బహుజన రాజ్యంతో భవిష్యత్తు మార్పు

బహుజన రాజ్యంతో భవిష్యత్తు మార్పు

కరీంనగర్ కు తాను వచ్చింది అబద్ధం ప్రచారాలు చేయడానికి కాదన్నారు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ . కరీంనగర్ జిల్లా కార్పోరేషన్ పరిధిలోని అలుగునూరులో జరిగిన బహుజన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా మాట్లాడారు. ఈ సమావేశం ద్వారా యావత్ తెలంగాణకు గుండె చప్పుడు వినిపించడానికి వచ్చామన్నారు. మా సమావేశానికి వచ్చే ఐదుగురిని  కొందరిని అరెస్టు చేసారని తెలిపారు. మీ సత్తా ఏంటో ఆగస్టు 8న చూపించండి.. గల్లీ గల్లీన సెలబ్రేట్ చేసుకోండి అంటూ సదస్సుకు వచ్చిన వారికి సూచించారు.

అంతేకాదు.. సదస్సుకు హాజరైన తాము చట్టాన్ని అతిక్రమించామా? కల్లోలం సృష్టించామా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేమేమైనా అక్రమంగా ప్రాజెక్టుల్లో డబ్బులు సంపాదించామా? అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఫామ్ హౌస్ లు కట్టుకున్నామా? ఆ డబ్బులతో మేమేమన్నా ఓట్లు కొనుక్కుంటున్నామా? అని అన్నారు. మా గోస చెప్పుకునేందుకే మేమంతా ఇక్కడ సమావేశమయ్యామన్నారు. ఇంతకాలం మా బాధలు వినేవాళ్లు, కన్నీళ్లు తుడిచే నాథుడు ఎవరు లేరన్నారు.అందుకే బహుజన రాజ్యం తెచ్చుకోవడానికి వచ్చామన్నారు. 

తాను రిటైర్డ్ మెంట్ అయిన రోజునే ఎక్కడైతే ఎస్పీగా పనిచేశానో..అదే కరీంనగర్ లో నాపై కేసు పెట్టారని తెలిపారు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్. మాకు పత్రికలు, టీవీలు లేకపోవచ్చు..అసత్యాలను, సత్యాలుగా ప్రచారం చేసే వ్యవస్థ లేకపోవచ్చు..కానీ ఒక్కొక్కరు అగ్నికణమవుతారన్నారు. మూడు కోట్ల మంది ప్రవీణ్ కుమార్ లు వస్తారని స్పష్టం చేశారు.

మా బతుకులు బాగు పరుచుకోవాలన్నదే మా లక్ష్యమన్న ప్రవీణ్ కుమార్.. ఎస్పీగా ఉన్నప్పుడు ఇక్కడి ప్రజలు ఎంతో పేదరికంలో ఉన్నారో.. ఇప్పుడు అదే పేదరికంలో ఉన్నారని  అన్నారు. 50 ఏళ్ల మీ మేనిఫెస్టోలు ఎక్కడ పోయాయి. పేదల బతుకుల్లో ఎందుకు మార్పురాలేదని సదస్సు ద్వారా ప్రశ్నించారు. మా కష్టార్జితంగా కట్టిన పన్నులు ఏమయ్యాయి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందుకే ఆరేళ్ల నా సర్వీసును తృణ ప్రాయంగా వదిలేసి మీ కోసం వచ్చానన్నారు. మీలాగా ఆస్తుల కోసం, పదవుల కోసం కొట్లాడలేదు.. మా బిడ్డల కోసం జీవితాంతం పనిచేసాని చెప్పారు. చట్టబద్ధంగా, శాంతియుతంగా బహుజన రాజ్యం కోసం పోరాడుతామన్నారు. ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు తమ ఉద్యోగాలు పోయాయని ఏడుస్తున్నారు.. వీళ్లంతా బహుజనులేనన్నారు. ఓవైపు కేసీఆర్ దళిత సాధికారత అంటున్నారు. మీరు వీళ్ల ఉద్యోగాలు పోయాక సాధికారిత ఎక్కడుందన్నారు. బహుజన రాజ్యం వస్తేనే మా కన్నీళ్లు ఆగుతాయి.. ఆ రాజ్యం మేమే సృష్టించుకుంటామన్నారు. ఎమ్మెల్యే కావాలనో, ఎంపీ కావాలనో, ముఖ్యమంత్రి కావాలనో, ప్రగతిభవన్ లో కూర్చోవాలని రాలేదన్న ప్రవీణ్ కుమార్.. బహుజన రాజ్యం మన బిడ్డల భవిష్యత్తు మార్చాలని వచ్చానన్నారు.