కృష్ణా జలాల్లో ఎక్కువ వాటా కోసం కొట్లాడుతాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కృష్ణా జలాల్లో ఎక్కువ వాటా కోసం కొట్లాడుతాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

 

  • వాటా కేటాయంపులో గత ప్రభుత్వం ఏపీకి అనుకూలంగా వ్యవహరించింది
  • ప్రాజెక్టుల్లో నీటి సామర్థ్యం పెంచేందుకు పూడికతీత ప్రారంభించాం
  • రాష్ట్రంలో చేసిన కులగణన దేశానికి రోల్‌‌ మోడల్‌‌
  • మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌ రెడ్డి

కోదాడ/మిర్యాలగూడ, వెలుగు : కృష్ణా జలాల్లో అధిక వాటా తెలంగాణకు దక్కేలా కొట్లాడుతామని మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి చెప్పారు. బచావత్‌‌ ట్రిబ్యునల్‌‌ కృష్ణా జలాల్లో 811 టీఎంసీలను కేటాయిస్తే ఇందులో 593 టీఎంసీలు ఏపీ వాడుకునేందుకు బీఆర్ఎస్‌‌ ఒప్పుకుందని ఆరోపించారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని ఇరిగేషన్‌‌ శాఖలో చేపడుతున్న పనుల పురోగతి, ధాన్యం సేకరణపై ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లతో కలిసి ఆదివారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం  కాళేశ్వరం పేరిట డిండి, ఎస్ఎల్‌‌బీసీ వంటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందన్నారు. రూ. 94 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం అవినీతి, అక్రమాలు, క్వాలిటీ లేని పనుల కారణంగా రైతులకు ఉపయోగపడకుండా పోయిందన్నారు. గత పదేండ్లలో నాగార్జునసాగర్‌‌ను సైతం నిర్లక్ష్యం చేయడంతో సిల్ట్‌‌ పేరుకుపోయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మేజర్ ప్రాజెక్టుల్లో పూడికతీత పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ప్రకటించారు. మున్నేరు నుంచి పాలేరు రిజర్వాయర్‌‌ వరకు వరద కాల్వ ద్వారా 10 టీఎంసీల నీటిని తరలించనున్నామని, పాలేరు వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతె మండలానికి నీరు అందిస్తామని చెప్పారు. 

రెడ్లకుంట గ్రామంలో చెక్‌‌డ్యామ్‌‌ నిర్మాణ పనులు స్లోగా జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో నిపుణుల కమిటీ వేసి ఎస్ఎల్‌‌బీసీని పూర్తి చేస్తామన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌‌ పెద్ద పీట వేసిందని, ఇందులో భాగంగా కులగణన నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి రోల్‌‌ మోడల్‌‌గా నిలిచిందన్నారు. శాసనమండలి చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్‌‌రెడ్డి మాట్లాడుతూ పెండింగ్‌‌లో ఉన్న ఇరిగేషన్‌‌ ప్రాజెక్ట్ పనులు, ఎస్ఎల్‌‌బీసీ నిర్మాణ పనులపై మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి ఫోకస్‌‌ చేయాలని కోరారు. ఖమ్మం మీదుగా తెలంగాణ ప్రాంతానికి సన్నొడ్లు తరలించి బోనస్‌‌ను కాజేస్తున్న విషయాన్ని ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.  అక్రమ ధాన్యం తరలింపును కట్టడి చేయాలని కోరారు.

పేదల కడుపు నింపడమే లక్ష్యం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

పేదల కడుపు నింపాలన్న లక్ష్యంతోనే సన్న బియ్యం పంపిణీని చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించి, పనులను స్పీడ్‌‌గా చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌‌ను.. రాష్ట్రానికి మొదటి శత్రువు అని చెప్పడం సరికాదన్నారు.