
న్యూఢిల్లీ: ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎఫ్‌డీఐ) ఈక్విటీ ఇన్‌ఫ్లోస్ కిందటి ఆర్థిక సంవత్సరంలో ఏడాది ప్రాతిపదికన 3.49 శాతం తగ్గి 44.42 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి. సర్వీసెస్, కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్, టెలికం, ఆటో, ఫార్మా సెక్టార్లలోకి వచ్చే విదేశీ పెట్టుబడులు తగ్గాయి. 2022–23 లో 46.03 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐ ఇన్‌ఫ్లోస్ వచ్చాయి. ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌లో మాత్రం 12.38 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐ ఇన్‌ఫ్లోస్ రాగా, కిందటేడాది ఇదే టైమ్‌లో వచ్చిన 9.28 బిలియన్ డాలర్లతో పోలిస్తే 33.4 శాతం పెరిగాయి.
ఈక్విటీ ఇన్‌ఫ్లోస్, అదనపు పెట్టుబడులు, ఇతర క్యాపిటల్ పెట్టుబడులు వంటివి కలుపుకుంటే మొత్తం ఎఫ్‌డీఐలు కిందటి ఆర్థిక సంవత్సరంలో 70.95 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2022–23 లో వచ్చిన ఎఫ్‌డీఐలు 71.35 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఒక శాతం తగ్గాయి. 2021–22 లో గరిష్టంగా 84.83 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలను ఇండియా దక్కించుకుంది. మారిషస్, సింగపూర్, యూఎస్, యూకే, యూఏఈ, కేమాన్ ఐలాండ్స్, జర్మనీ, సైప్రస్ నుంచి ఎఫ్‌డీఐలు తగ్గగా, జపాన్, నెదర్లాండ్స్ నుంచి పెరిగాయి.