నిధుల్లేక..నిలిచిన పనులు ..ఆగిపోయిన 124 హెల్త్ సబ్ సెంటర్ వర్క్స్​

నిధుల్లేక..నిలిచిన పనులు ..ఆగిపోయిన 124 హెల్త్ సబ్ సెంటర్ వర్క్స్​
  • పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు

సంగారెడ్డి, వెలుగు: జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 124 హెల్త్​ సబ్​సెంటర్ల నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు జారీచేసింది. కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. దీంతో బిల్డింగ్ పనులు మొదలు పెట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. కొంతమంది కాంట్రాక్టర్లు సొంత డబ్బులు ఖర్చు చేసి పనులు మొదలుపెట్టినప్పటికీ సకాలంలో బిల్లులు అందక వాటిని మధ్యలోనే 
నిలిపివేశారు. 

జిల్లాలో 124 సబ్ సెంటర్లకు భవనాలు

జిల్లా వ్యాప్తంగా 246 హెల్త్ సబ్ సెంటర్లు ఉండగా ఇందులో 124 కేంద్రాలకు పక్కా భవనాలు మంజూరు చేస్తూ  వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ గత ఏడాది మే 31న ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో సెంటర్ నిర్మాణానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేశారు. దీనికి సంబంధించి అప్పటి కలెక్టర్ శరత్ జులై 10న పాలనపరమైన అనుమతులు ఇచ్చి అదే రోజు నిర్మాణాల బాధ్యతలను వివిధ ప్రభుత్వ ఏజెన్సీలకు కేటాయించారు.

పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి 81 సెంటర్లు, డీఆర్డీఏకు 34, టీఎస్​ఎంఎస్​ఐడీసీకి 9 హెల్త్ సబ్ సెంటర్లు అప్పగించారు. కాగా టీఎస్​ఎంఎస్​ఐడీసీకి గత ఏడాదిలోనే 9 సెంటర్ల బిల్డింగ్ లను నిర్మించేందుకు ముందుకు రాగా పొలిటికల్ లీడర్ల జోక్యంతో ఆరు నెలల వరకు పనులు మొదలుపెట్టలేదు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా హెల్త్ సబ్ సెంటర్ల బిల్డింగ్ నిర్మాణాలకు త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 నో ఫండ్స్.. 

పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి కేటాయించిన 81 హెల్త్ సబ్ సెంటర్లలో 68 సెంటర్ల పనులు మొదలయ్యాయి. కానీ ఫండ్స్ లేక మధ్యలోనే నిలిచిపోయాయి. మిగిలిన 13 ఆరోగ్య ఉప కేంద్రాల భవనాల నిర్మాణాలను అసలు ప్రారంభించలేదు. వీటికి డబ్బులు లేవన్న కారణంతో టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఫండ్స్ కావాలని డీఎంహెచ్​వోకు సిఫార్స్​ లెటర్ రాసినా స్పందించలేదని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం కొనసాగుతుండడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు హెల్త్​ సబ్​సెంటర్ల నిర్మాణాలపై దృష్టిపెట్టి త్వరగా పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు. 

Also Read : మేడిగడ్డ సత్తెనాశ్​.. ఘోరంగా దెబ్బతిన్న బ్యారేజీ