గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం కేసులో ట్విస్ట్

గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం కేసులో ట్విస్ట్
  • మద్యం తాగి కారు నడిపినందుకు అభిషేక్ పై కేసు
  • నిషేధం ఉన్న రోజు మద్యం అమ్మినందుకు పబ్ యజమానిపై కూడా కేసు
  • ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా మద్యం తాగి కారు నడుపుతూ రాళ్లను ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరి మృతి

హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మొన్న ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో  నలుగురు స్నేహితులు గాయపడగా.. ఒకరు మృతి చెందిన కేసు విచారణలో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. మద్యం సేవించి అతి వేగంగా కారు నడిపి ఒకరి మృతి కారణం అయిన అభిషేక్ పై 304 పార్ట్  2 ఐపీసీ  సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అంతే కాదు.. ఆదివారం రోజు సిటీలో బోనాల సందర్భంగా మద్యం అమ్మకాల పై నిషేధం ఆంక్షలు విధించినా  పబ్ లో మద్యం అమ్మకాలు కొనసాగించినట్లు గుర్తించారు. మద్యం అమ్మకాల పై నిషేధం ఉన్నా మద్యం సరఫరా చేసి ఒకరి మృతికి కారకుడైన పబ్ యజమాని సుర్యనాథ్  పై కేస్ నమోదు చేసి రిమాండ్ కు తరలించారు గచ్చిబౌలి పోలీసులు. మధ్య నిషేధం ఉన్న రోజు మద్యం విక్రయించి నందుకు గాను ఎక్సైజ్ యాక్ట్ 188 కింద ఆబ్కారీ పోలీసులు కేసు నమోదు చేశారు. 
ఆదివారం ఫ్రెండ్ షిప్ డే కావడంతో నలుగురు మిత్రులు డిన్నర్ కు ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా అభిషేక్ ,సత్య ప్రకాష్, తరుణీ, ఆశ్రిత కొండాపూర్ లోని స్నోర్ట్ పబ్ కి వెళ్లి పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత నలుగురు తమ స్కోడా కారులో తిరుగు ప్రయాణమయ్యారు. కొండాపూర్ మై హోమ్ మంగళ దగ్గర కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బండ రాళ్లను ఢీకొని పల్టీ కొట్టింది. దీంతో వెనక సీటు డోర్ తెరుచుకోవడంతో ఆశ్రిత కారులోంచి ఎగిరి కిందపడింది. తలకు తీవ్రగాయం కావడంలో అక్కడికక్కడే చనిపోయింది. కేసు నమోదు చేపట్టిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా మృతి చెందిన ఆశ్రిత కెనడాలో ఎంటెక్ చదువుతున్నట్టు గుర్తించారు. కారు నడిపిన వ్యక్తి అభిషేక్ అని పోలీసుల విచారణలో తేలింది. మద్యం మత్తుతో పాటు మితిమీరిన వేగంతో కారు నడపడం కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చేనే కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు స్నోర్ట్  పబ్ లో వోడ్కా సేవించిన నలుగురు స్నేహితులు తిరిగి వెళ్తుండగా.. వీరి కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న రాళ్లను ఢీకొట్టి పల్టీ కొట్టింది.