అమరుల త్యాగాలను మరువొద్దు

అమరుల త్యాగాలను మరువొద్దు

నేను మొదటి నుంచి తెలంగాణ వాదిని. తొలిదశ తెలంగాణ ఉద్యమానికి ముందే గైర్ ​ముల్కీ ఉద్యమంలో కొట్లాడిన. విశాలాంధ్రను వ్యతిరేకించే నాయకులంతా చెన్నారెడ్డి నాయకత్వంలో ఫజల్​అలీ కమిషన్​ ముందు వాదనలు వినిపించినం. తెలంగాణకు కలిగే ఆర్థిక, సాంస్కృతిక నష్టాలను వివరించినం. కాంగ్రెస్ ​వర్కింగ్​ కమిటీ మెంబర్​గా 30 ఏండ్ల పాటు పార్టీలో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన. సీడబ్ల్యూసీ మీటింగ్​ఉంటే సాలు ఇయ్యాల వెంకటస్వామి జై తెలంగాణ అంటడు అన్న పేరు తెచ్చుకున్న. సోనియా పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత.. జరిగిన ప్రతి మీటింగ్​లో తెలంగాణ సంగతి ఏందని మేడమ్​ను నేను అడిగేది. 2004 తర్వాత వైఎస్సార్​ బెదిరింపులతో ప్రత్యేక రాష్ట్ర ముచ్చటను పార్టీ పక్కకు పెట్టింది. ఆ టైమ్​లో నేను మస్తు కోపానికొచ్చిన. తెలంగాణ ఇవ్వకుండా ఎందుకు సతాయిస్తున్నరని సోనియా గాంధీని ప్రశ్నించిన. 

2004లో ఒంటరిగా పోటీ చేయడానికి కేసీఆర్​కు హిమ్మత్ ​రాలేదు. కాంగ్రెస్​తో పొత్తు కోసం నా ఇంటికి వచ్చిండు. నా ఇంట్లనే పొత్తు చర్చలు జరిగినయి. ‘సార్​ మీరు తప్ప నాకు ఢిల్లీల ఎవ్వరూ తెల్వదు. మీరే తెలంగాణను ముందుకు తీసుకుపోవాలి. సోనియా గాంధీతో మాట్లాడి పొత్తు కుదిరిస్తే బాగుంటది’ అని అడిగిండు. దానికి నేను ఒప్పుకొని సోనియాకు విషయం చెప్పి పొత్తు కుదిరించినం. 2009 ఎన్నికలకు ముందే నా ఆరోగ్యం క్షీణించడంతో నా కొడుకు వివేక్​రాజకీయాల్లోకి వచ్చిండు. నన్ను ఆశీర్వదించినట్లే పెద్దపల్లి ప్రజలు వివేక్​ను గెలిపించిన్రు. గెలిచాక నా ముందుకు వచ్చిన వివేక్​కు నేను ఒక్కటే ముచ్చట చెప్పిన. ‘తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవాలి. నా జీవిత కాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించేటట్లు కృషి చేయాలి”అని చెప్పిన. పార్లమెంట్​లో తెలంగాణ బిల్లు పాసైనంక హైదరాబాద్​లో కేసీఆర్​ నా ఇంటికి భోజనానికి వచ్చిండు. ‘సార్​ మీరు 2004లో చొరవ తీసుకొని పొత్తు కుదిర్చి ఉండకపోతే.. ఇట్ల తెలంగాణ కల సాకరమయ్యేది కాదేమో’ అని కేసీఆర్ ​నాతో అన్నడు. 

తెలంగాణ రాష్ట్రాన్ని చూసేదాకా చావనని నేను చాలాసార్లు చెప్పిన.  నేను బతికి ఉండగానే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడి లీడర్లదే. వాళ్లు ఏ పార్టీ వాళ్లయినా తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడాలి. తెలంగాణ కోసం ఎంతోమంది తమ ప్రాణాలను తృణప్రాయంగా వదులుకున్నరు. వాళ్ల త్యాగాలను ప్రతిరోజూ యాది జేసుకోవాలి.తెలంగాణ వచ్చిన రోజున ప్రజల కళ్లలో నేను చూసిన మెరుపు అట్లనే శాశ్వతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. - గడ్డం వెంకటస్వామి (కాకా ఆత్మకథ ‘మేరా సఫర్’​ నుంచి)