
యాదగిరిగుట్ట, వెలుగు : పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్టలోని వేదాద్రి ఫంక్షన్ హాల్ లో సోమవారం నిర్వహించిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పెన్షనర్ల సంఘం 28వ వార్షికోత్సవ సభకు ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. యాదగిరిగుట్ట ఆలయ రిటైర్డ్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు దర్శనంతోపాటు వారికి అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పనలో రిటైర్డ్ ఉద్యోగులు పోషించిన పాత్ర మరువలేనిదని కొనియాడారు. పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఎన్జీవోల మాదిరిగా పెన్షనర్లకు కూడా హెల్త్ కార్డులు ఇప్పించడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలిపారు. పెన్షనర్ల విజ్ఞప్తి మేరకు త్వరలో స్థలం కేటాయించి పెన్షనర్ల భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేపిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు నర్సింహారావు, ప్రధాన కార్యదర్శి యాదగిరి, ఉపాధ్యక్షులు కలకుంట్ల బాలనర్సయ్యగౌడ్, హనుమంతరావు, ఆలయ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులుగౌడ్, యాదగిరిగుట్ట ఆలయ రిటైర్డ్ ఏఈవో రామ్మోహన్, యాదగిరిగుట్ట ఆలయ చైర్మన్ నర్సింహమూర్తి, డిప్యూటీ ఈవో భాస్కర్ శర్మ, పెన్షనర్లు పాల్గొన్నారు.