స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయాలి

స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయాలి

సర్పంచులకి రావాల్సిన బిల్లులు వచ్చేవరకు కాంగ్రెస్ పోరాటం చేస్తదని, ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లో సర్పంచులు చేసిన పనులకి బిల్లులు ఇవ్వలేదని చెప్పారు. పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇవ్వలేకపోవడంతో గత కొన్ని రోజులుగా వివిధ జిల్లాల్లో సర్పంచ్ లు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. .జూన్ 06వ తేదీ సోమవారం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. సర్పంచులకు అన్ని బిల్లు ఇచ్చేశామని మంత్రి చెబుతున్నారు, కానీ బిల్లులు రాక వడ్డీ కట్టడానికి సర్పంచులు ఉపాధి పనికి వెళుతున్నారని తెలిపారు. స్థానిక సంస్థల విధానాలు చాలా అధ్వాన్నంగా మారుతున్నాయని, స్థానిక సంస్థలకి ఇవ్వాల్సిన నిధులు వెంటనే రిలీజ్ చేయడమే కాకండా దీనిపై శ్వేతపత్రం విడుదల చెయాలని డిమాండ్ చేశారాయన. సర్పంచులంతా ఐక్యంగా కలసి కట్టుగా బిల్లులు వచ్చేదాకా పోరాటం చెయ్యాలని వారికి సూచించారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల విషయంలో తాను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నట్లు గుర్తు చేశారు. సర్కార్ చేసిన అప్పులకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైందన్నారు. ఉద్యోగులకి జీతాలు కూడ ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. జూబ్లిహిల్స్ మైనర్ బాలిక కేసుపై ఆయన స్పందించారు. నగరంలో మైనర్ బాలికలకు రక్షణ లేకుండా పోయిందేని, ప్రభుత్వం చేయాల్సిన పనులని గుర్తు చేసే వాళ్లని అరెస్ట్ చేయడం సబబు కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే రిలీజ్ చెయ్యాలని మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తల కోసం : -
టీఆర్ఎస్ లీడర్లు తాలిబన్లలా వ్యవహరిస్తున్నారు


బాలిక కేసులో దోషులను తప్పించే కుట్ర