
ఒకపక్క రోజురోజుకీ భూమి టెంపరేచర్లు పెరుగుతుంటే.. మరోపక్క భూమిపై పెట్రోల్, డీజిల్ లాంటి ఆయిల్ రిసోర్సులు తగ్గిపోతున్నాయి. మరి ఈ సమస్యకు చెక్ పెట్టేదెలా? అనే ప్రశ్న తలెత్తినప్పుడు అందరూ చూసింది గ్రీన్ హైడ్రోజన్ వైపే. చాలాదేశాలు పెట్రోల్, డీజిల్‌కు ఆల్టర్నేట్గా వాడేందుకు ఇప్పటికే గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయెల్‌ను డెవలప్ చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే దీనికయ్యే ఖర్చు ఎక్కువే. పైగా భవిష్యత్తులో దీని ఉత్పత్తి ఖర్చు తగ్గితే.. అప్పుడు దీని ధర కూడా తగ్గుతుంది. అందుకే చాలా దేశాలతో పాటు ఇండియా కూడా గ్రీన్ హైడ్రోజన్ వైపు అడుగులేస్తోంది. ఇప్పటికే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మొదలైంది. రాబోయే రోజుల్లో హైడ్రోజన్ హబ్‌గా ఎదిగే దిశగా ఇండియా చర్యలు తీసుకుంటోంది. అసలు ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి? ఇది కాలుష్యం విడుదల చేయకుండా ఎలా పని చేస్తుంది? దీనిని ఎలా ఉత్పత్తి చేస్తారు? ఫ్యూచర్లో ఇది పెట్రోల్‌ను రీప్లేస్ చేస్తుందా? దీనితో ఉన్న లాభాలేంటి? సవాళ్లు ఏంటి? చూద్దాం.
కాలం కాని కాలంలో ఎండలు మండిపోయినా.. వానలు దంచికొట్టినా.. చలి గజగజ వణికించినా.. అందరి నోటా వినిపించే మాట గ్లోబల్ వార్మింగ్. అవసరం లేనప్పుడు కుండపోత వర్షాలు పడినా.. వరదలు పోటెత్తి పంటలను ముంచేసినా.. వానాకాలంలో సైతం రోజుల తరబడి వర్షాలు పడకుండా పంటలను ఎండబెట్టినా.. అందరి నోటా వినిపించే మాట క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్‌కు గ్లోబల్ వార్మింగ్ కారణమైతే.. ఆ గ్లోబల్ వార్మింగ్‌కు కార్బన్ డై ఆక్సైడ్ లాంటి గ్రీన్ హౌజ్ వాయువులు వాతావరణంలో పేరుకుపోవడమే కారణం. అయితే, ఇప్పుడీ సమస్యలకు గ్రీన్ హైడ్రోజన్ అత్యుత్తమ పరిష్కారం అంటున్నారు సైంటిస్టులు. జీరో పొల్యూషన్‌తో భూగోళానికి ఊరటనిచ్చే గ్రీన్ హైడ్రోజనే ‘ఫ్యూయెల్ ఆఫ్ ది ఫ్యూచర్’ అని స్పష్టం చేస్తున్నారు. భూగోళాన్ని వేడెక్కించే గ్రీన్ హౌజ్ వాయువులు వాతావరణంలోకి విడుదలయ్యేందుకు మనిషే కారణం. ప్రధానంగా పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల(ఫాజిల్ ఫ్యుయెల్స్) వాడకంతోనే పెద్ద ఎత్తున గ్రీన్ హౌజ్ వాయువులు రిలీజ్ అవుతున్నాయి. అందుకే.. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి.. గ్రీన్ హౌజ్ వాయువులను వాతావరణంలో పెరగకుండా సోలార్ పవర్, విండ్ పవర్ వంటి గ్రీన్ ఎనర్జీ దిశగా అన్ని దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, శిలాజ ఇంధనాలకు సోలార్, విండ్ పవర్ల కంటే గ్రీన్ హైడ్రోజనే అత్యుత్తమ ప్రత్యామ్నాయం కానుంది.
భూమిపై 75% పదార్థంలో హైడ్రోజన్
హైడ్రోజన్ విస్తారంగా దొరికే రసాయన మూలకం. గాలిలో చాలా తక్కువ శాతంలోనే ఉంటుంది. కానీ భూమిపై మాత్రం దాదాపు 75% హైడ్రోజన్ ఉంటుంది. కానీ, ఇది ఆక్సిజన్, కార్బన్ వంటి మూలకాలతో కలిసి ఉంటుంది. ఆక్సిజన్‌తో కలిస్తే నీటి అణువులుగా మారుతుంది. కార్బన్‌తో కలిస్తే సేంద్రియ పదార్థంగా మారుతుంది. ఇలా ఇతర మూలకాలతో కలిసిపోతూ ఉండటం వల్ల దీనిని నేరుగా సేకరించడం సాధ్యం కాదు. హైడ్రోజన్‌ను ఎప్పటి నుంచో కెమికల్, స్టీల్ ఇండస్ట్రీల్లో ముడి పదార్థంగా, ఇంధనంగా వాడుతున్నారు. అయితే, దీన్ని నేరుగా ప్రకృతి నుంచి తీసుకోలేం. కాబట్టి కృత్రిమంగా తయారు చేసుకోవడం తప్పనిసరి అవుతోంది. నిజానికి హైడ్రోజన్ అద్భుతమైన ఇంధన వనరు. దీన్ని ఫ్యుయెల్గా వాడితే ఎలాంటి గ్రీన్ హౌజ్ వాయువులు ఉత్పత్తి కావు. కానీ, హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసేందుకు వాడుతున్న పద్ధతిని బట్టే.. అది కాలుష్య రహితమా? (క్లీన్), తరిగిపోని వనరా? (సస్టయినబుల్) కాదా? అన్నది ఆధారపడి ఉంటుంది. అంటే.. హైడ్రోజన్‌ను వాడటం వల్ల కార్బన్ ఎమిషన్స్ ఏమాత్రం ఉండవు. కానీ దాన్ని తయారు చేసే ప్రాసెస్‌లో కార్బన్ ఎమిషన్స్ ఉంటే గనక.. ఆ హైడ్రోజన్‌ను ఉపయోగించడం వల్ల పెద్దగా లాభం ఉండదు.
హైడ్రోజన్ ఉత్పత్తి ఇలా..
హైడ్రోజన్ అనేది రెనెవబుల్ (పునరుత్పాదక) ఇంధనం. కానీ, ఇది అన్ని వేళలా నిజం కాదు. హైడ్రోజన్‌ను తయారు చేసే ప్రాసెస్ కూడా రెనెవబుల్ అయితేనే.. ఆ హైడ్రోజన్ కూడా రెనెవబుల్ అవుతుంది. ప్రస్తుతం హైడ్రోజన్ ఉత్పత్తిలో ప్రధానంగా మూడు పద్ధతులు ఉన్నాయి.
నేచురల్ గ్యాస్ నుంచి
ఇందులో ఒక వరుస క్రమంలో కెమికల్ రియాక్షన్లు జరపడం ద్వారా హైడ్రోజన్‌ను సేకరిస్తారు. ఇందుకోసం నేచురల్ గ్యాస్ రిఫార్మింగ్ టెక్నిక్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాడుతున్నారు. ఆయిల్ ఫీల్డ్స్‌లో హై టెంపరేచర్‌తో కూడిన నీటి ఆవిరిని ఉపయోగించి నేచురల్ గ్యాస్ (హైడ్రోకార్బన్) నుంచి హైడ్రోజన్‌ను, కార్బన్‌ను వేరు చేస్తారు. రెండు వరుస రియాక్షన్ల తర్వాత డై హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడతాయి. ప్రస్తుతం ఈ పద్ధతినే ఎక్కువగా వాడుతున్నారు.
బొగ్గు లేదా బయోమాస్ నుంచి
ఇందులో బొగ్గు లేదా బయోమాస్ (మొక్కల నుంచి వచ్చే ఆర్గానిక్ మెటీరియల్)ను వాడతారు. ఇందుకోసం నీటి ఆవిరి, ప్యూర్ ఆక్సిజన్‌తో గ్యాసిఫికేషన్ చేస్తారు. ముందుగా రియాక్టర్లో బొగ్గు లేదా బయోమాస్‌ను అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద మండిస్తారు. ఈ ప్రాసెస్‌లో డై హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్ వంటి గ్యాసెస్ విడుదల అవుతాయి.
నీటి నుంచి
నీటి అణువులో రెండు హైడ్రోజన్, ఒక ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి. ఇలా నీటి అణువుల్లోని హైడ్రోజన్‌ను, ఆక్సిజన్‌ను వేర్వేరుగా విడగొట్టడమే ఎలక్ర్టొలసిస్. ఇందులో నీటికి ఎలక్ట్రోడ్ల ద్వారా డైరెక్ట్‌గా కరెంట్‌ను పంపుతారు. దీంతో నీటిలోని హైడ్రోజన్, ఆక్సిజన్ వేర్వేరుగా విడిపోతాయి. అయితే, ఈ ఎలక్ట్రోలైసిస్కు వాడే కరెంట్ కూడా పునరుత్పాదక విధానంలో ఉత్పత్తి అయితే, ఇది పునరుత్పాదక హైడ్రోజన్ అవుతుంది.
ఉత్పత్తిని బట్టి మూడు రకాలు
హైడ్రోజన్ ఉత్పత్తి చేసే విధానాన్ని బట్టి ఒక్కో విధానాన్ని ఒక్కో కలర్‌తో సూచిస్తారు. ఉత్పత్తి అయిన హైడ్రోజన్.. క్లీన్, సస్టయినబులా? కాదా? అంటే.. కాలుష్య రహితంగా, తరిగిపోని వనరులతో ఉత్పత్తి అయిందా? కాదా? అన్నదానిని ఈ రంగులు సూచిస్తాయి. హైడ్రోజన్ ఉత్పత్తి మూడు పద్ధతులను బట్టి గ్రే, బ్లూ, గ్రీన్ హైడ్రోజన్‌గా పిలుస్తున్నారు.
గ్రే హైడ్రోజన్
పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల(హైడ్రో కార్బన్స్)లోని అణువుల స్ట్రక్చర్‌ను మార్చడం ద్వారా ఉత్పత్తి చేసేది గ్రే హైడ్రోజన్. ప్రస్తుతం ఉన్న పద్ధతుల్లో ఇదే అత్యంత చవకైనది. ఇప్పుడు గ్రే హైడ్రోజన్‌నే అత్యధికంగా వాడుతున్నారు. కానీ, ఈ ప్రాసెస్‌లో కార్బన్ డయాక్సైడ్ పెద్ద మొత్తంలో వాతావరణంలోకి విడుదలవుతుంది. కాబట్టి ఇది పర్యావరణానికి ఏమాత్రం మంచిదికాదు.
బ్లూ హైడ్రోజన్
దీన్ని కూడా శిలాజ ఇంధనాలను ఉపయోగించే తయారు చేస్తారు. కానీ ఇందులో విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ను కొంతవరకు క్యాప్చర్ చేసి, స్టోర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అందుకే గ్రే హైడ్రోజన్ కంటే ఇది కొంచెం తక్కువ కాలుష్య కారకమైన పద్ధతి. అయితే, ఉత్పత్తి విధానంలో కార్బన్ ఎమిషన్స్‌ను కొంచెం తగ్గించడం తప్ప.. ఇందులో పూర్తిగా కాలుష్య కారకాలను నిర్మూలించడం మాత్రం సాధ్యం కాదు.
గ్రీన్ హైడ్రోజన్
ఎలాంటి కాలుష్య కారకాలు విడుదల కాకుండా తయారు చేసేదే గ్రీన్ హైడ్రోజన్. నీటిని ఎలక్ర్టొలసిస్ చేయడం ద్వారా దీన్ని ఉత్పత్తి చేస్తారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పద్ధతిలో హైడ్రోజన్ ఉత్పత్తికి చేపట్టే ఎలక్ర్టొలసిస్ప్రక్రియకు కూడా పునరుత్పాదక శక్తినే వాడతారు. అంటే సోలార్ లేదా విండ్ పవర్‌ను ఉపయోగించి నీటిని ఎలక్ర్టొలసిస్ చేస్తారు. అందువల్ల ఈ విధానంలో ఎక్కడా కాలుష్యం అన్న మాటే ఉండదు. అటు హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడం, ఇటు దాన్ని ఇంధనంగా వాడడంలోనూ ఎలాంటి కార్బన్ ఎమిషన్స్ విడుదలకావు. అందుకే.. హైడ్రోజన్ ఉత్పత్తిలో ఇదే అత్యంత ఉత్తమమైన పద్ధతి.
గ్రే హైడ్రోజన్ తో సమస్యేంటీ?
ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) డేటా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 మిలియన్ టన్నుల హైడ్రోజన్‌ను వాడుతున్నారు. అయితే, ఇందులో మొత్తం హైడ్రోజన్‌ను బొగ్గు నుంచి లేదా నేచురల్ గ్యాస్ నుంచి ఉత్పత్తి చేయడమే అసలు సమస్య. ఇవి అత్యంత కాలుష్యపూరితమైన పద్ధతులు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న మొత్తం హైడ్రోజన్‌లో రెనెవబుల్ ఎనర్జీతో వాటర్ ఎలక్ర్టొలసిస్ ద్వారా తయారయ్యేది ఒక శాతం కన్నా తక్కువే. మనం వాడుతున్న హైడ్రోజన్‌లో గ్రీన్ హైడ్రోజన్ వాటా కేవలం 0.1 శాతం మాత్రమే. అలాగే గ్రే హైడ్రోజన్ ఉత్పత్తి వల్ల ఏటా 830 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతోంది. ఇది ఇండోనేసియా, యూకే కలిపి ఒక ఏడాదిలో విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్తో సమానం. మరో రకంగా చూస్తే.. దాదాపు 300 మిలియన్ల జనం ఉన్న రెండు దేశాలు ఉత్పత్తి చేసే పొల్యూషన్‌కు ఇది సమానం. ఈ వివరాలను బట్టి.. హైడ్రోజన్ ఉత్పత్తి విధానం ఎంత కీలకమైందో అర్థం చేసుకోవచ్చు.
గ్రీన్ హైడ్రోజన్ ఎలా పని చేస్తుంది?
హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడుకోవాలంటే ఉత్పత్తి చేసిన వెంటనే ప్రత్యేక ట్యాంకుల్లో స్టోర్ చేయాలి. ఆ తర్వాత ట్యాంకుల నుంచి ఫ్యూయెల్ సెల్స్‌లోకి నింపాలి. ఆ తర్వాత ఫ్యుయెల్ సెల్స్‌లో హైడ్రోజన్ మళ్లీ గాలిలోని ఆక్సిజన్‌తో కలిసిపోతుంది. ఈ ప్రాసెస్‌లో పవర్ జనరేట్ అవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్‌లో కేవలం నీళ్లు మాత్రమే బై ప్రొడక్ట్‌గా వస్తాయి. ఇందులో కార్బన్ డై ఆక్సైడ్ ఎమిషన్స్ జీరో. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో సైతం ఎలాంటి కార్బన్ ఉద్గారాలు ఉండవు. కాబట్టి అటు ఉత్పత్తిలోనూ, ఇటు వాడకంలోనూ దీని వల్ల పర్యావరణానికి ఏమాత్రం నష్టం జరగదు.
ఇండస్ట్రీలకు తరుణోపాయం
కెమికల్ ఇండస్ట్రీలో అమ్మోనియా, ఫర్టిలైజర్స్ తయారీకి హైడ్రోజన్‌ను ముడి పదార్థంగా వాడతారు. పెట్రో కెమికల్ ఇండస్ట్రీలో పెట్రోలియం శుద్ధి కోసం వాడతారు. మెటలర్జీలో స్టీల్ తయారీ కోసం ఉపయోగిస్తారు. ఈ మూడు ఇండస్ట్రీల్లో పెద్ద ఎత్తున కార్బన్ డై ఆక్సైడ్ ఎమిషన్స్ విడుదలవుతాయి. ఉదాహరణకు, ప్రపంచ సీఓటూ ఎమిషన్స్‌లో 6 నుంచి 7 శాతం ఉక్కు తయారీ కారణంగానే విడుదలవుతున్నాయి. ప్రపంచంలోని అన్ని విమానాల రాకపోకల వల్ల ఉత్పత్తి అయ్యే సీఓటూ ఎమిషన్స్ కంటే కూడా ఇవి రెండు మూడు రెట్లు ఎక్కువ. అందుకే గ్రీన్ హైడ్రోజన్‌ను ముడి పదార్థంగా వాడుకుని ఎమిషన్స్ లేకుండా స్టీల్ ఉత్పత్తి చేయొచ్చు. ఈ మూడు ఇండస్ట్రీల్లో కార్బన్ ఉద్గారాలను తగ్గించాలంటే గ్రీన్ హైడ్రోజన్ వాడకం పెరగాలి.
ఇవీ లాభాలు
- పెట్రోల్, డీజిల్, గ్యాస్ మాదిరిగానే.. హైడ్రోజన్‌ను కూడా ఎక్కువ రోజులు పెద్ద మొత్తంలో నిల్వ చేసుకుని, వినియోగించుకునే అవకాశం ఉంది. ఇలా పెద్ద ఎత్తున నిల్వ చేయగలిగితే ఎలక్ట్రిసిటీ గ్రిడ్‌కు కూడా రెనెవబుల్ హైడ్రోజన్‌ను సప్లై చేసేందుకు వీలవుతుంది.
- రవాణా రంగంలోనూ గ్రీన్ హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడితే డీకార్బనైజేషన్‌కు అవకాశం ఉంటుంది. ప్రధానంగా సుదూర రవాణా, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ వంటి వాటిలో ఇది ఉపయోగపడుతుంది.
- సముద్ర రవాణాలోనూ చవకైన ఇంధనాన్ని వాడుతున్నప్పటికీ, దానితో పొల్యూషన్ చాలా ఎక్కువ. అందుకే ఎక్కువ దూరం ప్రయాణించే నౌకల్లో గ్రీన్ హైడ్రోజన్ వాడితే కాలుష్యం తగ్గించినట్టు అవుతుంది.
- ఏవియేషన్‌లో కార్బన్ ఎమిషన్స్‌ను బాగా తగ్గించే సింథటిక్ ఫ్యుయెల్స్ తయారీకి కూడా గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగపడుతుంది. రైల్ లేదా రోడ్డు మార్గంలో హెవీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వంటి రంగాల్లోనూ ఇది కీలకం అవుతుంది.
- కార్బన్ ఎమిషన్స్ లేకుండా ఉత్పత్తి అయ్యే సోలార్, విండ్ పవర్ కన్నా గ్రీన్ హైడ్రోజన్ ఇంధనం అత్యధిక టెంపరేచర్లకు చేరగలదు. అందుకే విద్యుత్ ఉత్పత్తికి, ఇండ్లలో హీటింగ్ సిస్టంలకు గ్రీన్ హైడ్రోజన్‌ను వాడితే మంచి ఫలితాలు వస్తాయి.
- క్లైమేట్ చేంజ్ సమస్యపై పోరాటంలో, కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలంటే ప్రస్తుతం వాడుతున్న పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడం అనివార్యం. ఈ ఎనర్జీ ట్రాన్సిషన్‌లో గ్రీన్ హైడ్రోజన్ మంచి ప్రత్యామ్నాయం కానుంది.
ఇవీ అడ్వాంటేజెస్..
క్లీన్ ఎనర్జీ: గ్రీన్ హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడితే నీరు మాత్రమే బైప్రొడక్ట్‌గా విడుదలవుతుంది. దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదు.
పునరుత్పాదక శక్తి: భూమిపై ఎప్పటికీ తరిగిపోని సహజ వనరులు (సూర్యరశ్మి, గాలి) వంటి వాటి ద్వారా ఉత్పత్తి అవుతుంది కాబట్టి గ్రీన్ హైడ్రోజన్ అత్యుత్తమ పునరుత్పాదక శక్తి.
నిల్వ సులభం: నేచురల్ గ్యాస్ లాగానే గ్రీన్ హైడ్రోజన్‌ను కంప్రెస్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద ట్యాంకుల్లో ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు.
రవాణా కూడా ఈజీ: హైడ్రోజన్ చాలా తేలికైన మూలకం. కంప్రెస్డ్ హైడ్రోజన్ ట్యాంకులను ఈజీగా హ్యాండిల్ చేస్తూ, ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు.
పెట్రోల్ ను రీప్లేస్ చేస్తుందా?
ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాలకు ఆల్టర్నేట్ ఫ్యూయెల్స్ను వాడుతూ వాతావరణంలోకి కార్బన్ ఎమిషన్స్‌ను పూర్తిగా తగ్గించాలన్న లక్ష్యమే డీకార్బనైజేషన్. క్లైమేట్ చేంజ్‌కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో 2050 నాటికి సాధించాల్సిన ఈ డీకార్బనైజేషన్ లక్ష్యాన్ని సాధించేందుకు హైడ్రోజన్ ఒక్కటే అత్యుత్తమ ఇంధనం అని సైంటిస్టులు చెప్తున్నారు. శిలాజ ఇంధనాలను వాడుతూ, కార్బన్ ఎమిషన్స్‌ను తగ్గించలేకపోతున్న అన్ని రంగాల్లోనూ గ్రీన్ హైడ్రోజన్ మంచి ప్రత్యామ్నాయం అవుతుంది. అందుకే పారిస్ అగ్రిమెంట్, క్లైమేట్ ఎమర్జెన్సీ ఒప్పందాల్లో అంగీకరించిన జీరో ఎమిషన్ లక్ష్యాలను సాధించేందుకు దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం చాలాఉంది. అయితే, ఫ్యూచర్లో ఇది పెట్రోల్‌ను రీప్లేస్ చేస్తుందా? అంటే.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు గ్రీన్ హైడ్రోజన్ అభివృద్ధికి చేపడుతున్న చర్యలను బట్టి చూస్తే.. ఏదో ఒకరోజు ఇది శిలాజ ఇంధనాలకు బెస్ట్ ఆల్టర్నేట్గా నిలుస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా ఇండియా
పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా గ్రీన్ హైడ్రోజన్‌ను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం పోయిన ఏడాదే ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’ను ప్రారంభించింది. 2047 నాటికి విదేశాలపై ఆధారపడకుండా మన దేశంలోనే.. అది కూడా పూర్తిగా కాలుష్య రహితమైన పునరుత్పాదక ఇంధనాన్ని తయారు చేసుకోవాలన్నది ఈ మిషన్ లక్ష్యం. అలాగే 2070 నాటికి నెట్ జీరో (గ్రీన్ హౌజ్ వాయువుల ఉద్గారాలను జీరోకు తీసుకురావడం) టార్గెట్‌ను సాధించాలనీ కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’ కోసం గత జనవరిలో 19,744 కోట్ల రూపాయలు కేటాయించింది. భవిష్యత్తులో దేశాన్ని గ్రీన్ హైడ్రోజన్‌కు హబ్‌గా మార్చాలన్న లక్ష్యంతో పైలట్ ప్రాజెక్టులకు 1,446 కోట్ల రూపాయలు, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్‌కు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించింది.
మిషన్ అంచనాలు
- ఈ మిషన్ ద్వారా 2030 నాటికి రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి.
- దేశవ్యాప్తంగా కొత్తగా 6 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చు.
- 2030 నాటికి లక్ష కోట్ల రూపాయల విలువైన శిలాజ ఇంధన దిగుమతులు తగ్గిపోతాయి. 50 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హౌజ్ వాయువుల ఉద్గారాలను m తగ్గించుకోవచ్చు.
- 2030 నాటికి 125 గిగా వాట్స్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్నది ఈ మిషన్ లక్ష్యం.
- ఏడాదికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్నది లక్ష్యం.
- ఈ మిషన్ ద్వారా ఉత్పత్తి చేసే హైడ్రోజన్‌ను ఆటోమొబైల్ వాహనాల్లో ఇంధనంగా ఉపయోగిస్తారు.
- చమురు శుద్ధి, ఉక్కు కర్మాగారాల వంటి పరిశ్రమల్లోనూ ఇది ఇంధన వనరుగా ఉపయోగపడుతుంది.
::: హన్మిరెడ్డి యెద్దుల
హైడ్రోజన్ ఫ్యాక్ట్స్
- హైడ్రోజన్ మూలకాన్ని 1766లో బ్రిటిష్ సైంటిస్ట్ హెన్రీ క్యావెండిష్ కనుగొన్నాడు.
- హైడ్రోజన్ అంటే.. గ్రీకులో నీటిని తయారు చేసేది అని అర్థం
- హైడ్రోజన్‌కు రంగు, వాసన ఉండదు.
- విశ్వంలోని అన్ని పరమాణువుల్లో హైడ్రోజన్ పరమాణువులే 90% ఉంటాయి.
- మనిషి శరీరం బరువులో హైడ్రోజన్ 10% ఉంటుంది.
- సూర్యుడి ద్రవ్యరాశిలో మూడొంతులు.. 73% హైడ్రోజనే.
- దాదాపు అన్ని నక్షత్రాల్లో హైడ్రోజన్ ఉంటుంది. హైడ్రోజన్ మండి హీలియంగా మారే క్రమంలో అవి ప్రకాశిస్తాయి.
- గాలి కన్నా హైడ్రోజన్ 14 రెట్లు తేలికగా ఉంటుంది.
- హైడ్రోజన్ మైనస్ 253 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ వద్ద లిక్విడ్‌గా మారుతుంది.
- ఒక కారు 5 కిలోల హైడ్రోజన్ ఇంధనంతో 500 కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలదు.
- 2021 చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా 41,700 హైడ్రోజన్ కార్లు అమ్ముడుపోయాయి.
సవాళ్లు
గ్రీన్ హైడ్రోజన్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దీని ఉత్పత్తి, వినియోగం విషయంలో ఇంకా అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. రీసెర్చ్, గవర్నమెంట్ పాలసీలు, ప్రైవేట్ పెట్టుబడులు వంటివి ప్రస్తుతం ఉన్న అడ్డంకులు. అయితే, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఖర్చు చాలా ఎక్కువ. కానీ ఇటీవల పునరుత్పాదక ఇంధనాల ధరలు తగ్గుముఖం పడుతుండటంతో దీని ఖర్చు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు సోలార్ కరెంట్ ధరలు పదేండ్ల కిందటితో పోలిస్తే ఇప్పుడు దాదాపు 10 రెట్లు తగ్గాయి. విండ్ పవర్ ధర సగం వరకూ తగ్గింది. గతంతో పోలిస్తే ఇప్పుడు వీటితో గ్రీన్ హైడ్రోజన్ తయారీ ఖర్చు తగ్గుతుంది. బ్లూమ్ బర్గ్ ఎన్ఈఎఫ్ సంస్థ రిపోర్ట్ ప్రకారం.. సరైన పాలసీలను రూపొందిస్తే 2050 నాటికి ఏటా గ్రీన్ హైడ్రోజన్ డిమాండ్ 700 మిలియన్ టన్నులకు చేరుతుంది. అందువల్ల ఇందులో పెట్టుబడులు ప్రస్తుతానికి చాలా ఖర్చు అయినప్పటికీ, భవిష్యత్తులో మాత్రం ఇది అతిపెద్ద ఫైనాన్షియల్ ఆపర్చునిటీగా మారుతుందని చెప్తున్నారు.