
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. 2012లో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 2న డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందిన ఈరోజుల్లో ‘గబ్బర్‌సింగ్’ రిలీజ్ అయి ఉంటే ఎంత బాగుండేదో అని నా మనసులో ఎప్పటినుంచో ఒక చిన్న వెలితి ఉండేది. ఆ వెలితి ఇప్పుడు తీరింది. అప్పుడు మిస్ అయిన డిజిటల్ హంగామాని మళ్ళీ క్రియేట్ చేసి ఇస్తున్న మా అన్న గణేష్‌కి, సత్యనారాయణకి థ్యాంక్యూ.
‘గబ్బర్ సింగ్’ అంటేనే ఒక చరిత్ర. మా జీవితాలను మార్చేసిన చిత్రమిది. పుష్కరాలు పన్నెండేళ్లకు ఒకసారి వస్తాయి. ఈ సినిమా కూడా అంతే ఎవర్ గ్రీన్’ అని చెప్పారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే పవన్ కళ్యాణ్ నాకు బతుకుని ఇచ్చారు. ఆయన గురించి నేను ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమా మరోసారి విడుదల చేయడం నా అదృష్టం. రీ రిలీజ్లో కూడా టికెట్లు దొరకడం లేదు. అంత క్రేజ్ ఉంది’ అని అన్నారు. డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ, నటుడు, రచయిత రమేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.