ప్రజా శాంతి పార్టీ ఆఫీసుకు వచ్చి లోపలికి రాకుండానే వెళ్లిన గద్దర్

ప్రజా శాంతి పార్టీ ఆఫీసుకు వచ్చి లోపలికి రాకుండానే వెళ్లిన గద్దర్

ప్రజా శాంతి పార్టీ ఆఫీసుకు వచ్చి లోపలికి రాకుండానే గద్దర్ వెళ్లిపోయారు. ఆరోగ్యం బాలేదని గద్దర్, కేఏ పాల్ తో చెప్పినట్టు సమాచారం. నామినేషన్ ఎపుడన్నది 10 వ తేదీ చెబుతామన్న కేఏ పాల్.. గద్దర్ పోటీ చేయకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా మునుగోడు ఉప ఎన్నికలో ప్రజా గాయకుడు గద్దర్  పోటీ చేయనున్నారని, ప్రజాశాంతి పార్టీ క్యాండిడేట్​గా ఆయన్ను బరిలోకి దింపుతున్నట్టు ఇటీవలే ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా సమాజంలో ఓట్ల విప్లవం వచ్చి జనంలో మార్పు రావాలని గద్దర్ అన్నారు. 80 శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాల ప్రజలు తమ ఓట్లు తామే వేసుకోవాలన్నారు. మునుగోడులో బలమైన పార్టీలు, అభ్యర్థులు పోటీలో ఉన్నారని, తన దగ్గర కట్టుబట్టలు, గొంగడి తప్ప ఏమీ లేదన్నారు. పార్టీలో చేరాలని చాలా మంది అడిగారని, తాను మాత్రం చేరలేదన్నారు.  

తొలిసారి ఎన్నికల బరిలోకి..

గద్దర్ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో ఊపు తెచ్చిన ఆయన... రాష్ట్ర ఏర్పాటు తర్వాత  ఏ పార్టీలోనూ చేరలేదు. అప్పుడప్పుడు పలు వేదికలపై కన్పించినా పూర్తి స్థాయిలో ఏ పార్టీకీ మద్దతు ఇవ్వలేదు. మూడు పార్టీలు పోటాపోటీగా తలపడుతున్న మునుగోడులో గద్దర్​ పోటీ చేస్తుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.