హైదరాబాద్ : 6న గద్దర్ 2వ వర్ధంతి

హైదరాబాద్ :  6న గద్దర్ 2వ వర్ధంతి
  • గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సూర్య కిరణ్ 

హైదరాబాద్​సిటీ, వెలుగు: గద్దర్ ద్వితీయ వర్ధంతి సభ ఆగస్టు 6న మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగనుందని గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి సూర్యకిరణ్ తెలిపారు. ఫౌండేషన్ సభ్యులతో కలిసి గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. 

జీవితాంతం ప్రజల కోసం ఆడి పాడిన గద్దర్ ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం నిరంతరం పోరాడారని, సహజ వనరులపై అందరికీ సమాన హక్కులుండాలని నినదించారని గుర్తు చేశారు. ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన నిర్వహించే వర్ధంతి సభలో ప్రజా ప్రతినిధులు, సినీ ప్రముఖులు, మేధావులు, రచయితలు, కళాకారులు పాల్గొంటారన్నారు.

 ఫౌండేషన్ సభ్యులు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, సలహాదారులు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్​మాట్లాడుతూ.. గద్దర్ ఆలోచన బతికుండాలని గద్దర్ పేరుతో సూర్య కిరణ్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజల హక్కుల కోసం పరితపించే ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపారు.