ప్రపంచ సంపదలో జీ7 వాటా 60శాతం

ప్రపంచ సంపదలో జీ7 వాటా 60శాతం

పోటీ పరీక్షల్లో జనరల్​ స్టడీస్  పేపర్​లో అంతర్జాతీయ వ్యవహారాలు కీలకాంశం. ఇందులో ఎక్కువ మార్కులు సాధించాలంటే అంతర్జాతీయ కూటములు, వాటిలో భారత్​ పాత్ర గురించి లోతుగా చదవాల్సి ఉంటుంది. జీ7 సమావేశాలను పురస్కరించుకొని గ్రూప్​ ఆఫ్​ నేషన్స్​ గురించి తెలుసుకుందాం. 

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం  కోసం నాలుగు దేశాలు కలిసి  జీ–4 కూటమిగా ఏర్పడ్డాయి. ఆ దేశాలు జర్మనీ, జపాన్​, భారత్, బ్రెజిల్.​ యూఎన్​ఓ ఏర్పడిన నాటి నుంచి ఈ దేశాలు భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికయ్యాయి. కానీ, శాశ్వత సభ్య దేశాలతో సమానంగా ఆర్థికంగా, రాజకీయంగా పోటీ పడుతుండటంతో శాశ్వత సభ్యత్వం  కోసం పోటీ పడుతున్నాయి. 

జీ-5: అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య సహాయ సహకారాలు పెంపొందించడానికి, అంతర్జాతీయ పాలన, ఆర్థిక సుస్థిరత సాధించడానికి, జీ–7 కూటమిలో సభ్యత్వం కోసం 2005లో ఐదు దేశాలు కలిసి జీ–5 గా ఏర్పడ్డాయి. ఆ దేశాలు చైనా, బ్రెజిల్​, ఇండియా, మెక్సికో, దక్షిణాఫ్రికా. ఈ దేశాలను జీ–8 వార్షిక సదస్సులకు చర్చల నిమిత్తం 2007వ సంవత్సరం నుంచి ఆహ్వానిస్తున్నాయి. 2014 మార్చిలో రష్యాను తొలగించడంతో ప్రస్తుతం గ్రూప్​7+5గా ఉంది. అంతర్జాతీయ పాలన, ఆహారం, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు తదితర రంగాలకు జీ– 5 సానుకూల సాయాన్ని అందిస్తుంది. 

జీ-15 : 1989లో బెల్​గ్రేడ్​లో జరిగిన 9వ అలీనోద్యమ ​ శిఖరాగ్ర సమావేశంలో  వేగంగా అభివృద్ధి చెందుతున్న  దేశాలు కలిసి జీ 15 ను ఏర్పాటు చేశాయి. ఈ కూటమి తొలి శిఖరాగ్ర సమావేశం 1990లో మలేషియాలో జరిగింది. నాలుగో సమావేశం 1994లో  ఇండియాలో జరిగింది. చివరగా 2012లో 15వ జీ–15  సమావేశం శ్రీలంక రాజధాని కొలంబోలో నిర్వహించారు. ఆ దేశ అధ్యక్షుడు మహింద్ర రాజపక్ష హోస్ట్​గా వ్యవహరించారు.  

వ్యవస్థాపక దేశాలు: 15 
ప్రస్తుత సభ్య దేశాలు: 17
(అల్జీరియా, అర్జెంటీనా, బ్రెజిల్​, చిలీ, ఈజిప్టు, ఇండియా, ఇండోనేషియా, ఇరాన్​, జమైకా, కెన్యా, మలేషియా, మెక్సికో, నైజీరియా, సెనెగల్​, శ్రీలంక, వెనిజులా, జింబాబ్వే

లక్ష్యాలు: అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించడం.ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆర్థికపరమైన అంశాలపై పున:సమీక్షలు చేయడం.సౌత్​–సౌత్​ దేశాల మధ్య సహకారం పెంపొందించడం.

జీ 20: 1990లో గ్రూప్​–20 ఏర్పాటైంది. 19 దేశాలతోపాటు యురోపియన్​ కలిసి జి–20గా వ్యవహరిస్తున్నాయి.  

సభ్యదేశాలు: అర్జెంటీనా, బ్రెజిల్, చైనా,  జర్మనీ,  ఇండోనేషియా,  జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్సు, ఇండియా, ఇటలీ,  మెక్సికో, దక్షిణ కొరియా, రష్యా, టర్కీ, అమెరికా, దక్షిణ ఆఫ్రికా, సౌదీ అరేబియా, బ్రిటన్​, యూరోపియన్ యూనియన్.​జీ–20 దేశాల అధినేతలు సంవత్సరానికి ఒకసారి సమావేశమైతే, ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు రెండు సార్లు సమావేశమై అనేక అంశాలపై చర్చిస్తారు. జీ–20లోని ప్రతి సభ్య దేశం ఏడాదికి ఒకసారి చొప్పున అధ్యక్షత వహించి, వార్షిక అజెండాను నిర్దేశిస్తుంది. తొలి సమావేశం 1999 డిసెంబర్​లో బెర్లిన్​(జర్మనీ)లో జరిగింది. ఈ కూటమి చర్చల్లో ఐఎంఎఫ్​, వరల్డ్​ బ్యాంక్​ కూడా పాల్గొన్నాయి. 14వ సమావేశం 2019లో జపాన్ లోని ఒసాకా లో జరిగింది. 

లక్ష్యాలు: సుస్థిరాభివృద్ధిని, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడానికి సభ్య దేశాల మధ్య సహకారాలను పెంపొందించడం. భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాలు పునరావృతం కాకుండా ఆర్థిక నియంత్రణ చర్యలు చేపట్టడం. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను ఆధునికీకరించడం, సభ్య దేశాల మధ్య వాణిజ్యం అడ్డంకులను తొలగించడం.
జీ-24: అంతర్జాతీయంగా ఆర్థికపరమైన, అభివృద్ధిపరమైన అంశాలకు 1971లో గ్రూప్​ – 24 ఏర్పడింది. 
సభ్యదేశాలు: 24: ఆఫ్రికా దేశాలు (9): అల్జీరియా, కొటేడీ ఐవరీ, ఈజిప్టు, ఇథియోపియా, గబాన్​, ఘనా, నైజీరియా, దక్షిణాఫ్రికా, కాంగో.

లాటిన్​ అమెరికా, కరేబియన్​ దేశాలు(8): అర్జెంటీనా, బ్రెజిల్​, కొలంబియా, గ్వాటీమాలా, మెక్సికో, పెరూ, ట్రినిడాడ్​, టొబాగో, వెనిజులా
ఆసియా దేశాలు(7): ఇండియా, ఇరాన్​, లెబనాన్​, పాకిస్తాన్​, ఫిలిప్పీన్స్​, శ్రీలంక, సిరియా
ఆతిథ్య దేశం: చైనా
లక్ష్యాలు: అంతర్జాతీయ ఆర్థికపరమైన నిర్ణయంలో జీ– 24 సభ్య దేశాలు తమ ప్రయోజనాల కోసం కృషి చేయడం
   అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య విత్తపరమైన వ్యూహాలను రూపొందించడం.
   1981లో జరిగిన గాబన్​ సమావేశం నుంచి ప్రత్యేక ఆహ్వానిత దేశంగా చైనా ఈ గ్రూప్​లో ఉంది.   

జీ–7: పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల సమూహం గ్రూప్​–8ను 1975లో ఏర్పాటు చేశారు. 
1975 : జీ–6    యూఎస్​ఏ, యూకే, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్​, ఇటలీ
1976: జీ–7    కెనడా చేరిక
1997: జీ–8    రష్యా చేరిక 
ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌కు చెందిన క్రిమియాపై రష్యా దురాక్రమణకు దిగడంతో 2014 మార్చిలో రష్యాను సస్పెండ్​ చేయడంతో ప్రస్తుతం జీ–7 కూటమిగా పిలుస్తున్నారు. అభివృద్ధి చెందిన 7 దేశాల మధ్య పరస్పర వాణిజ్య, రక్షణ, ఇంధన సహకారాలను ప్రోత్సహించడానికి, అంతర్జాతీయ సంక్షోభాలను ఎదుర్కోవడానికి ఈ దేశాలు సమాఖ్యగా ఏర్పడ్డాయి. ఈ బృందం తనని తాను ఒక ‘విలువలతో కూడిన సమాజం’ గా పరిగణిస్తుంది. ఉమ్మడి ప్రయోజనాల అంశాలపై చర్చించడానికి ఏడాది పొడవునా జీ–7 దేశాల మంత్రులు, అధికారులు సమావేశమవుతుంటారు. ప్రతి సభ్య దేశమూ ఒక్కో ఏడాది జీ7 అధ్యక్ష బాధ్యతను చేపడుతుంది. ఆ దేశమే కీలకమైన శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తుంది.  
అంకెల్లో జి–7
సభ్యదేశాలు: ఏడు
ప్రపంచ సంపదలో వాటా: 60శాతం
ప్రపంచ జీడీపీలో వాటా: 46శాతం
ప్రపంచ జనాభాలో వాటా: 1/10
సమావేశం    సంవత్సరం    ఆతిథ్యం
   47                   2021             యూకే
   48                   2022             జర్మనీ
   49                   2023             జపాన్​
   50                   2024             ఇటలీ
48వ సమావేశం
జర్మనీలోని ఎల్​మావ్​లో జీ–7 దేశాల 48వ శిఖరాగ్ర సమావేశం జూన్​ 26–28 మధ్య జరిగింది. ఇందులో సభ్యదేశాలు అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్​, కెనడా, జపాన్​తోపాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ఇండియా, అర్జెంటీనా, ఇండోనేషియా, సెనెగల్​, దక్షిణాఫ్రికా పాల్గొన్నాయి. వాతావరణం, ఇంధనం, ఆరోగ్యం అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. 

ఉమ్మడి ప్రకటన ప్రధానాంశాలు
ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు ఏర్పడిన ముప్పును ఎదుర్కోవడానికి 450 కోట్ల డాలర్లు వెచ్చించాలని జీ–7 దేశాలు నిర్ణయించాయి. ఇందులో అమెరికా 276 కోట్ల డాలర్లు సమకూర్చనుంది. వాతావరణ మార్పులు, పర్యావరణ క్షీణత, జీవవైవిధ్యానికి నష్టం, ఇంధన భద్రత అంశాలకు మద్దతు
మోడీ కానుకలు 

  • అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​కు గులాబీ మీనాకారి ఆభరణం, కఫ్​లింక్​ సెట్
  • జర్మనీ ఛాన్సలర్​ ఒలాఫ్​ షోల్జ్​కు నికెల్​ లోహం పూతతో కూడిన ప్రత్యేక ఇత్తడి పాత్రలు
  • బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​కు ప్లాటినం పూత పూసిన టీ–సెట్​
  • ఫ్రాన్స్​ అధ్యక్షుడు మెక్రాన్​ కు జర్దోజీ బాక్స్​
  • జపాన్​ ప్రధాని ఫుమియో కిషదాకు నల్ల కుండలు
  • ఇటలీ ప్రధాని మారియో డ్రాగీకి పాలరాయి పొదిగిన టేబుల్​ టాప్

‌-వెలుగు, ఎడ్యుకేషన్​ డెస్క్