గడ్డి అన్నారం కార్పొరేటర్ వేధింపులతో .. ఈవెంట్ ఆర్గనైజర్ సూసైడ్

గడ్డి అన్నారం కార్పొరేటర్ వేధింపులతో .. ఈవెంట్ ఆర్గనైజర్ సూసైడ్

ఎల్​బీనగర్, వెలుగు :  ఓ కార్పొరేటర్ తో పాటు ఓ మహిళ పెట్టే వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగోల్ పోలీసులు తెలిపిన ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన చెమ్మల బాలవర్ధన్ రెడ్డి (36) అంజలి దంపతులు పిల్లలతో కలిసి కొంతకాలం కిందట సిటీకి వచ్చి నాగోల్  జైపురి కాలనీ సమీపంలోని శ్రీనివాస్ కాలనీలో అద్దెకు ఉంటున్నారు.

బాలవర్ధన్ రెడ్డి ఈవెంట్ ఆర్గనైజర్, రియల్ ఎస్టేట్ డీలర్ గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. గత నెల 30న అతడు తనకు వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని భార్యకు చెప్పాడు. దీంతో అతని మాటలు నమ్మిన ఆమె  పిల్లలను తీసుకుని తన అక్క ఇంటికి వెళ్లింది. గత నెల31న అంజలి భర్తకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. పక్క ఇంట్లోని వారికి ఫోన్ చేసి తన భర్త ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని తెలిపింది. వారు ఇంటికి వెళ్లి చాలాసార్లు తలుపుతట్టినా అతడు తీయలేదు. కిటికిలోంచి చూడగా బాలవర్ధన్ రెడ్డి ఉరేసుకుని కనిపించాడు.  వెంటనే తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూసేసరికి అతడు చనిపోయి ఉన్నాడు. భార్యకు సమాచారం ఇవ్వగా భార్య ఇంటికి వచ్చింది. ఇంటి పరిసరాల్లో పరిశీలించగా.. భర్త  సూసైడ్ నోట్ దొరికింది. 

‘నేను ఏం తప్పు చేశానో చెప్పండి’..

అందులో “ నా ఆత్మహత్యకు కారణం భాగ్య అనే మహిళ, గడ్డి అన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అని, నాపై అత్యాచారం కేసు పెడతామని బెదిరించారు. కార్పొరేటర్ మీకు ఎవరు వచ్చి ఏం చెప్పారో నాకు తెలియదు. కానీ మీరు గుడ్డిగా నమ్మి కొన్నివర్గాల ఓట్ల కోసం నన్ను బలి పశువును చేశారు. మీ రాజకీయం కోసం ఒక  కుటుంబాన్ని బలి పశువును చేశారు. దయచేసి నా పరిస్థితి మరొకరికి రానివ్వకండి. నా మీద రేప్ కేసు పెట్టిస్తా .. అని అంటున్నావు. నేను ఎవరితో తప్పు చేశా చెప్పండి ప్రేమ్ గారు.

మీకు డబ్బు, రాజకీయం అండ ఉందని నన్ను ఎంత హింసించావో మర్చిపోకండి’’. అంటూ సూసైన్ నోట్ లో మృతుడు పేర్కొన్నాడు. అయితే.. గత నెల 30న కొంతమంది ఇంటికి వచ్చి తన భర్తతో గొడవ పెట్టుకుని అవమానపరిచారని, బెదిరించడంతో పాటు మానసికంగా వేధించారని, దీంతో అతడు భయాందోళన చెంది ఉరేసుకుని చనిపోయాడని అంజలి నాగోలు పోలీసులకు కంప్లయింట్ చేసింది.  భాగ్య అనే మహిళ, కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

కారు కొనుగోలుకు డబ్బులు ఇవ్వగా.. 

 కారు కొనుగోలుకు బాలవర్ధన్ రెడ్డికి భాగ్య అనే మహిళ  రూ. 2 లక్షల 50వేలు ఇవ్వగా అతను మరోచోట ఆ డబ్బులు కట్టాడు. ఆమె తనకు కారు వద్దు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరింది. అతను కారు కోసం డబ్బులు ఇచ్చిన వ్యక్తిని అడగితే ఇచ్చేందుకు నిరాకరించాడు. డబ్బుకు బదులు కారు తీసుకోవాలని సూచించాడు. అనంతరం భాగ్య, కార్పొరేటర్  వచ్చి స్థానికుల ముందు అవమానించడంతో తట్టుకోలేక బాలవర్ధన్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భాగ్య, ఆమె భర్త, బీజేపీ కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పై ఐపీసీ 306,448,504,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు నాగోల్ పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతుడి సొంతూరిలో  అంత్యక్రియలు నిర్వహించారు.