సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ప్రజలంతా క్షేమంగా ఉండాలి: గడ్డం వంశీకృష్ణ

సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ప్రజలంతా క్షేమంగా ఉండాలి: గడ్డం వంశీకృష్ణ

సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు కాంగ్రెస్ యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి, ఎలిగేడు మండల కేంద్రాల్లోని సమ్మక్క సారలమ్మ జాతరలో గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రామారావుతో కలసి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. మేడారం సమ్మక్క సారక్క జాతరలో సందర్భంగా ప్రజలు క్షేమంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. 

మేడారం మహాజాతరలో మరికొన్ని గంటల్లో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి అడవి నుంచి జనంలోకి రానుంది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు  చిలుకలగుట్ట నుంచి అమ్మవారిని జనంలోకి తీసుకొస్తున్నారు. అర్థరాత్రి వరకు సమ్మక్క తల్లిని గద్దెల పైకి చేర్చే ప్రక్రియ పూర్తి కానుంది.

మేడారం నుంచి చిలకలగుట్టకు వెళ్లిన పూజారులు అక్కడ గంట పాటు ప్రత్యేక పూజలు చేశారు. డప్పు చప్పుళ్లు, దివిటీల వెలుగులు, కోయ కళాకారుల నృత్యాలు, ఆదివాసీ తెగల సంబురం మధ్య అమ్మ అడవి నుంచి బయల్దేరింది. అమ్మవారి రాక కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. అమ్మను గద్దెల మీద ప్రతిష్టించే సమయంలో తీవ్ర ఉద్విఘ్నత చోటు చేసుకోనుంది.