
- అమృత్ భారత్ స్కీంలో రూ.25.41 కోట్లతో హైఫై డెవలప్‍మెంట్
- అత్యాధునిక ఫుట్ ఓవర్ బ్రిడ్జి, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ప్లాట్‍ఫారాలు
- ప్రారంభానికి రెడీగా వరంగల్, పెండింగులో కాజీపేట, జనగామ, మహబూబాబాద్
- వర్చువల్‍గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
వరంగల్, వెలుగు: ఓరుగల్లు కేంద్రంగా దేశంలోని వివిధ ప్రాంతాలను కలిపే వరంగల్ రైల్వే స్టేషన్ సరికొత్త హంగులతో ప్రారంభానికి రెడీ అయింది. కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్కీంలో భాగంగా తెలంగాణలోని పలు రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు శ్రీకారం చుట్టింది. దక్షిణమధ్య రైల్వే ఆఫీసర్లు వరంగల్, కాజీపేట జంక్షన్, మహబూబాబాద్, జనగామ రైల్వే స్టేషన్లను ఆధునీకరణకు ఎంపిక చేశారు. ఇందులో వరంగల్ స్టేషన్ పనులు చివరి దశకు చేరాయి. అత్యధునిక ఫుట్‍ఓవర్ బ్రిడ్జి, లిఫ్టులు, ఎస్కలేటర్లు మొదలు ఫ్లాట్ ఫారం కప్పులు, టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టారు. స్టేషన్ ముందు ప్రాంతం వెడల్పుగా చేయడానికితోడు కాకతీయ కళా సౌందర్యం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‍గా ప్రారంభించనున్నారు.
ఓరుగల్లులో 4 స్టేషన్లు..
అమృత్ భారత్ పథకంలో రాష్ట్రవ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్లను అత్యధునీకరిస్తున్నారు. అందులో ఓరుగల్లులో వరంగల్ స్టేషన్ కోసం రూ.25.41 కోట్లు, కాజీపేట జంక్షన్‍రూ.24.45 కోట్లు, జనగామ రూ.24.5 కోట్లు, మహబూబాబాద్ స్టేషన్ పనులకు రూ.39.72 కోట్లు కేటాయించడంతో పనులు
జెట్ స్పీడుతో సాగుతున్నాయి. ఇందులో వరంగల్ స్టేషన్ పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి
సిద్ధమైంది.
డైలీ 137 రైళ్లతో.. 31 వేల మంది జర్నీ
వరంగల్ సిటీ హెడ్‍క్వార్టర్‍గా ఉండే వరంగల్ రైల్వే స్టేషన్ దేశంలోని వివిధ ప్రాంతాలను కలిపేలా గొప్ప చరిత్ర ఉంది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వచ్చే ఈ స్టేషన్‌లో నాలుగు ప్లాట్ ఫారాలున్నాయి. ఈ స్టేషన్ రూ.41.09 కోట్ల వార్షిక ఆదాయంతోపాటు రోజుకు దాదాపు 31,887 మంది ప్రయాణీకుల రాకపోకలు సాగిస్తున్నారు. కాజీపేట, హనుమకొండ, వరంగల్ ట్రైసిటీతోపాటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్ నుంచి వచ్చే ప్రయాణీకులకు సేవలందిస్తోంది. వరంగల్ స్టేషన్‌లో దాదాపు 137 రైళ్లు ఆగుతాయి. వరంగల్ స్టేషన్ మీదుగా ప్రధానంగా న్యూఢిల్లీ, హౌరా, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్, తిరుపతి వంటి అనేక మార్గాల్లో సూపర్‌ఫాస్ట్ రైళ్లను నడుపుతున్నారు.
రూ.25.41 కోట్లతో హైఫై ఫెసిలిటీస్..
అమృత్ భారత్ స్కీంలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్‌లో అత్యధునిక పనుల కోసం రూ.25.41 కోట్ల ఫండ్స్ఇచ్చారు. విశాలమైన కాన్ కోర్స్, వెయిటింగ్ హాల్స్, ఫుడ్ స్టాల్స్, రెస్ట్ రూమ్‌లతో సహా ప్రయాణీకులకు ఆహ్లాదాన్ని పంచేలా స్టేషన్‌ను రూపొందిస్తున్నారు. స్టేషన్ భవనానికి ఆకర్షణీయమైన ఎంట్రెన్స్ నిర్మించారు. ప్రయాణీకుల సౌకర్యార్థం 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు 3 లిఫ్టులు, 4 ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. ప్లాట్‌ఫారాలను ఆధునీకరించారు. వాటిపై అదనపు కప్పులు ఏర్పాటు చేశారు. మోడల్ టాయిలెట్లతోపాటు దివ్యాంగులకు సౌకర్యాలు, వారికి కొత్త టాయిలెట్ బ్లాకుల నిర్మిస్తున్నారు. వెయిటింగ్ హాల్‌నిర్మాణం చేపట్టారు. స్టేషన్ ఆవరణలో ఆహ్లాద పరిచే ల్యాండ్‌స్కేప్, కాకతీయుల నాటి కళలు, సంస్కృతి ఉట్టిపడే చిత్రాలు ఏర్పాటు చేశారు.