మోడీ వల్లే భారత్కు జీ20 నాయకత్వం వచ్చిందనేలా ప్రచారం సరికాదు : నారాయణ

మోడీ వల్లే భారత్కు జీ20 నాయకత్వం వచ్చిందనేలా ప్రచారం సరికాదు  : నారాయణ

జీ20 సమావేశానికి నాయకత్వం వహించే అవకాశం రొటేషన్లో భాగంగానే భారత్ కు వచ్చిందని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. కానీ ప్రధానిగా మోడీ ఉండడం వల్లే ఈ అవకాశం వచ్చినట్లుగా బీజేపీ ప్రచారం చేసుకోవడం విడ్డూరమన్నారు. జీ20 సదస్సులో మహిళా సాధికారత అనే ఒక అంశం ఉందని.. దేశంలో మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించకుండా ఈ అంశంపై మాట్లాడే అర్హత భారత్కు లేదన్నారు. సంపూర్ణ మెజారిటీతో అధికారంలో ఉన్న బీజేపీ..ఈ బిల్లు ఆమోదం పొందేలా చూడాలన్నారు.

వందేళ్ల సీపీఐ ప్రయాణంలో భాగంగా పార్టీ సభ్యత్వ నమోదు చేపడతామని.. 10 లక్షల సభ్యత్వాలు టార్గెట్గా పెట్టుకున్నట్లు నారాయణ చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థలను రక్షించేలా పోరాటాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రాంతీయవాదం, మతతత్వం, డబ్బు ప్రభావం ఎక్కువగా పెరిగిందని.. ఈ మూడింటికి కమ్యూనిస్టులు దూరమన్నారు. కమ్యూనిస్టుల బలహీనత కారణంగానే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చి బలోపేతమయ్యాయని అన్నారు. లేదంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టు పార్టీయే నిలబడేదని చెప్పారు. కమ్యూనిస్టుల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.