
- పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఎండిపోయిన నది
న్యూఢిల్లీ: ఉగ్రమూకలను ఎగదోస్తూ, కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్‌కు భారత్ మరో షాక్ ఇచ్చింది. జమ్మూలోని రాంబన్ జిల్లాలో చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ డ్యాం గేట్లను పూర్తిగా దించేసింది. దీంతో దిగువన పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో చినాబ్ నది పూర్తిగా ఎండిపోయింది. పోయిన నెల 22న పహల్గాం వద్ద టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత పాక్ కు గట్టిగా గుణపాఠం చెప్పాలని భావించిన కేంద్ర ప్రభుత్వం దౌత్య సంబంధాలను కట్ చేసుకోవడంతోపాటు సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నది.
గత నెల 29వ తేదీ నుంచే బాగ్లిహార్ హైడ్రోఎలక్ట్రిక్ డ్యాం గేట్లను దించేసి, నీళ్లు కిందకు వెళ్లకుండా నిలిపేసింది. అలాగే జీలమ్ నదిపై ఉన్న కిషన్ గంగ హైడ్రోఎలక్ట్రిక్ డ్యాం నుంచి కూడా నీళ్లు కిందకు వెళ్లకుండా ఆపేయనున్నట్టు అధికారిక వర్గాలు చెప్తున్నాయి. పాక్ కు నీటిని ఆపేయడం ద్వారా అవసరమైతే భారత్ కఠిన చర్యలకు వెనకాడబోదన్న సందేశం ఇచ్చినట్టు అయిందని అంటున్నారు. బాగ్లిహార్ డ్యాంను 2008లో 900 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించారు. ఇది దాదాపు 145 మీటర్ల పొడవు ఉంది.
సింధూ జలాల ఒప్పందం కింద పాకిస్తాన్ కు అత్యధిక నీళ్ల వాటా లభించిన నదుల్లో చినాబ్ కూడా ఒకటి. ప్రధానంగా పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో పత్తి, వరి, ఇతర పంటల సాగుకు ఈ నది నీళ్లే అవసరం. ఇప్పుడు భారత్ నీటిని ఆపేయడంతో పాక్ లోని సియాల్ కోట్ కు వచ్చేసరికి చినాబ్ నది పూర్తిగా ఎండిపోయినట్టుగా శాటిలైట్ ఫొటోలను బట్టి తెలుస్తోంది. మరోవైపు భారత్ గత వారం జీలమ్ నది నీటిని వదిలిపెట్టడంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ముజఫరాబాద్ వద్ద నదీ ప్రవాహం అనూహ్యంగా పెరిగి వరదల్లాంటి పరిస్థితి కనిపించింది.