సకల సౌలత్ లతోఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఆఫీస్ : డీజీపీ శివధర్ రెడ్డి

సకల సౌలత్ లతోఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఆఫీస్ : డీజీపీ శివధర్ రెడ్డి
  •  త్వరలోనే తుక్కుగూడ నుంచి పూర్తి స్థాయి సేవలు
  • నిర్మాణ పనులను పరిశీలించిన డీజీపీ శివధర్ రెడ్డి

ఇబ్రహీంపట్నం, వెలుగు: ప్రజలకు సేవలు సులభంగా అందేలా, పోలీస్ సిబ్బంది సౌకర్యవంతంగా పని చేసేలా సకల సౌలత్​లతో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కార్యాలయం ఉండాలని డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఫ్యాబ్ సిటీలో నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కార్యాలయ పనులతో పాటు, కందుకూరు మండలం మీర్ ఖాన్​​పేట్​లో ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని ఫ్యూచర్ సిటీ సీపీ జి. సుధీర్ బాబుతో కలిసి ఆయన పరిశీలించారు.

భవన నిర్మాణ పనుల పురోగతిని, సివిల్, విద్యుత్, తాగునీరు, డ్రైనేజ్ సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని ఇంజినీర్లకు సూచించారు. అనంతరం మీర్ ఖాన్​పేట్ స్థలంలో శాశ్వత భవనాల మాస్టర్ ప్లాన్​పై అధికారులతో చర్చించిన ఆయన..  త్వరలోనే తుక్కుగూడ నుంచి పూర్తిస్థాయి పోలీస్ సేవలు అందుబాటులోకి వస్తాయని, తద్వారా ప్రజలకు మరింత వేగంగా, మెరుగైన సేవలు అందుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం డీసీపీ కె. నారాయణ రెడ్డి, ఏసీపీలు రాజు, అరుణ్ కుమార్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.