. దానిపేరు ఎంఆర్ఎన్ఏ 1273. ఫేజ్1, ఫేజ్2 ట్రయల్స్లో ఆ వ్యాక్సిన్ మంచి ఫలితాలనిచ్చింది. ఇప్పుడు మూడో ఫేజ్ లోకి ఎంటరైంది. దీనికి సంబంధించి 30 వేల మంది వాలంటీర్లపై టెస్టులు చేయనుంది. రెండు డోసులు వేసుకుంటే రెండేండ్ల పాటు ప్రొటెక్షన్ ఉంటుందని కంపెనీ చెబుతున్నది. ఈ నెల 27 నుంచి మూడో ఫేజ్ ట్రయల్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాక్సిన్నూ ఇంజెక్షన్ రూపంలోనే ఇస్తారు. అయితే, ఆ వ్యాక్సిన్ ఎప్పుడు మార్కెట్లోకి వచ్చేది మాత్రం కంపెనీ చెప్పలేదు.

ఫేజ్2లో మరికొన్ని ..
అవి కాకుండా మరికొన్నివ్యాక్సిన్లు ఫేజ్ 2 ట్రయల్స్ లో ఉన్నాయి. చైనాకు చెందిన కాన్సినో బయోలాజికల్ ఐఎన్సీ అనే సంస్థ బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీతో కలిసి అడినోవైరస్ టైప్5 ప్రొటీన్ తో వ్యాక్సిన్ను తయారు చేస్తున్నది. చైనాకే చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్తో కలిసి అన్హూయి ఝైఫీ లాంగ్కామ్ బయోఫార్మాస్యుటికల్ మెర్స్ వైరస్ లోని ప్రొటీన్ను బేస్ చేసుకుని వ్యాక్సిన్ను తయారు చేస్తున్నది. ఈ రెండు ఫేజ్2లోకి ఎంటరయ్యాయి. ప్రొటీన్ ను సబ్ యూనిట్ బేస్ గా అమెరికాకు చెందిన నోవావ్యాక్స్, ఇనాక్టివేటెడ్ వైరస్ బేస్ గా బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్స్ట్, వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ తో కలిసి సైనోఫార్మ్అనే సంస్థ వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయి. అవి ఫేజ్1, ఫేజ్2లను కలిపి ట్రయల్ చేస్తున్నాయి. ఫైజర్ చేస్తున్న ఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ ఫేజ్1/2 ట్రయల్స్ దశలో ఉంది. మరో పది వ్యాక్సిన్ క్యాండిడేట్లు ఫేజ్1 దశలో ఉన్నాయి. ఇంకో 140 వ్యాక్సిన్ క్యాండిడేట్లపై ప్రపంచవ్యాప్తంగా ప్రి క్లినిక్లికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి.

సెప్టెంబర్లో రష్యా వ్యాక్సిన్!
రష్యా ఆర్మీ స్వయంగా ఓ వ్యాక్సిన్ తయారు చేస్తున్నది. ప్రభుత్వ సంస్థ అయిన గమాలెయా ఇనిస్టిట్యూట్ తో కలిసి అభివృద్ధి చేస్తున్నది. తొలి 2 దశల్లో వ్యాక్సిన్ మంచి ఫలితాలనిచ్చిందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ హెడ్ కిరిల్ దిమిత్రీవ్ చెప్పారు. ఆగస్టు 3 నుంచి ఫేజ్3 ట్రయల్స్ చేస్తామని చెప్పారు. రష్యా, సౌదీఅరేబియలో వేలాది మందిపై ప్రయోగాలు నడుస్తాయన్నారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి వ్యాక్సిన్లను డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు.

దేశీ తొలి వ్యాక్సిన్ భారత్ బయోటెక్ కో వ్యాక్సిన్
కో వ్యాక్సిన్ దేశంలో తయారవుతున్న తొలి కరోనా టీకా. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ దీన్ని తయారు చేస్తోంది. ఆ వ్యాక్సిన్ మొదటి దశ ట్రయల్స్ దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. నిమ్స్ లో ఇద్దరికి వ్యాక్సిన్ ఇచ్చారు. మరికొంత మందికి త్వరలోనే ఇవ్వనున్నారు. మొత్తంగా 375 మందిపై ట్రయల్స్ చేయనున్నారు. వ్యాక్సిన్ ను పంద్రాగస్టునాటికి తీసుకొస్తామని ఇండియన్ కౌన్సిల్ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ప్రకటించిన సంగతి తెలిసిందే. పంద్రాగస్టు నాటికి ఎట్లాతెస్తారని సైంటిస్టులు ప్రశ్నించడంతో.. మన సైంటిస్టుల మీద నమ్మకం ఉంచాలని ఐసీఎంఆర్ చెప్పింది. ఐసీఎంఆర్, ఎన్ఐవీల సహకారంతో కంపెనీ దీన్ని తయారు చేస్తోంది. మన దేశానికే చెందిన జైడస్ క్యాడిలా రెడీ చేస్తున్న డీఎన్ఏ టైప్ వ్యాక్సిన్ (జైకోవీ) ఫేజ్1/2 దశలో ఉంది.

నోటి స్ప్రేతో కరోనా ఖతమైంది
కరోనా ట్రీట్మెంట్ జాబితాలోకి ఇప్పుడు ఓ మౌత్ స్ప్రే కూడా చేరింది. స్వీడన్ కు చెందిన ఎంజైమాటికా సంస్థ దీనిపై ల్యాబ్లో చేసిన ఇన్ విట్రో స్టడీస్ లో మంచి ఫలితాలొచ్చాయి. మామూలు జలుబుకు వాడే తమ మందు ‘కోల్డ్ జైమ్’.. జస్ట్ 20 నిమిషాల్లోనే 98.3 శాతం వరకు కరోనాను చంపేసిందని కంపెనీ ప్రకటించింది. మనుషులపై ట్రయల్స్‌ కోసం దరఖాస్తు చేసినట్టు చెప్పింది.

వ్యాక్సిన్ అవసరమే లేదు..
కరోనాకు వ్యాక్సిన్ అవసరమే లేదని అమెరికాకు చెందిన ప్రముఖ డాక్టర్ రిచర్డ్ బార్లెట్ చెబుతున్నారు. మార్కెట్లో ఆల్రెడీ మందు ఉందంటున్నారు. తన దగ్గరకు వచ్చే పేషెంట్లకు దానితోనే ట్రీట్మెంట్ చేస్తున్నానని, వాళ్లందరికీ వారంలో నయమైపోతున్నదని అన్నారు. ఆస్తమాకు వాడే స్ప్రేతో కరోనాను నయం చేయొచ్చని అంటున్నారు. నెబ్యులైజర్ ద్వారా ఆ మందును రోజూ 5 నిమిషాల పాటు ఇస్తే సరిపోతుందని చెప్పారు. వారంలో జ్వరం, ఆయాసం తగ్గడంతో పాటు కరోనా కూడా నయమైపోతుందని అంటున్నారు. ఈ మందు మొత్తం కోర్సుకు 200 డాలర్లు ఖర్చు అవుతుందన్నారు. దానికితోడు న్యుమోనియా వంటి సెకండరీ ఇన్ ఫెక్షన్లను తగ్గించేందుకు యాంటీబయాటిక్లు, ఇమ్యూనిటీని పెంచేందుకు జింక్, విటమిన్ సప్లిమెంట్లను ఇస్తున్నానని తెలిపారు. తైవాన్, జపాన్, సింగపూర్, ఐస్ లాండ్ వంటి దేశాలు అదే మందును వాడుతున్నాయని చెప్పారు.

డిసెంబర్ కల్లా 40 కోట్ల డోసులు
డిసెంబర్ నాటికి దేశంలో ఆక్స్ ఫర్డ్ తయారుచేస్తున్న వ్యాక్సిన్ను రెడీ చేస్తామని దాని తయారీలో పార్టనర్ అయిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ప్రకటించింది. ‘కొవిషీల్డ్’ పేరుతో మార్కెట్ చేస్తామని కంపెనీ సీఈవో అధర్ పూనావాలా చెప్పారు. వ్యాక్సిన్ తో మంచి ఫలితాలు వస్తున్నాయని, డిసెంబర్ నాటికి 30 కోట్ల నుంచి 40 కోట్ల డోసులను సిద్ధం చేస్తామని ఆయన చెప్పారు. ఒక్కోడోసులో పది చొప్పున వ్యాక్సిన్ బుడ్లు ఉంటాయన్నారు. ఒక్కో వ్యాక్సిన్ ధర రూ.వెయ్యి అని చెప్పారు. వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలో వ్యాక్సిన్ను డిస్ట్రిబ్యూట్
చేస్తామన్నారు.

For More News..

ఢిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరికి