ఇతర రాష్ట్రాల వడ్లు తెలంగాణలోకి రానీయవద్దు : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

ఇతర రాష్ట్రాల వడ్లు తెలంగాణలోకి రానీయవద్దు : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
  •     జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

గద్వాల/ కేటి దొడ్డి, వెలుగు: ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా వడ్లు రాకుండా చెక్‌‌పోస్టుల వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం మండలం పరిధిలోని నందిన్నే కర్ణాటక సరిహద్దు చెక్‌‌పోస్టును  కలెక్టర్​ సందర్శించారు. అలాగే కొండాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.  చెక్‌‌పోస్టుల వద్ద వాహనాలను కచ్చితంగా తనిఖీ చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి వాహన నంబర్, తీసుకొస్తున్న సరుకు, బిల్లులు తదితర వివరాలను రిజిస్టర్‌‌లో నమోదు చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకువచ్చే సమయంలో ప్యాడీ క్లీనర్ వినియోగిస్తే నాణ్యమైన ధాన్యం లభిస్తుందని అన్నారు. 

అనంతరం కె.టి.దొడ్డి మండల కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. మొక్కజొన్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గద్వాల పట్టణంలోని జములమ్మ ఆలయ పరిసరాల్లో చెత్త ఉండకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. సాయంత్రం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌‌లో టెంట్ హౌస్ యజమానులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.