బీఆర్ఎస్ పాలనలో ఎవరూ బాగుపడలే : గడ్డం వంశీకృష్ణ

బీఆర్ఎస్ పాలనలో ఎవరూ బాగుపడలే : గడ్డం వంశీకృష్ణ

కోల్​బెల్ట్/చెన్నూరు, వెలుగు : చెన్నూరు నియోజకవర్గంలో బాల్క సుమన్ ఐదేండ్ల పాటు దోపిడీ, దుర్మార్గాలు, బెదిరింపులతో పాలన కొనసాగించాడని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తానని నమ్మించి మోసం చేశాడని ఆయన ఫైర్​ అయ్యారు. శనివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండల పరిధిలో గల పారిపెల్లి, పిన్నారం, ఎడగట్టా, ఎసన్వాయి, వై.సర్వాయిపేట గ్రామాల్లో తన తండ్రికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెన్నూరు నియోజకవర్గంలో యూత్ అణచివేతకు గురైందన్నారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. నీతి, నిజాయితీతో, న్యాయంగా ఉండి ప్రజలకు సేవలందిస్తున్న వివేక్ వెంకటస్వామిని గెలిపించుకోవాలని ఆయన సూచించారు. సింగరేణిలో వేలాది ఉద్యోగాలను ఇప్పించిన ఘనత కాకా వెంకటస్వామికి దక్కిందన్నారు. పెద్దపల్లి పార్లమెంటు, చెన్నూరు నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు తాగునీటిని అందించేందుకు కాకా వెంకటస్వామి ట్రస్ట్ బోర్లు నిర్మించిందని గుర్తుచేశారు. “పదేండ్లు దోపిడీ రాజ్యంలో బతికారు. ఇప్పుడు కాంగ్రెస్​ను గెలిపిస్తే సేవకుల రాజ్యంలో బతుకుతారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ క్యాతనపల్లిలో రూ.2 కోట్లతో, హైదరాబాద్​లో రూ.5 కోట్లతో ఇండ్లు ఎలా కట్టుకున్నాడు? అది అవినీతి, అక్రమాలు, దోపిడీ పాలనతోనే సాధ్యమైంది. 

ఇసుక దందా చేస్తూ వేల కోట్లు దండుకున్నాడు..” అని వంశీకృష్ణ ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ఎవరూ బాగుపడలేదన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్​ను గెలిపిస్తే మీతో పాటు మీ పిల్లల జీవితాలు బాగుపడుతాయని అన్నారు. అనంతరం పారిపెల్లి, సర్వాయిపేటలో 150 మంది బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు వంశీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, పోటు రాంరెడ్డి, సిర్సా బాపురెడ్డి, రాఘునాథ్​ రెడ్డి, నామని లింగయ్య  తదితరులు పాల్గొన్నారు.

వివేక్ వెంకటస్వామి విజయానికి సహకరించాలి..

వివేక్ వెంకటస్వామి విజయానికి యువత, పెద్దలు సహకరించాలని వంశీకృష్ణ కోరారు. శనివారం ఉదయం మందమర్రి హైస్కూల్ గ్రౌండ్​లో యూత్, పెద్దలు, సింగరేణి ఉద్యోగులతో కలిసి వాకింగ్ చేశారు. వివేక్​ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. తమ కుటుంబం క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. కొద్దిసేపు స్థానిక క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు. ఆపై మార్కెట్ ఏరియాలో పార్టీ కార్యకర్తలు, లీడర్లతో కలసి ప్రచారం చేశారు. ఆ తర్వాత టిఫిన్ సెంటర్​లో దోశ వేశారు. అక్కడి పూల షాపులో వ్యాపారులతో చిట్ చాట్ చేశారు. వంశీకృష్ణ వెంట కాంగ్రెస్ సీనియర్ లీడర్లు నూకల రమేశ్, రాఘునాథ్​రెడ్డి, నల్లాల క్రాంతి, సొత్కు సుదర్శన్, బండి సదానందం, నోముల ఉపేందర్​గౌడ్, మహంతి అర్జున్,  నీలయ్య,  నెర్వేట్ల శ్రీనివాస్, దుర్గం ప్రభాకర్, గడ్డం రజనీ తదితరులు పాల్గొన్నారు.