గద్దర్​ స్ఫూర్తి ఎప్పటికీ ఉంటది : వివేక్​ వెంకటస్వామి

గద్దర్​ స్ఫూర్తి ఎప్పటికీ ఉంటది : వివేక్​ వెంకటస్వామి

బషీర్ బాగ్, వెలుగు: ప్రజా యుద్ధనౌక, కవి, గాయకుడు గద్దర్ భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన పాటలు, స్ఫూర్తి ఎప్పటికీ ప్రజల మనసులో నిలిచి ఉంటాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. గద్దర్ తన ఆట, పాటలతో కోట్ల మందికి ప్రేరణగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. బుధవారం హైదరాబాద్​లోని తెలుగు యూనివర్సిటీలో ప్రజా యుద్ధనౌక గద్దర్ సంస్మరణ కమిటీ ఆధ్వర్యంలో గద్దర్​ సంస్మరణ సభ జరిగింది. కమిటీ సభ్యుడు కేఎన్ రాందాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో వివేక్​ వెంకటస్వామి మాట్లాడుతూ.. ‘‘గద్దర్​ను 1991లో మొదటిసారి కలిసినప్పుడే ఆయన మాటలకు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. సామాన్యుడ్ని కూడా తన పాటలతో ఉద్యమకారుడిగా మార్చారు. ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన పాటల ద్వారా మన మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారు” అని పేర్కొన్నారు. గద్దర్​ పాటలను క్యాసిట్​లో పొందుపరిచి అందరికీ అందించాల్సిన అవసరం ఉందన్నారు. 

గన్ను కన్నా ఓటు బలమైన ఆయుధమని అంటుండె: వెన్నెల

గద్దర్ కూతురు వెన్నెల మాట్లాడుతూ.. ‘‘ఎప్పుడూ ధైర్యంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో ఎడ్వకూడదని నాన్న చెప్తుండె. సమాజం కోసం నాన్న చేసిన పోరాట స్ఫూర్తిని నేటి యువత తరం ముందుకు తీసుకెళ్లాలి” అని సూచించారు. గన్ను కన్నా ఓటు బలమైన ఆయుధం అని తన తండ్రి చెప్పేవారని,  ఆ ఓటు అనే ఆయుధాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలని అన్నారు. 

తెలంగాణ తెచ్చింది గద్దర్​..కేసీఆర్​ కాదు: కంచ ఐలయ్య

‘‘అసలు తెలంగాణ తెచ్చింది గద్దర్.. కేసీఆర్ కాదు” అని  ప్రొఫెసర్​ కంచ ఐలయ్య అన్నారు. గద్దర్​ యూనివర్సల్​ లెజెండ్​ అని ఆయన పేర్కొన్నారు. సీనియర్​ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ..  ప్రజా సమస్యలపై గద్దర్​ ఎన్నో పాటలు రాసి, పాడి సమాజాన్ని చైతన్య పరిచారని పేర్కొన్నారు. గద్దర్ పాటలు వింటే ఒక కవాతు కండ్ల ముందు కనిపిస్తుందని ప్రజా కవి జయరాజ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్, పీఓడబ్ల్యూ సంధ్య , బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్ రాములు, నందిని సిద్దారెడ్డి , ఏపూరి సోమన్న , జేబీ రాజు తదిరులు పాల్గొన్నారు.