యునైటెడ్​ నేషన్స్​లో రిఫామ్స్ తేవాలె .. జీ7 సమిట్​లో ప్రధాని మోడీ డిమాండ్

యునైటెడ్​ నేషన్స్​లో రిఫామ్స్ తేవాలె .. జీ7 సమిట్​లో  ప్రధాని మోడీ డిమాండ్
  • యునైటెడ్​ నేషన్స్​లో రిఫామ్స్ తేవాలె 
  • భద్రతా మండలిలో మరిన్ని దేశాలకు చోటివ్వాలె 
  • జీ7 సమిట్​లో  ప్రధాని మోడీ డిమాండ్ 
  • యూఎన్ ప్రస్తుత రియాలిటీకి దూరమైందని కామెంట్ 
  • జపాన్ పర్యటన ముగించుకుని  పపువా న్యూ గినియా చేరుకున్న ప్రధాని  

హిరోషిమా:  యునైటెడ్​ నేషన్స్, భద్రతా మండలిలో రిఫామ్స్ తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీ డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రపంచంలోని వాస్తవాలకు యూఎన్ దూరమైందని ఆయన కామెంట్ చేశారు. ఆదివారం జపాన్ లోని హిరోషిమా నగరంలో జీ7 దేశాల సదస్సులో జరిగిన మూడో సెషన్ లో ఆయన మాట్లాడారు. ప్రపంచ శాంతి, భద్రతల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటైన యునైటెడ్ నేషన్స్ ఉండగా.. ఈ అంశాలపై చర్చలకు ఇతర వేదికలు ఎందుకని మోడీ ప్రశ్నించారు. కనీసం టెర్రరిజం నిర్వచనాన్ని కూడా యూఎన్​లో అంగీకరించే పరిస్థితి ఎందుకు ఉండట్లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. పోయిన శతాబ్దంలో ఏర్పాటైన యూఎన్ వంటి సంస్థలు 21వ శతాబ్దానికి తగినట్లుగాలేవని అభిప్రాయపడ్డారు. యూఎన్, భద్రతా మండలి కొన్ని దేశాల కోసమే చర్చించే వేదికలుగా మారిపోయాయని, అందుకే వీటిలో రిఫామ్స్ తెచ్చి మరిన్ని దేశాలకు సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే గ్లోబల్ సౌత్ దేశాలకు కూడా ఇవి వేదికలుగా మారాల్సిన అవసరం ఉందన్నారు. యూఎన్ భద్రతా మండలిలో ప్రస్తుతం రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, యూఎస్ఏలకు మాత్రమే శాశ్వత సభ్యత్వం ఉండగా, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, జర్మనీ, జపాన్ దేశాలు కూడా శాశ్వత సభ్యతం కోసం డిమాండ్ చేస్తున్నాయి. 

ఉక్రెయిన్ వివాదం.. మానవత్వ సమస్య 

రష్యా, ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుతంగా, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధాని మోడీ మరోసారి స్పష్టంచేశారు. ఉక్రెయిన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని మానవత్వం, మానవతా విలువలకు సంబంధించిన సమస్యగా చూస్తున్నామని అన్నారు. అయితే, అన్ని దేశాలూ అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలని, ఇతర దేశాల సార్వభౌమత్వం, సమగ్రతను గౌరవించాలని మోడీ పిలుపునిచ్చారు.

జీ7 డిక్లరేషన్​పై చైనా ఫైర్ 

జీ7 దేశాలు విడుదలచేసిన ‘హిరోషిమా జాయింట్ స్టేట్ మెంట్’పై చైనా మండిపడింది. తైవాన్, తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో తాము దూకుడుగా వ్యవహరిస్తున్నామన్న విమర్శలపై దౌత్య పరంగా నిరసన తెలుపుతూ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘టిబెట్, హాంకాంగ్, జిన్ జియాంగ్​లలో చైనా మానవ హక్కులను ఉల్లంఘిస్తోంది. వీగర్ ముస్లింలను బలవంతంగా లేబర్ క్యాంపులలో బంధించి హింసిస్తోంది” అంటూ జీ7 డిక్లరేషన్​లో చేసిన ఆరోపణలనూ చైనా ఖండించింది. ఇవి తమ దేశ అంతర్గత వ్యవహారాలని, బయటి దేశాల జోక్యాన్ని అంగీకరించబోమని తేల్చిచెప్పింది. జీ7 దేశాలు గతంలో తమ దేశాల్లో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలపై ముందుగా దృష్టి పెట్టాలని సూచించింది. అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉంటున్నామని, 
ఏకపక్షంగా వ్యవహరించట్లేదని స్పష్టంచేసింది.

మోడీ కాళ్లు మొక్కిన ‘పపువా’ పీఎం 

ఆదివారం రాత్రి మోడీ పపువా న్యూ గినియాకు చేరుకున్నారు. ఆయనకు ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపే ఘనంగా స్వాగతం పలికారు. విమానం దిగి వస్తున్న మోడీ పాదాలకు మరాపే నమస్కరించారు. దీంతో మోడీ ఆయన్ను పైకి లేపి భుజం తట్టి కౌగిలించుకున్నారు. సూర్యాస్తమయం తర్వాత వచ్చిన ఏ నాయకుడికి కూడా అధికారికంగా స్వాగతం పలకకూడదని పపువా న్యూ గినియాలో నియమం ఉంది. కానీ, ప్రపంచ వేదికపై ఇండియాకు ఉన్న ప్రాముఖ్యత, మోడీ పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ఈమేరకు మరాపే రూల్స్ ను బ్రేక్ చేశారు. భారతదేశ ప్రధాన మంత్రి పపువా న్యూ గినియాలో పర్యటించడం ఇదే తొలిసారి.