
- అమెరికా పర్యటనలో సిక్కు స్టూడెంట్ ప్రశ్నకు రాహుల్ గాంధీ ఆన్సర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కొన్ని తప్పులు జరిగాయని ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అంగీకరించారు. అయితే, ఆ సమయంలో తాను పార్టీలో లేనని గుర్తుచేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన తప్పులకు తాను బాధ్యత వహిస్తానని స్పష్టం చేశారు. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను ఉద్దేశిస్తూ.. 80వ దశకంలో జరిగింది తప్పేనని తాను బహిరంగంగా చెప్పానని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. ఇటీవల రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటించారు. ఈ సమయంలో బ్రౌన్ యూనివర్సిటీ విద్యార్థులతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు.
ఈ సంద్భంగా ఓ సిక్కు స్టూడెంట్ రాహుల్ గాంధీకి పలు ప్రశ్నలు సంధించారు. ‘‘బీజేపీ పాలనలో తలపాగా, కంకణం ధరించడానికీ భయపడే పరిస్థితి నెలకొంటుందని సిక్కులలో మీరు భయాన్ని కల్పిస్తున్నారు. అయితే, మేం కేవలం కంకణం, తలపాగాలతో పాటు భావప్రకటన స్వేచ్ఛను కూడా కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ పాలనలో మాకది దక్కలేదు. ఆనంద్‌పూర్ సాహిబ్ తీర్మానాన్ని వేర్పాటువాదపత్రంగా కాంగ్రెస్ ముద్రవేసింది.
1984 అల్లర్ల కేసులో దోషిగా తేలిన సజ్జన్ కుమార్‌లాంటివారు ఇప్పటికీ మీ పార్టీలోనే ఉన్నారు. ఈ తప్పులను ఒప్పుకునే పరిణతి కూడా కాంగ్రెస్కు లేదు. సిక్కులతో సయోధ్యకు మీరేం చేశారు? అని నిలదీశారు. రాహుల్ మాట్లాడుతూ.. సిక్కులను భయపెట్టేది ఏదీ లేదన్నారు. తాను చాలాసార్లు స్వర్ణ దేవాలయానికి వెళ్లానని, భారతదేశంలోని సిక్కులతో తనకు సత్సంబంధాలున్నాయని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ రామ్ ద్రోహి: బీజేపీ
అమెరికా పర్యటనలో రాముడిపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. భారతదేశంలోని గొప్ప సామాజిక సంస్కర్తలు, రాజకీయ ఆలోచనాపరులు ఎవరూ మతతత్వవాదులు కాదని రాహుల్ అన్నారు. అలాగే, పౌరాణిక గాథల్లోని రాముడిలాంటి వ్యక్తులు కూడా ఆ కోవకు చెందినవారేనని, ఆయన కరుణామయుడు, క్షమించే గుణం కలవారని చెప్పారు.
బీజేపీ చెప్పేది హిందూ ఆలోచన కానేకాదని, హిందుత్వం అంటే ప్రేమ, ఓర్పు, సహనం, క్షమించే గుణం అని వ్యాఖ్యానిం చారు. అయితే, రాముడిని పౌరాణిక గాథల్లోని కల్పిత పాత్రగా రాహుల్ గాంధీ చిత్రీకరించారంటూ బీజేపీ మండిపడింది. రాహుల్ గాంధీ ‘రామ్ ద్రోహి’ అంటూ బీజేపీ నేత షెహజాద్ పూనావాలా కామెంట్ చేశారు. హిందువులను అవమానించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు.