రైతు ముంగిట్లోకి సైంటిస్టులు .. ఇయ్యాల్టి నుంచి రైతు వేదికల్లో అవగాహన సదస్సులు

రైతు ముంగిట్లోకి సైంటిస్టులు .. ఇయ్యాల్టి నుంచి రైతు వేదికల్లో అవగాహన సదస్సులు
  • పంటల సాగులో మెలకువలు, జాగ్రత్తలపై అవేర్నెస్
  • జూన్​ 13 వరకు సాగనున్న కార్యక్రమాలు
  • సద్వినియోగం చేసుకోవాలన్న డీఏవో జి.కల్పన 

మంచిర్యాల, వెలుగు: వానాకాలం సాగుకు రైతులను సన్నద్ధం చేసేందుకు వ్యవసాయ శాఖ ‘రైతు ముంగిట్లోకి సైంటిస్టులు’ ప్రోగ్రాంను చేపట్టిందని జిల్లా అగ్రికల్చర్​ ఆఫీసర్​జి.కల్పన అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 5 నుంచి జూన్​ 13 వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో జీపీ ఆఫీసులు, గవర్నమెంట్​ స్కూళ్లు, రైతు వేదికల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నామని తెలిపారు. పంటల సాగులో పాటించాల్సిన మెలకువలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బెల్లంపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్టులు రైతులకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. 

ఇందుకోసం రెండు టీమ్​లను ఏర్పాటు చేశామన్నారు. నకిలీ విత్తనాల నివారణ, ఎరువులు, పురుగు మందుల వాడకం, ఆధునిక పద్ధతుల్లో అధిక దిగుబడుల సాధనపై వివరిస్తారని పేర్కొన్నారు. ప్రతి రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు రైతు వేదికల్లో సదస్సులు జరుగుతాయన్నారు. 

సదస్సుల వివరాలు 

టీమ్​1 : డాక్టర్​ శివకృష్ణ కోట (ప్రోగ్రాం కో ఆర్డినేటర్), సైంటిస్టులు జి.ప్రియా సుగంధి, ఐ.తిరుపతి టీం ఈ నెల 5న పాత బెల్లంపల్లిలోని గవర్నమెంట్​హైస్కూల్, 16న హాజీపూర్​ మండలం ర్యాలీ గ్రామపంచాయతీ, 20న కాసిపేట మండలం ముత్యంపల్లి రైతు వేదిక, 27న మందమర్రి మండలం సారంగపల్లి గ్రామ పంచాయతీ, జూన్​4న తాండూర్​మండలం గంపలపల్లి గవర్నమెంట్​ స్కూల్, 13న భీమారం మండలం పోతనపల్లి రచ్చబండ వద్ద రైతు అవగాహన సదస్సులు జరుగుతాయని తెలిపారు. 

టీమ్​2 : డాక్టర్​ శివకృష్ణ(ప్రోగ్రాం కోఆర్డినేటర్​), సైంటిస్టులు యు.స్రవంతి, ఎ.నాగరాజు టీమ్ ఈ నెల 8న నెన్నెల మండలం ఖర్జి గ్రామ పంచాయతీ, 14న హాజీపూర్​ మండలం టీకనపల్లి గ్రామ పంచాయతీ, 23న కాసిపేట మండలం మల్కపల్లి గ్రామ పంచాయతీ, 29న మందమర్రి మండలం పులిమడుగు గవర్నమెంట్​ స్కూల్, జూన్​6న తాండూర్ మండలం ద్వారక గ్రామ పంచాయతీ, 11న భీమిని రైతు వేదికలో సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు. 

రైతులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి 

జిల్లాలో సోమవారం నుంచి ఫార్మర్​ రిజిస్ట్రీ ప్రాజెక్టు ప్రారంభం కానుందని డీఏవో కల్పన తెలిపారు. ప్రతి రైతుకు ఆధార్​ మాదిరిగా 11 నంబర్లతో విశిష్ట సంఖ్యను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్​చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు చెప్పారు. రైతులు తమకు ఉన్న భూముల వివరాలతో ఫార్మర్​ రిజిస్ట్రీ చేయించుకోవాలని సూచించారు. ఆధార్, పట్టాదారు పాస్​బుక్​కు లింక్​ చేసిన మొబైల్ ​నంబర్​ వివరాలను లోకల్​ఏఈవోలకు అందజేయాలన్నారు.