బాలిక కేసులో దోషులను తప్పించే కుట్ర

బాలిక కేసులో దోషులను తప్పించే కుట్ర

జూబ్లీహిల్స్ పరిధిలో బాలికపై అత్యాచారం కేసులో అసలు దోషులను తప్పించే కుట్ర జరుగుతోందని  బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. దోషులను కాపాడే దురుద్దేశంతోనే కాంగ్రెస్, మజ్లిస్, టీఆర్ఎస్ నాయకులు కలిసి తనపై మూకుమ్మడి విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. వారి ఉడుత ఊపులకు తాను భయపడేది లేదని స్పష్టంచేశారు.సోమవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

హోం మంత్రి మనవడి గురించి ఇంకా మాట్లాడలేదు

మజ్లిస్ ఎమ్మెల్యే కొడుకును అరెస్ట్ చేయాలని.. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎందుకు అడగడం లేదో చెప్పాలన్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని ఉంటే.. ఎమ్మెల్యే కొడుకును అరెస్టు చేయాలంటూ ఆందోళనలు చేయాలని కాంగ్రెస్  పార్టీకి రఘునందన్ సూచించారు. ‘‘నేను అమ్మాయి పేరు చెప్పలేదు.ముఖం చూపెట్టలేదు. నేను ఫొటోలు కూడా విడుదలచేయక ముందే అన్ని టీవీలలో విజువల్స్ వచ్చాయి. కేసులు ఎదుర్కోవడం నాకు కొత్త కాదు. వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ కు నా గురించి తెలుసు. అయినా నా తప్పుంటే కేసు పెట్టండి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘నేను ఇప్పటిదాకా హోం మంత్రి మనవడి గురించి ఇంకా మాట్లాడలేదు..వీడియో లు ఇంకా బయట పెట్టలేదు’’ అని  రఘునందన్ రావు పేర్కొన్నారు. ‘‘నాకు కాంగ్రెస్ పార్టీలోనూ, టీఆర్ఎస్ లోనూ క్లయింట్ లు ఉన్నారు. నేను బీజేపీలో చేరాక ఎక్కడా కేసులు వాదించలేదు. పాత బొమ్మలు చూపెట్టి ఏదో అనుకుంటున్నారు. మనం తర్వాత కొట్లడుకుందాం. అందరం  కలిసి బాధిత అమ్మాయికి న్యాయం జరగాలని పోరాడుదాం’’ అని ఆయన పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు..

‘జెంటిల్ మెన్2’ డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడు

అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు