
నల్గొండ అర్బన్, వెలుగు : పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయాలని ఏఐసీసీ సెక్రటరీ, నల్గొండ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి సంపత్ కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం నల్గొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ పార్టీ-, ప్రభుత్వం జోడెడ్ల లాగా పనిచేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతూ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తుందని వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రజలకు అందే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. డీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. అంతకుముందు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.
టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్, నల్గొండ, తిప్పర్తి, కనగల్ మాజీ జెడ్పిటిసిలు వంగూరి లక్ష్మయ్య,పాశం రామ్ రెడ్డి, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ మనిమద్ది సుమన్, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుప్ రెడ్డి, నల్గొండ పీఏసీఎస్ చైర్మన్ నాగరత్నం రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు
హాలియా, వెలుగు : పార్టీ కోసం కష్టపడిన వారిని అధిష్టానం గుర్తించి పదవులు ఇస్తుందని ఏఐసీసీ సెక్రటరీ, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి సంపత్ కుమార్ అన్నారు. సోమవారం హాలియా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీసీసీ, బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్, జిల్లా బాడీ పదవుల కోసం పోటీపడేవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పార్టీ పదవులు పొందిన వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదన్నారు. అనంతరం జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జన్మ దిన వేడుకలను పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లయ్య, మాజీ జడ్పీ చైర్మన్ లింగారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధవి, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ చంద్రశేఖర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.