న్యూఢిల్లీ: జీ ఎంటర్‌టైన్‌మెంట్– సోనీ ఇండియా విలీనం ముందుకు సాగకపోవచ్చని నేషనల్ మీడియా పేర్కొంది. ఈ నెల 20లోపే సోనీ టెర్మినేషన్ నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. ఈ డీల్ విలువ 10 బిలియన్ డాలర్లు. గోయెంకా రాక సోనీకి నచ్చడం లేదని తెలుస్తోంది. రెండు కంపెనీల విలీనం కోసం ఒప్పందంపై 2021లో సంతకాలు జరిగాయి. అవసరమైన అన్ని నియంత్రణా అనుమతులు ఉన్నప్పటికీ, అనేక సమస్యల కారణంగా విలీనం ముందుకు సాగడం లేదు.
విలీనం టార్గెట్ తేదీ గడువును మరింత పెంచాలని సోనీ గ్రూప్‌కు చెందిన భారతీయ విభాగం కల్వర్ మాక్స్ ఎంటర్టైన్మెంట్ను కోరామని జీ తెలిపింది. కొత్త సంస్థకు ఎవరు నాయకత్వం వహించాలనే విషయమై కూడా రెండు సంస్థల మధ్య విభేదాలు ఉన్నాయి. సోనీ తన ఇండియన్ ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌పి సింగ్‌ను టాప్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించాలని కోరుతుండగా, పునీత్ గోయెంకా కోసం జీ ఒత్తిడి చేస్తోంది. కంపెనీ నిధులను దారి మళ్లించడంలో గోయెంకా, జీ గ్రూపు చైర్మన్ సుభాష్ చంద్ర ప్రమేయం ఉందని సెబీ జూన్‌లో ఆరోపించింది. అయితే, అక్టోబర్‌లో సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ గోయెంకాపై నిషేధాన్ని ఎత్తివేసింది.
