ప్రైవేటు భూముల్లో పర్మిషన్లు సర్కార్ భూముల్లో తవ్వకాలు!

ప్రైవేటు భూముల్లో పర్మిషన్లు సర్కార్ భూముల్లో తవ్వకాలు!
  • అలంపూర్  నియోజకవర్గంలో జోరుగా మట్టి దందా
  • మట్టి మాఫియాకు ఆఫీసర్లు సహకరిస్తున్నట్లు ఆరోపణలు

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో అధికారుల సహకారంతో మట్టి మాఫియా దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్​ భూముల్లో మట్టి తవ్వకాలకు పర్మిషన్లు తీసుకొని, సర్కార్  భూముల్లో తవ్వకాలు చేపడుతున్నారు. గతంలో నేషనల్  హైవే పనుల కోసం మట్టి తవ్విన భూములను తక్కువ ధరకు లీజుకు తీసుకొని, వాటి పక్కనే ఉన్న సర్కార్  భూముల్లో తవ్వకాలు చేస్తున్నారు. ప్రైవేట్  వెంచర్లు, ఇండ్ల నిర్మాణాలకు, రైల్వే పనుల కోసం ప్రతి రోజు 10 టిప్పర్లతో వందల ట్రిప్పుల మట్టిని తోలుతున్నారు. 

రైల్వే పనులకు మట్టి తరలించేందుకు టెండర్  దక్కించుకున్న కాంట్రాక్టర్, ప్రైవేట్​ పొలంలో మట్టిని తరలించేందుకు పర్మిషన్లు తీసుకున్నారు. కొన్ని క్యూబిక్  మీటర్లకు అనుమతి తీసుకొని, వాటిని చూపిస్తూ సర్కారు స్థలంలో మట్టిని తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆలంపూర్​ నియోజకవర్గంలోని మానవపాడు, ఉండవెల్లి, అలంపూర్​ మండలాల్లో మట్టి దందా జోరుగా సాగుతోంది.

ప్రభుత్వ భూములే టార్గెట్..

అలంపూర్  చౌరస్తా, బొంకూరు, పోతులపాడు గ్రామాలకు చెందిన కొందరు మట్టి మాఫియాగా ఏర్పడ్డారు. మూడు గ్రూపులు ఉండగా, వారికి 10 టిప్పర్లు ఉన్నాయి. అలంపూర్  మండలం ర్యాలంపాడు గ్రామ సమీపంలోని సర్వే నంబర్ 74లో 40 ఎకరాలతో పాటు క్యాతూరు శివారులో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూముల్లో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఇప్పటికే అలంపూర్​ మండలం ర్యాలంపాడు శివారులోని ప్రభుత్వ భూమి గుంతలమయంగా మారింది. ఇక్కడ ఉన్న గుట్టలు కనిపించకుండా పోయాయి. క్యాతూరు శివారులోని ప్రభుత్వ భూమి కూడా 
ధ్వంసమైంది.

రైల్వే పని కోసమే పర్మిషన్..

పోతులపాడు, బొంకూరు మధ్య రైల్వే పని కోసం అక్కడి రైతు పొలాన్ని మట్టి కోసం కొనుగోలు చేసి, ఆ సర్వే నంబర్ పై పర్మిషన్  తీసుకొని ప్రభుత్వ భూమిలో తవ్వకాలు చేస్తున్నారు. ఇలా తవ్విన మట్టిని అలంపూర్ చౌరస్తాలోని వెంచర్లకు రాత్రి, పగలు అనే తేడా లేకుండా తరలిస్తున్నారు. ఇలా సర్కార్  భూముల్లో తవ్విన మట్టిని అమ్ముకొని, మట్టి మాఫియా కోట్లకు పడగలెత్తుతోంది. దూరాన్ని బట్టి ఒక్కో టిప్పర్ కు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు. మట్టి మాఫియాకు మైనింగ్, పోలీస్  ఆఫీసర్లతో పాటు పొలిటికల్  లీడర్ల సపోర్ట్​ ఉండడంతో ఈ దందా యథేచ్చగా కొనసాగుతుందనే ఆరోపణలున్నాయి. పోలీస్, మైనింగ్​ ఆఫీసర్లతో పాటు పొలిటికల్  లీడర్లకు ప్రతి నెలా మామూళ్లు ఇస్తున్నామని మట్టి మాఫియా బహిరంగంగా చెబుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

గుంతలతో ప్రమాదాలు..

అక్రమంగా మట్టి తరలించడంతో ఏర్పడిన గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మానవపాడు మండలం పెద్ద పోతలపాడు గ్రామ సమీపంలో తవ్విన మట్టి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు చనిపోయిన ఘటన చోటు చేసుకుంది. పశువులు నీళ్లు తాగేందుకు వెళ్లి కాళ్లు విరిగిన సందర్భాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.

గతంలో పర్మిషన్​ ఇచ్చాం..

గతంలో రైల్వే పనుల కోసం మట్టి తవ్వకాలకు పర్మిషన్ ఇచ్చాం. ఇటీవల ఎవరికీ పర్మిషన్లు ఇవ్వలేదు. ప్రభుత్వ భూముల్లో తవ్వకాలపై అక్కడి తహసీల్దార్, పోలీసులకు సమాచారం ఇస్తే కేసులు నమోదు చేస్తాం. అక్రమ మట్టి దందాను ఆపేందుకు రెవెన్యూ, పోలీస్​ శాఖకు సహకరించాలి.

రమణ, మైనింగ్  ఏడీ, గద్వాల