గడీల పాలన పోయి ప్రజా పాలన వచ్చింది : దుబ్బాక యాదయ్య

 గడీల పాలన పోయి ప్రజా పాలన వచ్చింది : దుబ్బాక యాదయ్య

ముషీరాబాద్, వెలుగు:  పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా విస్మరించి కార్మికులను నిర్లక్ష్యం చేసిందని టీఎస్ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దుబ్బాక యాదయ్య మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో గడీల పాలన పోయి.. ప్రజా పాలన వచ్చిందన్నారు. బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం బస్ భవన్ వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్టీసీ కార్మికుల స్థితిగతులను తెలుసుకొని వారి సమస్యల పరిష్కారాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చిన రేవంత్ రెడ్డి, అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు వివేక్ వెంకటస్వామి ఫొటోలకు ఉద్యోగులు పాలాభిషేకం చేశారు.

అనంతరం దుబ్బాక యాదయ్య మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ సమస్యలపైన దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు. గత ప్రభుత్వంలో అధికంగా నష్టపోయింది ఆర్టీసీ కార్మికులేనన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. ఆర్టీసీలో 15వేల పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ వేసి బస్సులు కొనుగోలు చేయాలని కోరారు. 50 ఏళ్లు  దాటిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ప్రకారం కోటా కల్పించాలని కోరారు. టీఎస్ ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ పి సుభాష్ పాల్గొన్నారు.