
ఫర్నిచర్ తయారీ కంపెనీలతోపాటు, సంబంధిత సంస్థలకు సహకారం అందించడానికి హైదరాబాద్‌లో ఫర్నిచర్ పార్క్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వ ఐటీ, పరిశ్రమలశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రకటించారు. ప్రముఖ ఫర్నిచర్ కంపెనీ ఐకియా స్టోర్ మొదటివార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ పార్కులో భాగస్వాములు కావాలని ఐకియాను కోరారు. నగరశివార్లలో దీనిని 100 ఎకరాల్లో నిర్మిస్తామని ప్రకటించారు. ఇందులో ఐకియాకు ప్రత్యేకంగా జాగా కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఫర్నిచర్ పరిశ్రమను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని అన్నారు. ఈ పార్క్‌లో తమ యూనిట్లను స్థాపించడానికి ఇది వరకే కొంతమంది తయారీదారులు ఆసక్తిచూపారని వెల్లడించారు. ప్రపంచప్రసిద్ధి చెందిన నిర్మల్ పెయింటింగ్స్‌ను అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లడానికి సహకరించాలని ఐకియా ఇండియా సీఈఓ పీటర్ బెట్జెల్‌ను జయేశ్ రంజన్ కోరారు.